డెహ్రాడూన్, డిసెంబర్ 14:
హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇంద్రజాలికుడు సామల వేణుకు “పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్ – 2025” అవార్డు లభించింది. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో ఆయన ఈ గౌరవం దక్కింది.
నగరంలోని హోటల్ ఎమరాల్డ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు నరేష్ భన్సాల్ చేతుల మీదుగా అవార్డును బహుకరించారు. మ్యాజిక్ ద్వారా ప్రజాసంబంధాలకు వినూత్నంగా ప్రచారం కల్పిస్తూ విశేష కృషి చేస్తున్నందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
ఈ సదస్సుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, సమాచార శాఖ మంత్రి గణేష్ జోషి, ప్రజాసంబంధాల జాతీయ అధ్యక్షులు అజిత్ పాటక్, రష్యన్ పీఆర్ కాంగ్రెస్ చైర్మన్ మైఖేల్ మాస్లోవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 650 మంది ప్రజాసంబంధాల నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కళను కమ్యూనికేషన్‌తో మేళవిస్తూ ప్రజాసంబంధాలకు కొత్త దిశ చూపుతున్న సామల వేణు సేవలను పలువురు వక్తలు ప్రశంసించారు.


