ఇదేదో రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనుకునేరు…. కాదు.. బుల్లెట్ బండ్ల నుండి తొలిగించిన సైలెన్సర్ల తో కట్టిన పైలాన్. ఎందుకు కట్టారంటే నగరంలో అధిక శబ్దాలు చేస్తూ బలాదూరుగా తిరిగే బుల్లెట్ బాబులకు బుద్ధి రావాలని.
చెవులు చిల్లులు పడేలా బుల్లెట్ బండ్లకు సైలెన్సర్లు అమర్చి తిరిగే యువకుల వెంట పడి ట్రాఫిక్ పోలీసులు వారికి దిమ్మదిరిగే లా హిత భోద చేస్తున్నారు. అయిన ఇంకా బుద్ది రావడం లేదు.
గతంలో సైలెన్సర్లు తొలగించి బుల్లెట్ బాబులకు వాళ్ల బాపులకు బుద్దులు చెప్పి వాటిని రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసే వారు. కాని ఈ సారి వినూతనంగా అలోచించి వాటితో రాకెట్ లాంచింగ్ మాదిరి టవర్ నిర్మించారు.
వరంగల్ ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసుల వినూతన ఆలోచనకు నగరవాసులు ప్రశంసలు కురిపించారు.
వరంగల్ పోలీస్ కమీషనరేట్ జంక్షన్లో ఈ టవర్ ఏర్పాటు చేసారు.
ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ బుధవారం టవర్ ఆవిష్కరించారు.
సైలెన్సర్లు మార్పు చేసి వాహనం నడిపితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. వరంగల్ ట్రై సిటీ లోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నఅధిక శబ్దం వచ్చే సైలెన్సర్లతో రాకెట్ నమూనాతో నిర్మించిన టవర్ అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లు అమర్చే వారికి ఓ హెచ్చరిక గా ఉండాలని నిర్మించి నట్లు తెలిపారు.
గతంలో ఇట్లా తొలగించిన సైలెంసర్లను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వoసం చేసేవారిమని కాని అవేర్నెస్ కోసం ఇట్లా టవర్ నిర్మించామని తెలిపారు.
ఇప్పటి వరకు ట్రై సిటీ పరిధిలో 2024 సంవత్సరం లో మొత్తం 1246 సైలెన్సర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో హన్మకొండ లో 557, వరంగల్ 335, కాజీపేట లో 354 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకోగా, 2025 ప్రారంభం నుండి ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు 592 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హన్మకొండ 242, వరంగల్ 85, కాజిపేట లో 265 సైలెన్సర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏసీపీ పేర్కొన్నారు. ఇపైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సీతారెడ్డి పాల్గొన్నారు.