ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు.
సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లానని పత్రికల్లో వచ్చిన వార్తలపై మాత్రమే ఆయనతో మాట్లాడానని ఆమె తెలిపారు. “వార్తల్లో వచ్చిన అంశాలు నిజం కాదని, అవి అపార్థాలకు దారితీయకుండా చూడాలని మాత్రమే కోరాను. ఆలయ అభివృద్ధి పనుల చుట్టూ వివాదం ఉండకూడదు. అందుకే పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లాను. కానీ నేను ఎవరిపై ఫిర్యాదు చేయలేదు” అని మంత్రి స్పష్టం చేశారు.
“సున్నితమైన అంశం కావడంతో అపార్థాలు తొలగి పనులు వేగంగా సాగాలని కోరాను. ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాం” అని అన్నారు.
మేడారం ఆలయ అభివృద్ధి అందరి బాధ్యత అని, దీనిపై ఎలాంటి వివాదాలు అవసరం లేదని మంత్రి సీతక్క అన్నారు.