మొన్నీమధ్య వార్తాపత్రికలలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అనుకొన్నంత ఆదాయం రావట్లేదనిభూమి మరియు ఇండ్ల కొనుగోలు తగ్గిపోతున్నాయి అనే వార్త ప్రచురితమైంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు అనేటటువంటి భావన ప్రజలలో కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత విషయంలో, ఉపాధి కల్పన విషయంలో, ప్రభుత్వ భూముల ఆక్రమణను ముఖ్యంగా హైదరాబాదులో నిలువరించేందుకు హైడ్రా అటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసినటువంటి విషయంలో,నైపుణ్యాల అభివృద్ధి విషయంలో, రైతులను ఆదుకునే విషయంలో, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మంచి పేరు తెచ్చుకుంటుంది.
కానీ ఈ మధ్య చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అని చెప్పి జీవితాంతం సంపాదించిన కష్టార్జితం పెట్టి ప్లాట్లు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు, వారి ఆస్తుల్ని వారి పిల్లల పెళ్లి నిమిత్తము, చదువుల నిమిత్తము అమ్ముకుందామంటే, ఆస్తులు ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ నిరాకరిస్తున్నారు. ఈ విధానంతో ఎంతోమంది మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది.
గతంలో కొందరు రాజకీయ నాయకులు లేక బడా బాబులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇలాంటి సామాన్యులకు అమ్మారు. వారు తెలియక వారి కష్టార్జితం తో ఈ ఆస్తుల్ని కొన్నారు. వాటిని అవి ప్రభుత్వ భూములు అవునా కాదా అనే విచారణ చేయకుండా రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానివని, వాటిమీద వీరి కష్టార్జితంతో కొనుక్కున్న వారికి ఎలాంటి హక్కు లేదని, వాటి అమ్మకాని నిరాకరిస్తున్నారు. తద్వారా ఈ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కొన్ని లక్షల మందికి వారి కష్టార్జితాన్ని అనుభవించకుండా చేసేటటువంటి అపవాదు మూటకట్టుకుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఆస్తుల లావాదేవీలలో ద్వారా రావలసినటువంటి ఆదాయం కూడా తగ్గుతుంది.
ఎప్పుడో ఒక అవినీతిపరుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వాటిని సామాన్యులకు అమ్మి డబ్బు సంపాదించుకున్నాడు. అతని మీద ఇప్పటివరకు ఎలాంటి శిక్ష లేదు. కానీ ఆయన అమ్మిన ఆస్తులు కొన్న వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవించాలా? అంటే నేరస్తుడిని తప్పించుకొనే అవకాశమిచ్చి, అమాయకులను బలి చేయడమనేటటువంటి విధానం ప్రభుత్వానికి గాని, ప్రజలకు కానీ శ్రేయస్కరం కాదు.
కాబట్టి ప్రజా నాయకులు కాకుండా, బడా బాబులు కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాకుండా, సామాన్యులు, ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వారి కష్టార్జితాన్ని ఉపయోగించుకొని కొన్నటువంటి చిన్న చిన్న ప్లాట్ లని రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉంటే, అటువంటి వాటికి ప్రభుత్వం మినహాయించి వారిని ఆస్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తే మంచిది. అలా చేయకుంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు చేసిన తప్పులకు చిన్నవాళ్లను శిక్షించడం అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు అవుతుంది.
గత ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అన్యాయాలకు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే సంఘటనలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేసింది. వారికి న్యాయం చేస్తామని ప్రమాణం చేశారు. కానీ పైన చెప్పినటువంటి విషయాల్లో, ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో అలాంటివారికి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయం చేస్తున్నట్టుంది. కాబట్టి దీని మీద పైన సూచించిన చిన్నాచితక ఆస్తిపరులు వారి ఆస్తుల్ని అమ్ముకునేందుకు అడ్డంకులు లేకుండా నిర్ణయాలు త్వరితగతిన తీసుకుంటే ఈ ప్రభుత్వం చేసే మంచి పనులకు ఇది ఇంకొకటి తోడవుతుంది.
డాక్టర్ హనుమంత ప్రసాద్ రావు
హైదరాబాద్
కెపిహెచ్బి ఫేస్ 6
శ్రీరంగ విహార అపార్ట్మెంట్స్
9963013078