వరంగల్ లో PM-SHRI పథకం, డ్రాపౌట్ల తగ్గింపు, SC/ST విద్యార్థుల స్కాలర్షిప్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరాలు కోరిన ఎంపీ డా.కడియం కావ్య
వరంగల్ జిల్లాలో విద్యా రంగ అభివృద్ధి, పాఠశాలల అప్గ్రేడేషన్, ఉన్నత విద్య, సౌకర్యాలు, SC/ST విద్యార్థుల స్కాలర్షిప్ల అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. ఈ మేరకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి RUSA పథకం కింద 50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, యువతకు మార్గదర్శకంగా నిలిచే ఎంట్రప్రెన్యూర్‌షిప్ హబ్‌లు ఏర్పాటు చేయబడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా PM–USHA పథకం కింద 56 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయం, హనుమకొండలోని కాకతీయ పురుషుల డిగ్రీ కళాశాల, వడ్డేపల్లిలోని పింగళి మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో హాస్టల్‌లు, తరగతి గదులు, ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచబడతాయన్నారు. పాఠశాలల విషయంలో, వరంగల్ జిల్లాలోని 16 పాఠశాలలను PM–SHRI పథకం కింద ఎంపిక చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఇవి ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబడతాయని తెలిపారు. SC/ST విద్యార్థులకు ఈ సంవత్సరం తెలంగాణలో రూ.38 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో వరంగల్‌కు 144 మంది విద్యార్థులకు రూ.0.31 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా PM–AJAY పథకం కింద కాకతీయ విశ్వవిద్యాలయంలో 450 సీట్ల సామర్థ్యం గల రెండు హాస్టళ్లకు రూ.9 కోట్లు ఆమోదించబడినట్లు మంత్రి వివరించారు.
అయితే, 2023-24లో వరంగల్ జిల్లాలో సెకండరీ స్థాయిలో 22.45% మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేయడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నదని ఎంపీ డా. కావ్య పేర్కొన్నారు. విద్యార్థులు స్కూల్ వదిలిపెట్టకుండా ఉండేందుకు విద్యాశాఖ మరింత శ్రద్ధతో చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
దేశ అభివృద్ధికి అసలైన పునాది విద్యారంగమే అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. విద్యారంగాన్ని బలపరిస్తేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నారు. వరంగల్ జిల్లాలో పాఠశాలల అభివృద్ధి, డ్రాపౌట్ల తగ్గింపు, SC/ST విద్యార్థుల ప్రోత్సాహంపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.

