Headlines

వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే జిల్లాగా చేయాలి

వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే జిల్లాగా కలిపి ఉత్తర తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలి

పౌర సమాజం, రాజకీయపార్టీలు,ప్రజాసంఘాలు డిమాండ్

హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆదివారం హనుమకొండ నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్ లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన చర్చా వేదికలో జాతీయ పార్టీల జిల్లాల నాయకులు, పుర ప్రముఖులు మేధావులు పాల్గొన్నారు. సభకు ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ అధ్యక్షత వహించగా పుల్లూరు సుధాకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ వరంగల్ హనుమకొండ రెండు పరస్పరం పూరకాలని రాష్ట్ర అభివృద్ధిలో వరంగల్ ఆరు జిల్లాలన్నీ వెనుకబడి పోయాయని రాజకీయ నాయకులు చొరవ చూపాలని అన్నారు. వరంగల్, హనుమకొండ లు ఒకదాని అభివృద్ధితో మరొకటి ముడిపడి ఉన్నాయని చెప్పారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి కాకుండా రాజకీయ చైతన్యం ఎదగకుండా గత పాలకులు విభజించారని అన్నారు. పౌర సమాజం చైతన్యంతో హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలపాలన్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వాసులు వరంగల్ జిల్లా గతం, వర్తమానం, భవిష్యత్తు ను గుర్తుంచుకోవాలని దాని రాజకీయ చైతన్యాన్ని ఉనికిని చరిత్రను అభివృద్ధి గతిని కాపాడుకోవాలని గత పాలకులు జిల్లాను ఆశాస్త్రీయంగా విభజించి అభివృద్ధిని అడ్డు కున్నారన్నారు.
సీనియర్ రాజకీయ నాయకులు, సామాజిక విశ్లేషకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్ మాట్లాడుతూ గత పాలకులు కొంటెతనంతో కుట్రబుద్ధితో వరంగల్ ఉమ్మడి జిల్లాను అశాస్త్రీయంగా విభజించి దీని సమగ్ర అభివృద్ధిని అడ్డుకున్నారనీ అన్నారు. అన్ని జిల్లాల కంటే వరంగల్ నగరం వెనుకబడిందన్నారు. వరంగల్ వాసులు పట్టాదారులని, హనుమకొండ వాసులు ఉమ్మడి రాష్ట్రంలో చుట్టు ప్రక్కల నాలుగు జిల్లాల నుండి వలస వచ్చినవారని గుర్తుంచుకోవాలని అన్నారు.
వరంగల్ వ్యాపార పారిశ్రామిక కేంద్రమని హనుమకొండ ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థల కేంద్రమని అర్థం చేసుకోవాలన్నారు. వరంగల్, హనుమకొండ విభజించడం వలన వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉన్న న్యాయ వ్యవస్థ తన శక్తిని కోల్పోయిందని అన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి హనుమకొండ వరంగల్ జిల్లాలను కలపడమే ఏకైక మార్గమని అన్నారు.
జిల్లా మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎం. చుక్కయ్య మాట్లాడుతూ వరంగల్ హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజలలో గూడు కట్టుకొని ఉన్నదని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ పరిసరాల ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలను అభివృద్ధి చేయాలని రెండు జిల్లాలను కలపాలని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపడం ప్రజల కోరిక అని భాజపా హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి అన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు నూనె అప్పారావు అన్నారు. సీనియర్ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు అబూబకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు రెండు జిల్లాలను కలపడానికి ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ నాయకత్వం సహకరిస్తుందని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ సీనియర్ అద్యాపకులు, చరిత్రకారుడు ప్రొఫెసర్ విజయబాబు మాట్లాడుతూ ప్రపంచ గుర్తింపు పొందిన చరిత్ర సంస్కృతి కలిగిన వరంగల్ ట్రైసిటీని ఒకే జిల్లాలో తిరిగి నిర్మాణం చేయడం ఆ విధంగా అభివృద్ధి చేయడం అవసరమన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు చిల్ల రాజేంద్రప్రసాద్ అడ్వకేట్, ప్రముఖ రచయిత తెలంగాణ మేధావి పొట్టపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరంగల్ జిల్లా ప్రాధాన్యతను పునరుద్ధరించాలనీ అన్నారు. డాక్టర్ చింతం ప్రవీణ్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు మాట్లాడుతూ రెండు జిల్లాల కలిపి వరంగల్ జిల్లాగా మార్చడానికి ముందు ఈస్ట్ వరంగల్ అభివృద్ధి ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త గంటా రామ్ రెడ్డి మాట్లాడుతూ పౌర సమాజం వివేకవంతంగా ఆలోచించి విభజించబడిన పట్టణాన్ని తిరిగి ఒకే జిల్లాగా మార్చాలని కోరారు. వరంగల్ పారిశ్రామికంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందిందని, దానిని మరింత ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని కోరారు. చాపర్తి కుమార్ మాట్లాడుతూ వరంగల్ ఈస్ట్ అభివృద్ధి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనీ అన్నారు.ఈ సమావేశంలో హనుమకొండ రెడ్ క్రాస్ కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు బాబురావు, సామాజికవేత్త సోమ రామమూర్తి, సాయిని నరేందర్, రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్ తో పాటు అనేకమంది ఉద్యమకారులు సామాజికవేత్తలు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE