కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్యప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెయ్యి కోట్లు ఇస్తే తమ ఆస్తులన్నింటినీ రాసిస్తానని, మిగతా రూ.99 వేల కోట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాలు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మళ్లీ రేవంత్‌రెడ్డికి నేను చెప్తా ఉన్నా. లక్ష కోట్లు అని చెప్పి నువ్వు ఏదైతే నిన్న మొన్న కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది అని చెప్పి పేపర్లో నీకు బాకా ఊదే పేపర్లో రాయించినావో.. నేను చెప్తా ఉన్నా రేవంత్.. ఒక వెయ్యి కోట్లు మా ఆస్తులు మొత్తం నీకు ఇచ్చేస్తా. 1000 కోట్లు నువ్వు ఇయ్యు మాకు. నీకు మొత్తం మిగతా 99 వేల కోట్లతోని ఈ రాష్ట్రంలోని ఫీజు రీఇంబర్స్‌మెంట్ కట్టు. ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. మరి ఆ లక్ష కోట్ల వ్యవహారం ఏందో నువ్వే తెలుసుకో’ అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ఎర్రవల్లిలో భూములు కొనుగోలు చేసిన అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ‘కేసీఆర్ హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఎర్రవల్లిలో ఎప్పుడో దాదాపు 15-20 ఏళ్ల కింద భూములు కొన్నారు. ఆ రోజు ఎంత అండి భూముల విలువ? ఒక ఎకరానికి 3 లక్షలు, 5 లక్షల రూపాయలు’ అని అన్నారు. ‘అంటే ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు అక్కడ ఉన్నదెంతో లెక్క తొందరలో మీరే చెప్పారు నిన్ననే. నిన్నటి దాకా చిల్లర వాగుడు వాగి 10,000 ఎకరాలు కేసీఆర్ ఆక్రమించాడని, 1000 ఎకరాల ఫామ్‌హౌస్ అని మాట్లాడిన సన్నాసి.. అసెంబ్లీలో ఏం చెప్పినావ్? 67 ఎకరాలు అని మాట్లాడినావ్. కేసీఆర్ ఫామ్ 67 ఎకరాలు అని మాట్లాడినావ్’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘మిగతా 933 ఎకరాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.
నేను అడుగుతున్నా రేవంత్.. మరి మిగతా 933 ఎకరాలు నీ అబ్బ ఎత్తుకపోయిండా? నీ అయ్ ఎత్తుకపోయిండా? ఎవడు ఎత్తుకపోయిండు? ఈ రోజులు వాగిన చెత్త వాగుడికి సమాధానం ఎవడు చెప్తాడు?’ అని ప్రశ్నించారు. ‘ముందు కేసీఆర్‌కు క్షమాపణ చెప్పు. ఆ 933 ఎకరాలు ఎక్కడ ఉందో చెప్పు. ఈ లక్ష కోట్లు ఎక్కడిదో చెప్పు. 1000 కోట్లకు మొత్తం రాసిస్తా. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
‘అంటే ఎంత చిల్లర ప్రచారం అంటే లక్ష కోట్లు, లక్ష కోట్లు అని కాళేశ్వరం విషయంలో ఎట్లా అయితే చిల్లర మాటలు మాట్లాడారో.. 150 బెడ్‌రూమ్లు అని ప్రగతి భవన్ విషయంలో ఎట్లా అయితే చిల్లర ప్రచారం చేశారో.. ఇవ్వాళ కూడా కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద విషం జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమీ పర్వాలేదు.. అన్నీ తట్టుకుంటాం’ అని అన్నారు.

