టివి నీ ఠీవి..!
టెలివిజన్ దినోత్సవం
వచ్చింది వచ్చింది..
టెలివిజన్ వచ్చింది..
అందరికీ నచ్చింది..
ఇంటికి అందం..
తొలినాళ్ళలో
స్టేటస్ సింబల్..
మొదట్లో పోర్టబుల్..
బ్లాక్ అండ్ వైట్..
పోను పోను కలర్ టివి..
అదో ఠీవి..
ఆనక బిగ్ స్క్రీన్..
హోమ్ థియేటర్..
ఎల్ ఇ డి..ఎల్ సి డి..
స్మార్ట్ టివి..
మొత్తానికి రంగు..రుచి
ఎన్ని మారినా
ఈ టీవి చిరంజీవి..!
వచ్చిన కొత్తలో
దూరదర్శన్..
అది ఉంటే చాలు..
అందులోనే వార్తలు..
వాళ్ళు ఏది చూపిస్తే
అదే వేదం..
చావు కబురు
చల్లగా చెప్పే
శాంతి స్వరూప్..
వ్యవసాయం కబుర్లు..
చెదల మందులు..
కొన్ని కామెడీ షోలు..
శుక్రవారం చిత్రలహరి..
ఆదివారమొస్తే సినిమా..
ఇదే వినోదం..
అదే ఆమోదం..!
పెరిగిన చానళ్లు..
24/7 న్యూస్..
నిపుణుల వ్యూస్..
టీఆర్పీ రేటింగులు..
వాటి కోసం
నానా అగచాట్లు..
సరికొత్త ఫీట్లు..
రియాలిటీ షోలు..
ఆటల లైవ్‌లు..
వార్తల్లో లైలు..
ఇవన్నీ ఒక ఎత్తు..
సీరియళ్లు..
వందల కొద్దీ ఎపిసోడ్లు..
సాగదీతలు..
అంతరంగాలు..
కార్తీకదీపాలు..
సంవత్సరాల తరబడి అవే..
మొత్తానికి ఇంటిల్లిపాదినీ
ఒక చోట చేర్చిన టెలివిజన్..
అలాగే నిలబెట్టుకుంది
ఘనమైన పేరు..
ఇడియట్ బాక్సని..
ఇప్పుడు ఫోనొచ్చాక
ఒక మూలకే ఫిక్సని..!
సురేష్..9948546286

