నేను చూడని
కురుక్షేత్ర సంగ్రామం..
నేను చూడని
ప్రపంచయుద్ధాలు..
నేను చూడని
హిరోషిమా..నాగసాకి విధ్వంసం..
ఏది తక్కువ..
ఏది ఎక్కువని అడిగితే..
అసలు యుద్ధనీతి లేని
హిరోషిమా మారణకాండ
మనం చూసిన..కనిన
అతి భయానక
మానవ హననమని
నా తీర్పు..
అందులో లేదు మార్పు..!
ఏ యుద్ధమైనా ప్రాణాలు పోవడం తప్పనిదే..
మహాభారత సంగ్రామంలో
ప్రపంచయుద్ధాల్లో
అసువులు బాసిన వీరులెందరో..నరులెందరో..
అయితే అప్పుడు పోయిన
ప్రాణాలే లెక్క..
హిరోషిమా…
ఒక్క పోటుతో
లక్షన్నర జనాభా గల్లంతు..
ఇది పైకి తేలిన లెక్క..
అంతకు మించి కోట్ల సంఖ్యలో హరీయన్న జీవాలెన్నో..
ఆ రాజకీయంతో..
అరాచకీయంతో
సంబంధం లేని
జీవులు..జీవాలు
శవాలై..సలభాలై..
ఆయువు మూడి..
చివరి వాయువు పీల్చి..
కాటికి పోకుండానే
కంటికి కనిపించకుండానే
విగతమై..తిరిగిరాని గతమై..
మృత్యువుకు స్వగతమై..
మారణకాండకు
స్వాగతమై..!
అక్కడితో ఆగిందా విధ్వంసం..
జీవరాశి ధ్వంసం..
ఆధిపత్య కాంక్షతో..
ఎక్కడో ఉన్నత పీఠంపై
కూర్చున్న మానవ రూపంలోని రక్కసి
సాగించిన హింసరచన..
ధ్వంసరచన..
ప్రకృతిని పీడించి..
పత్రహరితాన్ని హరించి..
రక్తాన్ని మలమలామాడ్చేసి..
రానున్న తరాలకూ శాపమై..
భూమికి శోకమై..
ప్రతి తల్లికీ గర్భశోకమై..
కన్నీటి లోకమై..!
హిరోషిమా..
మనిషి మునుపెన్నడూ చూడని ప్రళయం..
మనిషే సృష్టించిన విలయం..
మృత్యుదేవత లయం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286