బీసీల రిజర్వేషన్లు దానం కాదు.. హక్కు, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయలేదు-మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు.
బీసీలకు రిజర్వేషన్లు ఎవరో ఇచ్చిన దానం కాదని, అది బీసీల హక్కు, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలితమని మంత్రి స్పష్టం చేశారు.
1953లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం 1979లో బి.పి. మండల్ కమిషన్ ఏర్పడి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, విద్యా వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో OBCలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసిందని, 1990లో ఆ సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని గుర్తు చేశారు.
1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు OBC రిజర్వేషన్లకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఏర్పడిందని, 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రాజ్యాంగ హోదా లభించిందని తెలిపారు. OBC రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ రోహిణి కమిషన్‌ను కూడా కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణలో సమగ్ర కుల సర్వే చారిత్రక నిర్ణయం-మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే సామాజిక న్యాయానికి పునాది అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఎవరు ఎంతమంది ఉన్నారు? వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? రాజకీయంగా వారి వాటా ఎంత? అనే అంశాలను డేటా ఆధారంగా తెలుసుకునేందుకు సమగ్ర కుల సర్వే నిర్వహించామని తెలిపారు.
“ఇది కేవలం ఒక సర్వే కాదు.. సామాజిక న్యాయానికి పునాది. బీసీల హక్కులకు బలమైన ఆధారం” అని మంత్రి పేర్కొన్నారు.
“జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్” రాహుల్ గాంధీ నినాదంతో ముందుకుసాగుతున్నాం-మంత్రి వాకిటి శ్రీహరి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలు కన్నది సామాజిక సమానత్వమని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన “జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్” నినాదం సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు.
జనాభాలో ఎంత వాటా ఉంటే అవకాశాలు, అధికారంలో అంత వాటా ఉండాలనే స్ఫూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
కేంద్రంలో పన్నెండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల జనాభా లెక్కలు తేల్చడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోందని మంత్రి ప్రశ్నించారు.
“బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా వారికి ఎంత వాటా ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తారు? డేటా లేకుండా సామాజిక న్యాయం ఎలా సాధ్యం?” అని ప్రశ్నించారు.
బీసీలకు న్యాయం చేయాలంటే ముందుగా వారి జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు అవసరమని అన్నారు.
“కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను స్పష్టంగా చేర్చాలి. బీసీలను లెక్కించాలి.. బీసీలకు న్యాయం చేయాలి” అని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు.
“కులగణన చేయండి.. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయండి” అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

