
పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్
రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనం
వరంగల్ సీసీఎస్ – కేయూసీ పోలీసుల జమిలి ఆపరేషన్
హన్మకొండలో పట్టపగలు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
• 15 తులాల బంగారు నగలు
• 5.5 తులాల వెండి నగలు
• రెండు మొబైల్ ఫోన్లు
మొత్తం విలువ: సుమారు రూ.16 లక్షలు
అరెస్టయిన నిందితులు
• ఫెరోజ్ షేక్ (37) – లాలూ షేక్ కుమారుడు
• సుక్ చంద్ (33) – జాఫర్ షేక్ కుమారుడు
• యామీన్ (36) – సలీం షేక్ కుమారుడు
వీరంతా ముజ్‌పార్ గ్రామం, బేలదంగా తాలూకా, ముర్షీదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఫెరోజ్ షేక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
దొంగతనాల విధానం
నిందితులు మద్యం, హెరాయిన్ తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడి జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు పట్టపగలు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు, వెండి నగలను దొంగిలించి విక్రయించేవారని పోలీసులు తెలిపారు.
నేర చరిత్ర
నిందితులు గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడి ఆయా రాష్ట్రాల పోలీసుల చేత అరెస్టై జైలుకు వెళ్లారు. రెండు నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌లో జైలు నుంచి విడుదలైన తర్వాత ముఠాగా ఏర్పడి తెలంగాణలో దొంగతనాలు చేయాలని పథకం వేసుకున్నారు.
అందులో భాగంగా 2025 డిసెంబర్ 17న హన్మకొండ KUC పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో రెండు ఇళ్లలో దొంగతనాలు చేశారు.
తర్వాత జనవరి 10, 2026న హన్మకొండ గోపాలపురం, శివసాయి కాలనీలో ఒక ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి నగలు, నగదును దొంగిలించారు.
పోలీసుల ప్రత్యేక ఆపరేషన్
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీసీపీ సెంట్రల్ జోన్ దారా కవిత పర్యవేక్షణలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ కనుగొని, KUC జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో నిందితులను పట్టుకున్నారు.
విచారణలో వారు చేసిన దొంగతనాలను ఒప్పుకోగా, వారి వద్ద నుంచి నగలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల బృందానికి అభినందనలు
ఈ కేసును ఛేదించిన CCS ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ, KUC ఇన్స్పెక్టర్ ఎస్. రవి కుమార్, ఐటీ కోర్ టీం, సీసీఎస్ ఎస్సైలు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

