రైతులకు రూ. 4 కోట్ల నష్టపరిహారం ఇప్పించింద
రైతులకు అన్నివిధాలుగా అండదండగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా 60 శాతం విత్తనాలు పండించే ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న, వరి, పత్తి వంటి పంటల మూలవిత్తనాల ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉందని, ఇక్కడి విత్తనాలు ప్రపంచ నలుమూలలకూ ఎగుమతవుతున్నాయన్నారు.
గత పదేళ్లలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఇది పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఉన్న కేవలం రైతు, రైతు కూలీల కమిషన్ లాగే కాకుండా, వ్యవసాయం మొత్తానికి సంబంధించిన బాధ్యతలు చూసే విధంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ములుగు జిల్లాలో జరిగిన మొక్కజొన్న విత్తన మోసాలపై కమిషన్ స్పందించి, 671 మంది రైతులకు రూ. 4 కోట్ల నష్టపరిహారం ఇప్పించిందని, ఇది దేశంలోనే మొదటి సారి అని అన్నారు. అయితే విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం వసూలు అయినట్లు ఇప్పటి వరకు ఆధారాలు లేవని ఆయన తెలిపారు.
అదేవిధంగా గతంలో వైఎస్ హయాంలో బీటీ పత్తి విత్తనాల విషయంలో చట్టం తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. ఇదే తరహాలో ప్రస్తుతం తెలంగాణలో కూడా విత్తన కంపెనీల నియంత్రణకు కొత్త విత్తన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు హర్యానా పర్యటన కూడా నిర్వహించినట్టు వెల్లడించారు.
రైతులకు భరోసాగా ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, గ్రామాల స్థాయిలో వ్యవసాయ అధికారులు ఆదర్శ రైతులను ఎంపిక చేసి ప్రభుత్వం గౌరవం ఇస్తుందని చెప్పారు. అయితే వారికి గౌరవ వేతనం మాత్రం ఉండదని తెలిపారు.
కెవిఎన్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ, కేంద్రం యూరియా సరఫరాలో తెలంగాణపై నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా పూర్తిగా కేటాయించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
భవానీ రెడ్డి, మరో రైతు కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ, ములుగు జిల్లాలో నష్టపరిహారం ఇప్పించడంలో రైతు కమిషన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి జరిగిన ఘటన అని పేర్కొన్నారు. గిరిజన రైతుల్లో ఈ చర్య వల్ల విశేష ఆనందం వ్యక్తమవుతోందని చెప్పారు.
రైతు సంక్షేమం కోసం రైతు కమిషన్ నిత్యం పనిచేస్తుందని, ఇది రైతులకు అందుబాటులో ఉండే ప్రభుత్వ యంత్రాంగంగా కొనసాగుతుందని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు.