గద్దర్ స్ఫూర్తిని యువతరం కొనసాగించాలి…ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్

ఘనంగా గద్దర్ రెండవ వర్ధంతి సభ

పాల్గొన్న ప్రముఖులు, మేధావులు, కవులు, కళాకారులు

త్వరలో వరంగల్ నగరంలో గద్దర్ విగ్రహా ఏర్పాటు

మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు

ప్రజాయుద్ధనౌక గద్దర్ స్ఫూర్తిని ఈ తరం కొనసాగించాలని ప్రముఖ అంతర్జాతీయ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ పిలుపునిచ్చారు.

బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్లో గద్దర్ గళం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన గద్దర్ వర్ధంతి సభలో ప్రొ. కంచ ఐలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని స్థానం గద్దర్ ది అని, ఆయన జీవించి ఉన్నంత కాలం ప్రజల కోసమే పాటుపడ్డాడని, పాటలతో ప్రజలని చైతన్యం చేశాడని, ముఖ్యంగా గద్దర్ స్ఫూర్తిని భావితరాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన తొలి రోజుల్లో బుల్లెట్ ను నమ్ముకున్నప్పటికీ, ఆ తరువాత అంబేద్కర్ మార్గంలోకి వచ్చి బ్యాలెట్ ని మాత్రమే నమ్మాడని, భారత రాజ్యాంగం ప్రవచించిన విలువలతో ఆయన జీవించాడని, ఆయన స్ఫూర్తిని, మార్పును ఈ తరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. శ్రమ, చాకిరి నుండి పాటలు పుడతాయని, ఉత్పత్తి కులాల నుండి మాత్రమే సంపద పుడుతుందని, ఏ సంపద సృష్టించని పూజారి వర్గం కేవలం ఇతరుల మీద ఆధారపడి మాత్రమే జీవిస్తున్నదని, బహుజనుల శ్రమ నుండి సంపద, పాటలు పుట్టాయని అవే గద్దర్ కు స్ఫూర్తిని అందించాయని అన్నారు. ఈ మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే గద్దర్ మనకు అర్థమవుతాడని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మరొక అతిధి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ఈ దేశంలో చదువుకున్న వాళ్లే ప్రజలని మోసం చేశారు కానీ చదువురాని నిరక్షరాస్యులే ఏ మోసం తెలియని వారని, అలాంటి కష్ట జీవులనే గద్దర్ నమ్మాడని, అదే విషయాన్ని పాటలు కట్టి పాడాడని, తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన గద్దర్ కృషి మరువలేనిదని అన్నారు. ఆయన శరీరంలో ఆరు బుల్లెట్లు దిగినప్పటికీ శరీరంలో ఒక బుల్లెట్ పెట్టుకొని కూడా ఆయన చావుకు వెరవకుండా చివరి వరకు ఆయన ఉద్యమాన్ని కొనసాగించి, ప్రజల పక్షాన తన పాటని కొనసాగించిన గొప్ప దీరుడని అన్నారు. ఆయన స్ఫూర్తిని ఇవాళ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత దేశ పాలకుల మీద ఉందని గుర్తు చేశారు.
ఈ వర్ధంతి సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన గద్దర్ గళం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ గద్దర్ పోషించిన పాత్ర మరువలేనిదని, ఆయన స్ఫూర్తిని శాశ్వతం చేసేందుకు గద్దర్ గళం శాయశక్తుల కృషి చేస్తున్నదని అందులో భాగంగా తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల్లో గద్దర్ విగ్రహాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నారు. చారిత్రక జిల్లా అయిన వరంగల్లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకి గద్దర్ గళం కృషి చేస్తున్నదని, గద్దర్ పేరుమీద ప్రభుత్వం ప్రతి జిల్లాలో గద్దర్ కళాక్షేత్రాలు ఏర్పాటు చేయాలని, గద్దర్ కల్చరల్.యూనివర్సటీని ఏర్పాటు చేయాలని, గద్దర్ పేరుని మెదక్ జిల్లాకు పెట్టాలని, గద్దర్ స్మృతి వనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వరంగల్లో గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ మాట్లాడుతూ గద్దర్ స్పూర్తితో బి.సి ల చైతన్యం కోసం పోరాటం చేస్తున్నానని, తెలంగాణ ఉద్యమంలో, మహాజన సమాజం, టిమాస్, బిఎల్ఎఫ్ లో గద్దర్ తో పాటు పనిచేశానని, గద్దర్ అన్న ఇచ్చిన పల్లె పల్లెకు పాట పార్లమెంటుకు బాట స్పూర్తితో 75 ఏండ్లుగా చట్టసభల్లో వాటా లేని బి.సి సమాజాన్ని చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు.

గద్దర్ అన్న చివరిగా ఇచ్చిన పిలుపు బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అనే నినాదంతో బి.సి లను చైతన్యం చేస్తున్నానని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా సాధించిన నాడే గద్దర్ కు నిజమైన నివాళని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునిల్, టిజివిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బిఎస్ఎఫ్ కాడపాక రాజేందర్, రామంచ శ్రీను, ప్రొఫెసర్ వీరస్వామి, ఆస్నాల శ్రీనివాస్, నున్న అప్పారావు, న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, బండి మొగిలి, ప్రభంజన్, ఎగ్గడి సుందర్ రామ్ వివిధ సంఘాల నాయకులు యాదవరెడ్డి, ఇమాన్యుయల్, టి.ఎన్.స్వామి, తాడిశెట్టి క్రాంతికుమార్, మన్నే బాబురావు, రామంచ భరత్, తాళ్ల సునీల్, సింగారపు అరుణ, బుంగ జ్యోతి, సద్గుణ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE