Headlines

“నవ తెలంగాణ” దినపత్రిక 10వ వార్షికోత్సవంలో జర్నలిస్టులు, కమ్యూనిస్టుల గురించి సీఎం కీలక వ్యాఖ్యలు

సిపిఎమ్ పార్టీ అనుభంద నవతెలంగాణ పత్రిక పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోనో బాగులింగం పల్లి సుందరయ్య హల్ లో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు.

హైదరాబాద్:
“నవ తెలంగాణ” దినపత్రిక 10వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పనిచేసే పత్రికల అవసరాన్ని తెలియజేశారు. పత్రికల విశ్వసనీయతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఈ రోజుల్లో ప్రజల పక్షాన నిలబడే పత్రికలు చాలా తక్కువ. అలాంటి దృఢమైన పాత్ర పోషిస్తున్న పత్రిక ‘నవ తెలంగాణ’,” అని సీఎం పేర్కొన్నారు.

పత్రికల పాత్రను గుర్తు చేస్తూ, స్వాతంత్ర్య సమర యోధుల పోరాటంలో, సాయుధ రైతాంగ ఉద్యమాల్లో, సామాజిక చైతన్యానికి పత్రికలు కీలకంగా పనిచేశాయని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాల పరంపరలో పత్రికల కీలకతను వివరించారు.

రాజకీయ పత్రికల దుర్వినియోగంపై విమర్శ

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ భావజాలాన్ని ప్రజలకు చేరవేయడానికి పత్రికలను వేదికగా వాడేవని గుర్తు చేశారు. అయితే ఈ కాలంలో కొన్ని రాజకీయ పత్రికలు సంపాదన కోసం, తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పనిచేస్తున్నాయన్నారు.

“ఇలాంటివాళ్ల వల్ల జర్నలిజం అనే పదానికే విలువ తగ్గుతోంది. అసలు జర్నలిజంలో ఓనమాలు తెలియని వారు సోషల్ మీడియా పేరుతో వార్తల పేరుతో తిరుగుతున్నారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిజం స్థాయిని కాపాడేందుకు, నిజమైన జర్నలిస్టులు తమ పాత్రను స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. “జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులను మీరు విడదీయాలి. లేకపోతే ఇది దేశ భద్రతకే ముప్పుగా మారవచ్చు,” అని ఆయన హెచ్చరించారు.

కమ్యూనిస్టులకు ప్రాశస్త్యం

ప్రజా పోరాటాల్లో ఎర్రజెండా ఉన్నచోటే సమస్యల పరిష్కారం కనిపించిందని, కమ్యూనిస్టులు ఉప్పులాంటివారని అభివర్ణించారు. “ఉప్పు లేని వంట రుచికరంగా ఉండదంటే, కమ్యూనిస్టుల సహకారం లేని ప్రజాపోరాటాలే నిష్ఫలం,” అని చెప్పారు.

భవిష్యత్తులో సహకారానికి పిలుపు

కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో గతంలో కమ్యూనిస్టుల సహకారం ఎంతగానో ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య సౌహార్ధ సహకారం కొనసాగాలన్నారు. “ఇరుపక్షాల సమన్వయంతో ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది,” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రకటనల్లో “నవ తెలంగాణ”కు సమాన ప్రాధాన్యత

అంతకుముందు పత్రికా స్వాతంత్ర్యానికి, విలువలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వ ప్రకటనల విషయంలో “నవ తెలంగాణ” పత్రికకు ఇతర పత్రికలతో సమాన ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పత్రికా సంస్ధను అభినందించిన ముఖ్యమంత్రి, ప్రజల కోసం పనిచేసే ఈ విధమైన స్వతంత్ర మీడియా సంస్థలు దేశానికి అవసరమని పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE