బ్లాక్ మార్కెట్ లో ఎరువులు- స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్ బి.పి.ఆచార్య

bp achaya

వారు రికార్డుల్లో చూపించే గోదాములు మాత్రమే అధికారులు తనిఖి చేస్తారు…ప్రైవేట్ గా నిర్వహించే గోదాముల అడ్రస్ మూడో కంటికి తెలియ నీయకుండా చాలా సీక్రెట్ గా  మెయింటెయిన్ చేసి బ్లాక్ దందా నడిపిస్తారు….సర్..

అట్ల అయితే మేమేం చేస్తాం వారి సీక్రెట్  గోదాముల అడ్రస్…. నీకు తెల్సా… వారు ఎక్కడ ఎరువుల బస్తాలు నిల్వచేసారో కావాలి…మీదగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండన్నారు కలెక్టర్ గారు…

సార్ మాదగ్గర అంటూ నేను …చెప్పబోతుండగా  ట్రై చేయండి విలేజర్స్…రైతులను అడగండి… డీలర్లు  బ్లాక్ చేసిన గోదాముల అడ్రస్ లు …అన్నారు….కలెక్టర్  బి.పి ఆచార్యగారు…

ఇది 1993 లో నేను ములుగు “ఉదయం దిన పత్రిక”  విలేఖరిగా ఉన్నప్పటి జ్ఞాపకం

బిపి ఆచార్యగారు ఆనాటి వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్. 1983 బాచి ఐఏఎస్ అధికారి.

ప్రతినెలా ములుగు రెవెన్యూ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశాలు జరిగేవి.

అవి అధికారిక సమావేశాలు మీడియాకు అనుమతి ఉండేది కాదు.

సమాచార శాఖ డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సమావేశానికి హాజరై మీడియాకు నోట్ విడుదల చేసేవారు.

ఈ సమావేశాలు జరిగే రోజు వివిద శాఖలకు చెందిన అధికారులు వస్తుంటారు.

సమావేశాలన్ని ములుగు మండల పరిషత్ కార్యాలయం హాలులో జరిగేవి.

ఆ రోజుల్లో అదొక్కటే అధికారిక కార్యక్రమాలకు అక్కెర కొచ్చిన హాలు. అప్పటికి రెవెన్యూ డివిజినల్ కార్యాలయానికి స్వంత బవణం కూడ లేదు.

విలేఖర్లకు అనుమతి లేకపోయినా వెళ్లి ఎవరైనా అధికారులు కలిస్తే వారితో మాట్లాడి  వార్తలకు పనికొచ్చే వివరాలు సేకరించేవాళ్లం.

నేను వెళ్లడం పి.బి. ఆచార్యగారు అప్పుడే వచ్చికారు దిగడం చూసి చాలా సమీపంలో  ఉన్న నేను గుడ్ మార్నింగ్ సార్ అన్నాను.

కలెక్టర్ గారు నన్ను గుర్తుపట్టి అప్పటికే పలకరిస్తున్నట్లు చిరునవ్వు నవ్వారు.

ఏంటి విశేషాలు అని అడుగుతూ …మీరంతా ఎరువులు షార్టేజ్ అని… బ్లాక్ అని వార్తలు రాస్తున్నారు….రెగ్యులర్ గా ఇన్స్ ఫెక్షన్స్ జరుగుతున్నాయి…ఇంకా ఎరువులు చాలా వచ్చేది ఉంది…రైతులు చాలా తొందర పడవద్దని చెప్పాలన్నారు…

అదేరోజు “ఉదయం” పత్రికలో ఎరువుల షార్టేజి పై త్రిబుల్ కాలమ్ వార్త ఉంది.

సమావేశం ఉందని తెల్సి కలెక్టర్  గారి దృష్టికి వెళ్లాలనే వార్త రాసాను.

ఆరోజుల్లో జిల్లా కలెక్టర్లు ప్రధాన దినపత్రికల వార్తలు తప్పని సరిగా చదివి  రిమార్కులు రాసేవారు.

తెల్లవారి కలెక్టర్ గారు నిద్ర లేచే లోపు దిన పత్రికల కటింగ్స్ తోకూడిన ఫైలు జిల్లా పౌరసంభంధాల శాఖ అధికారి సిద్దం చేసి కాంపు ఆఫీసుకు పంపేవారు.

ఇప్పటికి ఈ పద్దతి పాటిస్తున్నా అంత శ్రద్దగా జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారా లేదా తెలియదు.

అప్పట్లో వార్తలను చాలా సీరియస్ గా తీసుకునేవారు. జిల్లా కలెక్టర్ గారు చూసి రిమార్కు రాసి వాటికి రిజైండర్ ఇవ్వమని సంభందిత శాఖల అధికారులను ఆదేశించే వారు.

జిల్లా కలెక్టర్ గారు ఉదయం పత్రికలో వచ్చిన వార్త చదివి ఉంటారు. నిత్యం అన్ని పత్రికల్లో ఎరువుల కొరత వార్తలు వరుసగా వస్తున్నాయి.

రైతులు కూడ ఓపిక పట్టాలే…. ఇంకా సమయం చాలా ఉందంటూ కలెక్టర్ గారు కార్యాలయం లోనికి వెళ్లారు.

సార్ అంటే…అది డీలర్లు ప్రైవేట్ గోదాముల్లో ఎరువులు ఉంచి బ్లాక్ చేసి అమ్ముతున్నారు అన్నాను….కలెక్టర్ గారిని అనుసరిస్తూ …ఆయన నా మాటలు వినీ..విననట్లు అనిపించింది.

కార్యాలయం గదిలోకి వెళ్తున్న కలెక్టర్ గారు ఒక్కసారిగా ఆగారు…నావైపు చూసి దగ్గరకు రమ్మన్నారు.

నీదగ్గర  బ్లాక్ మార్కెట్ చేసే డీలర్ల వివరాలు ఉన్నాయా …ఎరువులు ఎక్కడ బ్లాక్ చేసారో  వివరాలుంటే చెప్పు అన్నారు…. రైతులను ఊరి వాళ్లను అడిగి తెల్సుకుని మీటింగ్ అయిపోయే వరకు చెప్పు  అంటూ మీటింగ్ హాలులోకి వెళ్లిపోయారు.

ఎరువుల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని అనవసరంగా రాసానా … ఇప్పడు ఎట్లా వివరాలు సేకరించడం….స్వయంగా కలెక్టర్ గారే అడిగారు… ఎందుకొచ్చిన సమస్య…

ఎక్కడ ఎరువుల గోదాములు ఉన్నాయో నాకెట్లా తెలుస్తుంది…వార్త రాసినందుకు నాకే ఇట్లా పరీక్ష పెట్టారా కలెక్టర్ గారు….నాకు కొంచెం డిస్టర్బ్ గానే అనిపించింది.

ప్రయత్నం చేద్దాం నేను ఎరువుల కొరత బ్లాక్ మార్కెట్ సమస్యలపై ఎవరెవరితో మాట్లాడానో గుర్తు చేసుకున్నాను.

అందులో ఎంసిపిఐ నాయకుడు…. అబ్బాపురం గ్రామానికి చెందిన శీలం బుచ్చి రెడ్డి ఉన్నాడు. ఆయన నిత్యం ఏదో ఒకప్రెస్ నోట్ పట్టుకొచ్చి  వార్తలు రాయమని వచ్చే వారు. నా చిన్న మేన మామ క్లాస్ మేట్ ఆయన.

ఆయన ఎ్పపుడూ కూర్చునే  హోటెల్ అడ్డాకు వెళ్లి దొరికిచ్చుకున్నా. ఎరువుల సమస్యలు ఉన్నాయన్నావ్.. బ్లాక్  అన్నావు..ఇవ్వాల వార్త కూడ రాసాను…కలెక్టర్ గారు డివిజనల్ మీటింగ్ కు వచ్చాడు…ఎక్కడ బ్లాక్ అయ్యాయని అడుగుతున్నాడని అన్నాను.

ఎక్కడ బ్లాక్ అయినయో కలెక్టర్ తెల్సుకోవాలే….వాళ్ల అధికారులను పంపి తనిఖీలు చేయాలే…అన్నాడు బుచ్చి రెడ్డి మామ…రొటీన్ గా…

అధికారులకు తెలియకనే సమాచారం అడుగుతున్నారు…..నీదగ్గర సమాచారం ఉంటే చెప్పు …కలెక్టర్ గారికి చెప్దాం అన్నాను…

అవన్ని నువ్వు నమ్ముతవా…డీలర్లు ఎవరెవరు బ్లాక్ దందా చేస్తున్నరో అగ్రికల్చర్ ఆఫీసర్లకు తెల్వదా…ఎవరి పంపకాలు వారికి ఉంటాయి..అంటూ ఆయన అధికారులపై వరుసగా తిట్ల వర్షం కురిపించాడు…

ఆయన ఒక్క నిమిషం తిరిగి అలోచించి…. గొల్ల వాడలో రెండు గోదాములు ఇంకో రెండు వాడల్లో  ఇంకో రెండు గోదాముల పేర్లు అవి కిరాయికి ఇచ్చిన ఇంటి యజమానుల పేర్లు చెప్పాడు….వీటి గురించి కలక్టర్ కు చెప్పమన్నాడు.

ఇప్పుడా గోదాముల్లో ఎరువుల బస్తాలు  ఉన్నాయా…లేవా అన్నాను.

బాజప్తా అమ్ముతున్నారు…నువ్వు నాతోని రా చూపిస్తా  అన్నాడు…

నాకు ఆయన మాటలపై కొంచెం నమ్మకం,  ధైర్యం కలిగాయి.

ఆగాగు… ఇప్పుడు మనం.వెళితే వాళ్లు జాగ్రత్త పడ్తారు…

పక్కా అడ్రస్ లు కావాలే …కలెక్టర్ గారు అడిగారు  ఇద్దామన్నాను…

అయితే నువ్వు ఇక్కడే కూర్చో నేను మావోళ్ళను పంపి పూర్తి అడ్రస్ లు తెప్పిస్తానని చెప్పి ఇద్దరు ముగ్గురు ఆయన వెంట ఉండే కార్యకర్తలకు చెప్పి పంపించాడు.

ఇంకో ప్రధాన మైన మనిషి నాకు ఎరువుల బ్లాక్ గురించి చెప్పిన అతను స్వయానా ఓ ఎరువుల డీలరే… ఎరువుల డీలర్ల మద్య ఏవేవో వ్యాపార సంభంద గొడవలు ఉంటాయి. డీలర్లకు ఈయనకు పడదు. ఆడీలరు పేరు చెప్పడం సరికాదు కనుక ఇక్కడ ఆయన పేరు వెల్లడించడం లేదు.

ఆయన గుర్తుకు వచ్చి…వెళ్లిఅడిగాను… జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడికే వచ్చారు. మీటింగ్ ఉంది ఎక్కడ బ్లాక్ మార్కెట్ జరుగుతోందని అడిగారు…వివరాలు కావాలన్నారు అన్నాను.

అంతే…. కలెక్టర్ పేరు వినగానే  ఆయన బాగా భయ పడ్డాడు……ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో.. ఏదో అడిగితే చెప్పినా… కాని… నాకు గోదాముల వివరాలు ఎట్లా తెలుస్తాయన్నాడు.

ఎంత చెప్పినా తనను ఇరికించ వద్దంటూ తనకేమి తెలియదని తల  అడ్డంగా ఊప సాగాడు….నీకు భయం లేదు నీ వెనకాల నేనుంటానన్నాను.

నన్ను వెదుక్కుంటూ ఎంసిపిఐ నాయకుడు బుచ్చిరెడ్డి అక్కడికి వచ్చి  ఇదిగో అడ్రస్లు అంటూ అవి రాసి ఉన్న కాగితం ఇచ్చాడు.

అందులో వివరాలు చవిది వినిపిస్తుంటే  మా ఎదురుగా ఉన్న  డీలరు అప్పటివరకు వివరాలు చెప్పేందుకు తనకు  తెలియదంటూ నిరాకరించిన వ్యక్తి  అన్ని కరెక్టేనని ధృవీకరించాడు.

అప్పటికి ధైర్యం తెచ్చుకుని వాటికి మరో రెండు మూడు గోదాముల అడ్రస్ లు… అవి ఎవరివో కూడ చెప్పాడు,

బుచ్చిరెడ్డి మామను అప్లికేషన్ రాయమంటే… ఏ ఎందుకు ఇట్లనే ఇద్దాం… పా అంటూ …లేచాడు.

అట్లకాదు జిల్లా కలెక్టర్ గారు అడిగారు…మనం వివరాలు సేకరించాం …రిటన్ గా ఇస్తే ఓ ఆధారం ఉంటుందని చెప్పాను. ఎంసిపిఐ పార్టీ పేరుతోనే కంప్లేంట్ ఇచ్చినట్లు ఉంటే మంచిది అన్నాను.

బుచ్చిరెడ్డి మామకు టెన్షన్ పెరిగితే  వణుకుడు మొదలైతది.

ఆయన చాలారోజుల నుండి వణుకుడు వ్యాధి తో బాద పడుతున్నాడు.

నేనే తెల్ల పేపర్ పై బుచ్చి రెడ్డి పేరుమీద జిల్లా కలెక్టర్ పేరిట  అప్లికేషన్  రాసి అందులో దొంగ నిల్వల గోదాముల అడ్రస్ లు రాసి జిల్లా కలెక్టర్  మీటింగ్ జరుగుతున్న మండల ప్రజా   పరిషత్ కార్యాలయానికి వెళ్లాం. బుచ్చిరెడ్డి మామ ఆయన పార్టి కార్యకర్తలు నాతోపాటు నా క్లాస్ మేట్ భందువు కూడ అయిన బండారి కమలాకర్ నా వెంట ఉన్నారు.

చాలారోజులుగా ఎరువులు దొరకడం లేదని తిరుగుతు….బ్లాక్ జరుగుతోందని చెప్పి నాతోని వార్త రాయించిన వారిలో కమలాకర్ ఒకరు.

డివిజనల్ మీటింగ్ అయ్యే వరకువేచి ఉండి జిల్లా కలెక్టర్ గారు బయిటికి వచ్చినంక ఎంసిపిఐ వారిని  తీసుకుని వెళ్లి కలిసాను.

వీళ్లంతా ఎవరన్నారు….ఈయన ఎంసిపిఐ నాయకుడు సార్ ఎరువుల బ్లాక్ గురించి వివరాలు తెచ్చాడన్నాను. ఆపేపర్ తీసుకుని చదివాడు.

పేపర్ లో కింద ఉన్న గోదాముల చిరునామాలు చూసి ఇవన్ని కరెక్టేనా అని నావైపు చూసాడు.

అక్కడున్న వాళ్ళు వివిద శాఖల అధికారులు దూరంగా నిలిబడి చూస్తున్నారు. ఎంసిపిఐ వారిని చూసి ఏదో  రిప్రజెంటేషన్ ఇచ్చారు అనుకున్నారు.

కలెక్టర్ ఆపేపర్ తీసుకుని కారెక్కాడు. కారు పిడబ్ల్యుడి  గెస్టుహౌజ్ వైపు వెళ్లడం చూసాం.

కలెక్టర్ గారు ఏం మాట్లాడ లేదు…ఏం అడగ లేదు…పేపర్ తీసుకుని కారెక్కి వెళ్లిపోయిండని బుచ్చిరెడ్డి మామ అప్పటికే గులుగుడు మొదలు పెట్టిండు.

కలెక్టర్ గారే అడిగారు…మనకు తెల్సిన సమాచారం  తెచ్చి ఇచ్చినం…..ఏం జరుగుతుందో చూద్దాం…అంటూ మేము మా అడ్డా… అప్పుడు డివిజనల్ పౌర సంభందాల శాఖ కార్యాలయం వెళ్లి కూర్చున్నాం.

కలెక్టర్ గారికి ఇచ్చిన వివరాలు బహుశా వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చి తనిఖీలు చేయమంటారో ఏమో…ఇక్కడి లోకల్ అధికారులు అందరూ స్థానిక డీలర్లతో  మంచి సంభంధాలు ఉన్నవారే… అంతా వేస్ట్ అయిందను కుంటూ  వృధాప్రయత్నం అయిందని భాదతోనే వేరే ముచ్చట్లలో పడ్డాం.

ఓ పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత జిల్లా  కలెక్టర్ కాన్వాయ్ వెళ్లడం చూసాం…అరే కలెక్టర్ గారు వెళ్లి పోతున్నారే… మనం అనుకున్నదే కరెక్టు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇచ్చి తనిఖీలు చేయమని చెప్పి ఉంటారు అనుకున్నాం.

ఓ పదినిమిషాల తర్వాత కాని అసలు పరిస్థితి మాకు అర్దం కాలేదు.

కలెక్టర్ బి.పి.ఆచార్య గారు ములుగు పట్టణ వీధుల్లో తిరుగుతూ ఎరువుల షాపులు,వారి గోదాములు తనిఖీ ప్రారంభించారు. ఆయన వెంట పోలీసులు, చుట్టూ మండల,డివిజనల్ అధికారులు.

కలెక్టర్ గారి చేతిలో  మేమిచ్చిన పేపర్ ఉంది. అందులో ఉన్న డీలర్ల పేర్లు చదువుతూ వారి అడ్రస్ లు అడుగుతూ షాపుల్లో స్టాకు రిజిస్టర్లు తనిఖి చేసారు. 

ఆ తర్వాత వారు నిర్వహించే గోదాములు తనిఖి చేసారు.

 తాళాలు వేసి ఉండడంతో ఆయన రోడ్డుపై ఎదురుగా నిలబడి వాటిని పగల గొట్టించాడు.

గోదాముల్లో డీలర్లు అక్రమంగా నిల్వ చేసిన  వందల ఎరువుల బస్తాలు చూసి ఆశ్చర్య పోయాడు.

అగ్రికల్చర్ అధికారులకు అయితే ముచ్చెమటలు పట్టాయి. ఎరువుల డీలర్లు అప్పటికే షాపులు గుమస్తాల కొదిలేసి ఫరారయ్యారు.

ఎంసిపిఐ నాయకుడు బుచ్చిరెడ్డి మామతో కలెక్టర్ కొద్ది సేపు మాట్లాడారు. ఇంకా వివరాలు ఇవ్వాలని అడిగారు. మండలాలు గ్రామాలలో  కూడ బ్లాక్ దందా జరుగుతోందని ఎంసిపిఐ నాయకుడు కలెక్టర్ గారికి చెప్పాడు.

ఎంసిపిఐ నాయకులు డీలర్ల గోదాముల భాగోతం కలెక్టర్ కు చెప్పి బట్టబయలు చేశారని అప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. ఇది ఓరకంగా  మంచిదే అయిందనుకున్నాను.

మేము అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ఎరువుల బ్లాక్ దందా ప్రూవ్ అయింది… స్వయంగా కలెక్టర్ గారే చూసారు. జిల్లా కలెక్టర్ ఏమిటి స్వయంగా ఎరువుల షాపులు తనిఖీలు చేసి బ్లాక్ చేసిన  నిల్వలు బయటికి తీయడం ఏమిటని ఓపెద్ద సెన్సేషన్ అయింది.

రైతులైతే కలెక్టర్ చేసిన పనికి చాలా సంతోష పడ్డారు.

తెల్లవారి పత్రికల్లో కలెక్టర్ బి.పి.ఆచార్య ఎరువుల షాపులు,గోదాములపై దాడులు నిర్వహించి బయటికి తీసిన  అక్రమ నిల్వల వార్తలు వాటి అనుబంద వార్తలు జిల్లా పేజీలకే పరిమితం కాకుండా మెయిన్ ఎడిషన్లలో పతాక శీర్షిక లయ్యాయి.

ములుగులో మొదలైన జిల్లా కలెక్టర్ గారి తనిఖీలు జిల్లా వ్యాప్తంగా జరిగాయి. అక్రమ నిల్వలు గోదాముల అడ్రస్ లు సేకరించి దాడులు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో  మొదలైన తనిఖీలు దాడులు ఎరువుల అక్రమ నిల్వల వెలికితీసే కార్యక్రమాలు క్రమంగా అనేక జిల్లాల్లో కొనసాగాయి.

 ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఎరువుల కొరత జరుగుతున్న గొడవలు చూసి ములుగులో 32 సంవత్సరాల క్రితం పరిపాలనా వ్యవస్థ కు మీడియా నిఘా నేత్రం ఎట్లా ఉపకరించిందో తెలిపేందుకే ఇదంతా రాయాలని పించింది.

ఇప్పటి ఎరువుల ప్రహసనం చూస్తుంటే ఎవరి భాద్యతల నుండి వారు తప్పుకున్నట్లు వ్యవహరిస్తున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి
అమెరికా డాలర్ కు ఆవలివైపు….
మోడీకి ట్రంప్ చిక్కుముడి