Headlines

నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్


మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా క్యూరేటర్ వసంతకు సర్టిఫికేట్ అందజేత
హైదరాబాద్:
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం తెలంగాణ సచివాలయంలో జూ క్యూరేటర్ వసంతకు అందజేశారు.
జూలాజికల్ పార్క్ వరుసగా ఆరు సంవత్సరాలు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ అందుకుంటూ దేశంలోనే తొలి జూ గా నిలిచిందని జూ చీఫ్ వసంత వివరించారు. ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్ నాణ్యతా నిర్వహణకు సంబంధించిన ప్రమాణాలను, జూ సేవల స్థిరమైన నాణ్యతను నిర్ధారిస్తుందని తెలిపారు.
జంతు సంరక్షణ, పెంపకం ప్రక్రియల్లో అనుసరించే ప్రమాణాలు, టికెటింగ్ మరియు సందర్శకుల సేవలు, అత్యవసర స్పందన వ్యవస్థ, సిబ్బంది శిక్షణ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలు ఈ ధృవీకరణలో భాగమని పేర్కొన్నారు.
అలాగే జూ ఐఎస్ఓ 14001 పర్యావరణ నిర్వహణ సర్టిఫికేషన్‌ను పొందడం కూడా ఒక ముఖ్యమైన విజయం అని ఆమె చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా వ్యర్థాల తగ్గింపు, నీరు–శక్తి వినియోగం తగ్గించడం, కార్బన్ పాదముద్రను నియంత్రించడం, నివాస నిర్వహణ, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను జూ అమలు చేస్తోందని వివరించారు.
అదేవిధంగా, హైదరాబాద్ జూ దేశవ్యాప్తంగా అత్యున్నత గుర్తింపుగా భావించే 5-స్టార్ రేటింగ్‌ను పొందిందని తెలిపారు. జంతువుల సంక్షేమం, తగిన ఎన్‌క్లోజర్‌లు, పోషకాహారం, పశువైద్య సంరక్షణ, శుభ్రత—ఈ ప్రమాణాలన్నింటినీ పాటించినందుకు ఈ రేటింగ్ లభించిందని చెప్పారు.
ఈ ధృవీకరణలతో హైదరాబాద్ జూ దేశంలోని ఇతర జూలకు ఆదర్శంగా నిలుస్తుందని, జంతు సంరక్షణ, పరిరక్షణలో అగ్రగామిగా ఎదుగుతుందని మంత్రి సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సహకారాలు, సీఎస్ఆర్ మద్దతు, కొత్త పరిరక్షణ ప్రాజెక్టుల లభ్యతకు ఈ గుర్తింపులు ఉపయోగపడతాయని తెలిపారు.
1963 అక్టోబర్ 6న ప్రారంభమైన నెహ్రూ జూలాజికల్ పార్క్ నేడు దేశంలో ప్రముఖ జూలలో ఒకటిగా అభివృద్ధి చెందిందని, ప్రతి సంవత్సరం 30 లక్షలకు పైగా సందర్శకులను ఆకర్షిస్తుందని అధికారులు మంత్రికి వివరించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు