📰 భారత్‌పై శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో తీవ్రవ్యాఖ్యలు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి భారత్ తోడ్పడుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటం వల్లే ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయని, దీన్నే తాను “మోదీ యుద్ధం”గా పేర్కొంటున్నానని ఆయన అన్నారు.
ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ–
- రష్యా చమురు కొనుగోలు ఆపేస్తే భారత్‌పై అమెరికా సుంకాలను 25% తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
- శాంతి స్థాపనకు మార్గం ఢిల్లీయే అని వ్యాఖ్యానించారు.
- భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా అమెరికా వ్యాపారులు, వినియోగదారులు నష్టపోతున్నారని, ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని ఆరోపించారు.
“భారత్ నుంచి రష్యాకు వెళ్తున్న డబ్బు యుద్ధానికి ఇంధనంగా మారుతోంది. ఉక్రెయిన్ పౌరుల మరణాలకు భారత్ బాధ్యత వహించాలి. అంతేకాక, మేము అమెరికన్ల డబ్బుతో మోదీ యుద్ధాన్ని నెట్టుకొస్తున్నాం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా నవారో ఇలాంటి ఆరోపణలే చేశారు. అమెరికా నుంచి వస్తున్న ఎగుమతుల డబ్బుతో భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని, ఆ చమురును శుద్ధి చేసి రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయని అన్నారు. ఈ డబ్బు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షగా భారత్‌పై అమెరికా 50% సుంకం అమలు చేసిన విషయం తెలిసిందే.
👉 —Ends