Headlines

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

cm revanth reddy

  1. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
  2. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అమెరికా సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడమే పర్యటన ఉద్దేశమని సీఎం తెలిపారు.
  3. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ కారణాలతోనే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని కేంద్రం చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాల కోసం తాను అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ముందుగానే అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యటనలో ఎలాంటి రహస్యాలు, దాపరికం లేవని స్పష్టం చేశారు. అధికారిక పర్యటనల్లో ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు పర్యటనను పర్యవేక్షిస్తాయని, సమావేశాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయని చెప్పారు.

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం ఆరోపించారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చని, అయితే సత్సంబంధాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ప్రకటించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అమెరికా పర్యటన

పెట్టుబడులను ఆకర్షించడం, టెక్నాలజీ రంగంలో భాగస్వామ్యాలను పెంచడం, విద్య, క్రీడా రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడం అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం వివరించారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌కు అమెరికాలోని సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆహ్వానించేందుకు పర్యటనను ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమాల కోసం గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు ఎందుకు అనుమతి నిరాకరించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం సరికాదన్నారు.

లండన్‌లో విశ్వవిద్యాలయాలతో చర్చలు

ఇటీవల లండన్ పర్యటనలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించే అంశాన్ని ఆయా సంస్థలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. త్వరలో సంబంధిత ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందన్నారు.

అమెరికా, బ్రిటన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి విద్యార్థులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నప్పటికీ, ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా మరింత మందికి నాణ్యమైన విద్య అందించవచ్చని చెప్పారు.

తెలంగాణ లక్ష్యాలను ఆపలేరు

2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లక్ష్యాల్లో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన పర్యటనకు అనుమతి నిరాకరించడం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించే చర్యగా అభివర్ణించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాలను ముందుగానే ఆహ్వానించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఆహ్వానాలు అందించేందుకు అధికారులను పంపించినట్లు వెల్లడించారు. కేంద్రం అనుమతి నిరాకరించినప్పటికీ తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కోసం తమ కార్యాచరణ కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం