Headlines

నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల నిందితుల అరెస్ట్

నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులకు మోసం.. నిందితుడి అరెస్ట్

వరంగల్, ఆగస్టు 25, 2026:
ప్రముఖ ఐటీ కంపెనీల పేరుతో నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని చెప్పి హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వివిధ జిల్లాల్లో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.461/2025, BNS 318(4), ఐటీ యాక్ట్ సెక్షన్ 66-D కింద కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన మోసం కేసులతో పాటు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల్లోనూ అతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

హాస్టల్ యజమానులను టార్గెట్

నిందితుడు హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి, వివిధ నంబర్ల నుంచి యజమానులకు ఫోన్ చేసేవాడు. తాను ప్రముఖ కంపెనీ ఉద్యోగి లేదా ప్రతినిధినని పరిచయం చేసుకుని, కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించేవాడు.

అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజు, క్యాటరింగ్ సామగ్రి కొనుగోలు, ఇతర ఖర్చుల పేరుతో బాధితుల నుంచి బ్యాంకు ఖాతాలు లేదా UPI ద్వారా డబ్బులు బదిలీ చేయించుకునేవాడు. డబ్బులు వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా నంబర్ మార్చడం ద్వారా బాధితులకు అందుబాటులో లేకుండా పోయేవాడు.

కొన్ని సందర్భాల్లో ఇతరుల UPI ఖాతాలను ఉపయోగించి, అవి కంపెనీ సిబ్బందికి చెందిన ఖాతాలని చెప్పి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. వసూలు చేసిన డబ్బులో కొంత వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేయగా, మరికొంత ఆన్‌లైన్ గేమింగ్‌లో కోల్పోయినట్లు దర్యాప్తులో గుర్తించారు.

రూ.36.99 లక్షల మోసం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 కేసుల్లో నిందితుడి ప్రమేయం గుర్తించారు. ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మరో 7 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ.33,33,950 నష్టం జరిగినట్లు గుర్తించగా, అందులో రూ.12,40,657 మొత్తాన్ని పోలీసులు హోల్డ్ చేశారు.

అదేవిధంగా FIRలు నమోదు కాకుండా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన మరో ఆరు ఫిర్యాదుల్లో రూ.3,65,050 నష్టం జరిగినట్లు గుర్తించారు. వీటిలో రూ.68,430 మొత్తాన్ని హోల్డ్ చేశారు.

కేసులు, సైబర్ ఫిర్యాదులను కలిపి మొత్తం రూ.36,99,000 నష్టం జరిగినట్లు గుర్తించగా, రూ.13,09,087 మొత్తాన్ని పోలీసులు హోల్డ్ చేశారు.

నిందితుడి వివరాలు

నిందితుడిని మహమ్మద్ షబ్బీర్ అలియాస్ కిరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహారెడ్డి (44)గా పోలీసులు గుర్తించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన ఇతను ప్రస్తుతం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ రామ్‌రెడ్డి నగర్‌లో నివసిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం

నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, రెండు బ్యాంకు పాస్‌బుక్స్, ఒక చెక్‌బుక్, రెండు ఏటీఎం కార్డులు, ఒక డైరీ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు దర్యాప్తును హన్మకొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టారు. M. కిరణ్ కుమార్ (PC-1229), K. రమణకర్ (PC-1413), D. రవి (HG-701), D. కారుణ్య (WPC-3272), MD. సల్మాన్ పాషా తదితరులు దర్యాప్తులో పాల్గొన్నారు.

ప్రజలకు పోలీసుల సూచనలు

క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఉద్యోగాలు లేదా వ్యాపార అవకాశాల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కంపెనీ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే, సంబంధిత సంస్థ అధికారిక ఫోన్ నంబర్లు లేదా అధికారిక వనరుల ద్వారా వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని తెలిపారు.

అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, అడ్వాన్స్ లేదా సామగ్రి కొనుగోలు పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు సూచించిన బ్యాంకు ఖాతాలు, UPIలకు డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. OTP, PIN, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు వంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి, లావాదేవీల వివరాలు, మొబైల్ నంబర్లు, సందేశాలు, చెల్లింపు రసీదులు వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సూచించింది. అలాగే National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపింది.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం