కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) సంఘీభావం
హనుమకొండలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక నల్ల చట్టాలను ఎత్తివేయాలని, దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్ధరించాలని ఐజేయూ జాతీయ నాయకులు దాసరి క్రిష్ణారెడ్డి,టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు డిమాండ్ చేశారు. బుధవారం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) నాయకులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ హనుమకొండలో జాతీయ కార్మిక సంఘాలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఏకశిలా పార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్న అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి క్రిష్ణారెడ్డి, గాడిపెల్లి మధు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. జర్నలిస్టులకున్న వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను కాపాడుకునేందుకు కేంద్రం తక్షణమే వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నల్ల చట్టాలను ఎత్తివేసే వరకు జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ ర్యాలీ, ధర్నాలో టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్, నాయకులు బండి పర్వతాలు, ఎండి ఉస్మాన్ పాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.