Headlines

సభ నడవ కూడదనే బిఆర్ఎస్ కుట్ర -సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: శాసన సభ సమావేశాలు జరగకూడదనే దురుద్దేశం తో నే బిఆర్ఎస్ పార్టీ గొడవలకు దిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశమై శాసనసభ కార్యకలాపాలు సజావుగా సాగకుండా కుట్ర చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని అన్నారు.

సీఎల్పీ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సభను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతిపక్షం చేసిన ఆరోపణలు, కుట్రలను బలంగా తిప్పికొట్టి ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. శాసనసభలో సభ్యులు తప్పనిసరిగా చర్చల్లో పాల్గొనాలని, హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన పదవిని సక్రమంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించడం కష్టమవుతుందని అన్నారు.

అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల సమక్షంలో టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం, శాసనసభాపతిని అభ్యంతరకరంగా దూషించడం జరిగిందని సీఎం పేర్కొన్నారు. దీనిపై జరిగిన ఘటనలకు సంబంధించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని, సభ జరిగే అన్ని రోజుల్లో సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

శాసన మండలి సమావేశాలను అందరికీ అనుకూలంగా ఉండేలా చారిత్రక భవనంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను ప్రారంభించి దానికి దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన కొంతమంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా అని ప్రశ్నించారు.

పోలీసు సిబ్బందిలో కేటీఆర్ కనిపించినట్టుగా భావించి కొందరు అంతటి ఆగ్రహంతో అధికారులపై దాడులకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశానికి తెలంగాణ చేపట్టిన కులగణన రోల్ మోడల్‌గా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ నమూనాలో దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

SIRపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి

SIR పేరుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా మరోసారి గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే వ్యక్తిగత పనితీరు, ప్రవర్తన భవిష్యత్ ఎన్నికల్లో గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతుందని అన్నారు.

దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చగా, ఓటర్ల జాబితాలో మాత్రం 88 కోట్ల మంది ఉన్నారని సీఎం పేర్కొన్నారు. సుమారు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఈ విషయంలో ఏదో ప్రమాదం పొంచి ఉందని, SIR అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

1,000 రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సహకరించిన ఎమ్మెల్యేలందరికీ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారంతో దేశంలో మరెక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం