కె.యు RUSA ప్రాజెక్టుల గడువు పెంంచండి- కేంద్ర విద్యాశాఖ మంత్రికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19, 2025:

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న RUSA 2.0 (రిసెర్చ్ & ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువును పెంచాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి విజ్ఞప్తి చేసారు.

ఈ సందర్భంగా ఆమె వినతిపత్రాన్ని సమర్పించి, ప్రాజెక్టుల పూర్తి కోసం మరో ఏడాది గడువు పొడిగించాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, RUSA 2.0 కింద కాకతీయ యూనివర్సిటీకి మొత్తం రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో రూ.35 కోట్లు పరిశోధన ప్రాజెక్టులకు, రూ.15 కోట్లు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఉద్యోగావకాశాల విస్తరణతో పాటు ఇన్నోవేషన్ హబ్ (K-HUB) ఏర్పాటు కోసం కేటాయించినట్లు వివరించారు. 2024 జూన్‌లో పరిపాలనా అనుమతులు లభించడంతో ప్రస్తుతం ఐదు పరిశోధనా కేంద్రాలు, 37 వ్యక్తిగత పరిశోధన ప్రాజెక్టులు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయని, 75 మంది రీసెర్చ్ ఫెలోలను నియమించినట్లు తెలిపారు. అదనంగా రూ.9.4 కోట్లతో సివిల్ పనులు, ఐసీటీ మౌలిక వసతులు, ల్యాబ్ పరికరాల కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతంగా నిర్ణయించిన మార్చి 31, 2026 గడువు ఈ విస్తృత పరిశోధన కార్యక్రమాలు, మౌలిక వసతుల పనులు పూర్తిచేయడానికి సరిపోదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గడువును మార్చి 31, 2027 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు. గడువు పెంపుతో నిధుల సమర్థ వినియోగం జరిగి, పరిశోధన ఫలితాలు సార్థకంగా వెలువడతాయని, విద్యార్థులు–పరిశోధకులకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆమె స్పష్టం చేశారు.

గడువు పొడిగించకపోతే 42 పరిశోధన ప్రాజెక్టులు, 75 మంది రీసెర్చ్ స్కాలర్స్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని డా. కడియం కావ్య తెలిపారు. వరంగల్‌ను పరిశోధనలు, నూతన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Share this post

One thought on “కె.యు RUSA ప్రాజెక్టుల గడువు పెంంచండి- కేంద్ర విద్యాశాఖ మంత్రికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన