అమ్మ కదా..అదే వ్యధ..!
అక్కడ అసువులు బాసినది
సైనికుడే కానీ..
తీవ్రవాదే గానీ..
నక్సలైటే అవనీ..
ఇక్కడ పగిలేది
ఒక అమ్మ గుండె..
బిడ్డ చేరేది ఏ లోకమైనా
ఆగేదా మాతృమూర్తి గర్భశోకం..!
ఇదిగో చూడక్కడ
ఒక అమ్మ ఏడుస్తుంది
పొగిలిపొగిలి..
అయితే అంత శోకంలో
ఆ తల్లి మోమున
ఉట్టిపడుతున్న గర్వం..
ఎదురుగా నిర్జీవంగా పడి ఉన్నా తన జీవిత సర్వం..
నా కొడుకు సైనికుడై..
వీరమరణం పొంది
మాకూ దేశానికీ పేరు తెచ్చి
మామూలు మాత తనను
వీరమాతగా నిలుపుతూ..
విజయ గర్వంతో తుది వీడ్కోలు తెలుపుతూ..!
అరెరె…తీవ్రవాది ఇంట
ఎక్కడిదా తృప్తి..
అమ్మా నాన్నల కంట ఆ దీప్తి
అటు బిడ్డ పోయినాడని బాధ
అయ్యో ఇలా పోయాడని
తీరని దుగ్ధ..
అర్థమే లేని ఆ మరణం..
అమ్మకి గర్భశోకమే కాదు
కడుపులో ఆరని చిచ్చూ
మిగల్చదా..!
ఇక్కడ పోలీసు కాల్పుల్లో
అసువులు బాసిన
నక్సలైటు కొంపలో
అదో రకం ఆవేదన..
చిన్నప్పటి నుంచి
నేర్చిన చదువు..
ఒంట్లో నరనరానా వ్యవస్థపై
నిండిన నిరసన
కాదనుకుంది
సర్కారు కొలువు..
ఎప్పుడు చదివాడో
ఎర్ర సిరాతో రాసిన సాహిత్యం
ఎక్కడ విన్నాడో
అన్నల పిలుపు..
వద్దు వద్దురా అన్న అమ్మ
వేడుకోలు ఎక్కేనా ఆ బుర్రకి
తిరుగుబాటు తిమ్మిరి సోకిన
ఆ పుర్రెకి..
అడవి చేరి తుపాకి పట్టి
ఏడ తిరిగాడో..
ఏమి సాధించాడో..
ఇప్పుడిలా అమ్మ చెంత చేరినాడు శవమై..
ఒంటి నిండా
తుపాకి గుండ్లతో…
గుండె పగిలేలా అమ్మ రోదన
అప్పుడు చైతన్యమనుకుని వెళ్లినప్పుడూ..
ఇప్పుడు అచేతనుడై
తిరిగి చేరినప్పుడూ..
దేశానికి ద్రోహి అనుకున్నా
అమ్మకి కొడుకేగా..!
ఈఎస్కే,జర్నలిస్ట్


n7kx5b
fyv57q
You are my breathing in, I possess few web logs and sometimes run out from to brand.