తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ
ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని తొమ్మిది ఏండ్లు అధికారం చలాయించిన కెసిఆర్ వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు లెక్కకు మించి దోచుకున్న ఆస్తులను తెలంగాణ ఉద్యమకారులకు పంచాలని. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ డిమాండ్ చేసారు. బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రం బాలసముద్రంలోని తన నివాసంలో ఉద్యమ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వేల కోట్లకు విలువైన వందల ఎకరాల భూములను దోచుకున్నారని, వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ప్రతి ఒక్కరూ పది ఎకరాల నుండి 700 ఎకరాల ఫామ్ హౌస్ లు కాకతీయుల కట్టడాలకు దీటుగా ఎత్తైన ప్రహరీలలూ నిర్మించుకున్నారని అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు జిల్లాల్లో ఆనాటి మంత్రులూ దోపిడి బాట పట్టారనీ, ఆనాటి ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ పరిధిలో సామంత రాజుల వలె ప్రజలను చెరపట్టి, ప్రభుత్వ, పేదల అసైన్డ్ భూములను లాక్కున్నారని అన్నారు.
వివిధ సంఘాల నాయకులు చిల్లా రాజేంద్ర ప్రసాద్, దారం జనార్ధన్, సాయిని నరేందర్, బొమ్మినేని పాపిరెడ్డి, దొమ్మాటి ప్రవీణ్ లు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకున్నందుకే ప్రజలు 2023 ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీని ఘోరంగా ఓడించారని పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చారన్నారు. కుటుంబం, కొంతమంది మంత్రులపై ప్రస్తుతం ప్రభుత్వం విచారణ ప్రారంభించడం అభినందనీయమని, ఈ విచారణ రాజకీయ ఆరోపణలతోనే ఆగిపోకుండా నియమిత కాలములో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్షలు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత విచారణ కేవలం హైదరాబాదు చుట్టుప్రక్కల, సూర్యపేట, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు మాత్రమే పరిమితమైందని ఇతర జిల్లాల్లోకూడా జరిగిన భూదందాలపై విచారణ విస్తరించాలని అన్నారు.
జిల్లాల్లో 2014 నుండి 2023 నాటికి నాయకుల ఆస్తులు 100 రెట్లు పెరిగి ఉంటాయని ఉద్యమకారులు అంచనా వేస్తున్నారని, క్షేత్రస్థాయిలో మాజీ నాయకుల ఆస్తులు ప్రజలకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ముఖ్యంగా రెవెన్యూ , రిజిస్ట్రేషన్, ఇరిగేషన్ , రోడ్స్ అండ్ బిల్డింగ్స్, విద్యుత్తు మెడికల్ శాఖలలో అవినీతి తిమింగలాలు అనేకమున్నాయినీ ఈ దోపిడి నాయకుల, అధికారుల అక్రమ ఆస్తులపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల కమిటీ ద్వారా ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసిన రాజకీయ నాయకుల అధికారులపై న్యాయ విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పాలకులు ఇలాంటి దోపిడీ మరొకసారి చేయకుండా చట్టం రూపొందించాల్సిన అవసరాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిశీలించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక ప్రభుత్వాన్ని కోరుతున్నదని అన్నారు.
ఆత్మ త్యాగాలు చేసిన 1560 కుటుంబాలకు బి ఆర్ ఎస్ మొండి చేయి చూపించారనీ తెలంగాణ తొలి దశ మలిదశలో పోరాడిన వేలాది మంది ఉద్యమకారులను గత పాలకులు అవమానపరిచారనీ ఉద్యమకారులకు
ఏఒక్కరికి ఒక్క గుంట భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కుంభాలకు యువతకు గత పాలకులు అవమానాలే మిగిల్చారని ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములను ప్రభుత్వ భూములను వివాస్పద భూములను సర్ఫెఖాస్ భూములను, పార్కులను ఆక్రమించిన భూ బకాసురులపై విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కుటుంబం ఇతర నాయకులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంచి తగిన విధంగా గౌరవించాలని వారు కోరారు.

