అమెరికాలో కాలుమోపాలంటే ఇక అంత ఈజీ కాదు: కొత్త పౌరసత్వ పరీక్షలు, కఠినమైన వీసా నిబంధనలు
వాషింగ్టన్ నుంచి ప్రత్యేక కథనం
అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్నవారికి ఇప్పుడు షాక్ తగిలే వార్త. అక్కడ డాలర్లతో అందమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మార్పులు తలపట్టుకునేలా ఉన్నాయి. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు మరింత కఠినంగా మారాయి.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వలసల విషయంలో నిభందనలు రోజురోజుకూ కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీసా మరియు పౌరసత్వ విధానాల్లో మార్పులపై నూతన ఆలోచనలు జరుగుతున్నాయని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధ్యక్షుడు జోసెఫ్ ఎడ్లా తెలిపారు. ఆయన ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
“ప్రస్తుతం అమెరికా పౌరసత్వ పరీక్షలు తేలికగా ఉంటున్నాయి. రాసేసుకున్న సమాధానాలతో పరీక్షను పాస్ కావచ్చు. కానీ ఇకపై పరీక్షలను గణనీయంగా క్లిష్టంగా మార్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి,” అని ఎడ్లా స్పష్టం చేశారు.
అంతేకాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు కలిగేలా హెచ్-1బీ వీసాల (H-1B Visa)పై కూడా మార్పులపై పునరాలోచన జరుగుతోందని చెప్పారు. ట్రంప్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ మార్పులను, జో బైడెన్ పాలనలో కొంత వెనక్కి తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి తెచ్చారు.
ఇక వలసదారుల పట్ల కొత్త ప్రభుత్వ వైఖరి గమనార్హంగా మారుతోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించాల్సిందేనని నిర్ణయించారు. వీసా పొందిన తర్వాత కూడా అమెరికా నిబంధనలకు లోబడి ఉండకపోతే వెంటనే బహిష్కరణ ఎదురవుతుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, పౌరసత్వానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రతిపాదన కూడా చర్చలలో ఉంది. తొలిసారిగా ఓ రియాలిటీ షో రూపంలో అమెరికా పౌరసత్వ అభ్యర్థుల దేశభక్తిని పరీక్షించాలన్న ఆలోచన అధికార వర్గాల్లో చర్చకు వస్తోంది. ఈ షోలో పోటీదారులు అమెరికాపై తమ అవగాహనను, నిబద్ధతను నిరూపించుకోవలసి ఉంటుంది.
మొత్తానికి, అమెరికాలో స్థిరపడాలంటే ఇకపై కఠిన పరీక్షలు, గట్టి నిబంధనలు తప్పవన్నమాట. విదేశీ వలసదారులకు ఇది ఒక పెద్ద సవాల్‌గా మారింది.