కాస్త ఫేస్ టర్నింగ్
ఇచ్చుకో చిరు సారూ..!
పేరేమో కొణిదెల
శివశంకర వరప్రసాద్..
ఉ’రఫ్’ చిరంజీవి..
ముద్దు పేరు మెగాస్టార్..
అంతకు ముందు
సుప్రీం హీరో..!
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే..
మనం మనం
అనుకోవడం దేనికి..
నేరుగా ఆయనకే
చెప్పేస్తే పోలా..
అయ్యా చిరంజీవి గారూ..
ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి..
ఇకనైనా కాస్త
మీ పంథా మార్చుకుంటే
ఎలా ఉంటుంది..
ఆలోచించండి..!
ఖైదీ..గూండా..
రోజులు పోయాయి..
గ్యాంగ్..గ్యాంగ్..
బజావో బ్యాండ్ బ్యాండ్..
ఆ రిధం ఇప్పుడు మీలో కనిపించడం లేదు..!
స్వయంకృషి..
ఆపద్భాందవుడు..
తియ్యడానికి
కళాతపస్వి లేరు..!
యమహానగరి..
కలకత్తాపురి..
నమహో హుగిలీ..
హౌరా వారధీ..
మిమ్మల్ని అలా
చూడాలని ఉంది
అనుకున్నా
ఆ చార్మ్ ఏదీ..!
బావగారూ బాగున్నారా..
అని అడగడానికి..
అభీభీ అంటూ కవ్వించటానికి రంభ
ఎప్పుడో రిటైరై పోయింది..
అయినా తమరిప్పుడు
ఆలా రంభతో రచ్చ రంబోలా
చేసినా ఓ హిట్లరయ్యా..
అది అంత బాగోదయ్యా..
ఆదంతా ఇప్పుడు ఓవరయ్యా..!!
సరే..మీ అభినయాన్ని ప్రాణం ఖరీదు నుంచి జనం చూస్తూనే ఉన్నారు.
మనవూరి పాండవులు సినిమా చూసి కుర్రాడిలో స్పార్క్ ఉంది..
పైకొస్తాడు అనుకున్నారు..
పున్నమినాగు లో మీ నటన
అదుర్స్..న్యాయం కావాలి లో
రాధికను మోసం చేసినా వేసం బాగుందే అనుకున్నారు..కొన్ని నెగెటివ్ రోల్స్ వేసినా హీరోగా
చక్రం తిప్పాలన్నది
మీ అభిలాష..
టాలీవుడ్ లో
ఇక నా శకం అంటూ
ఖైదీ తో మీ జీహాదీ..
అప్పటి నుంచి వెండితెరను రఫ్ఫాడిస్తూ సాగిన
మీ గమనం
ఓ ఛాలెంజ్..!
సరే..ఇలా రాస్తూ పోతే
మీ సక్సెస్ వేట..
మీ ఘరానామొగుడు పాత్ర..
మెగా ఫ్యామిలీలో అన్నయ్య గా మీ బాధ్యత..
ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా
చెక్కు చెదరని మీ స్థానం..
మొత్తంగా చిరు నటుడి స్థాయి నుంచి పద్మభూషణ్
చిరంజీవి వరకు
మీ ప్రస్థానం..
అదంతా చరిత్ర..!
మధ్యలో రాజకీయాల్లో అడుగుపెట్టి ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి మాటాడుకోవద్దు..
ఎందుకంటే అభిమానులకి సంబంధించి మీరు అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ
మెగాస్టార్ చిరంజీవి.
మీరు రాజకీయాల వైపు చూసినప్పుడు కూడా
అయ్యో మా అన్న ఎందుకు సినిమాల్ని వదిలేసి వెళ్లిపోతున్నాడని బాధపడిన
అభిమానులే ఎక్కువ.
తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు సంబరపడిన
తమ్ముళ్ల సంఖ్య
తక్కువేమీ కాదు..!
రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత
మీ సినిమాల రీళ్లను
చకచకా తిప్పుకుందాం.
రాజకీయ అరంగేట్రానికి ముందు మీరు ఒక వ్యూహం ప్రకారం సందేశం ఇచ్చే కథలను ఎన్నుకుని
మీ రాజకీయ ప్రవేశానికి
ఆ సినిమాలను ఉపయోగించుకుందామని
ప్రయత్నించారు.ఆ కోవలో మాస్టర్..ఠాగూర్..స్టాలిన్ వంటి సినిమాలు చేశారు.
నిజానికి ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ముందు తాను కూడా కొంచెం పంథా మార్చి
పెద్ద వయసు పాత్రలు కొన్ని చేశారు.రాజకీయాలు పెద్దగా చొప్పించకపోయినా కొండవీటి సింహం..జస్టిస్ చౌదరి..బొబ్బిలిపులి..సర్దార్ పాపారాయుడు..
చండశాశనుడు
వంటి సినిమాలు
వాటిలో ఉన్నాయి.
అదృష్టవశాత్తు అవన్నీ సూపర్ హిట్టయ్యాయి.
తెలుగుదేశం పార్టీ స్థాపనకు ముందు వచ్చిన నా దేశం సినిమాలో మాత్రం కొంత రాజకీయ పోకడలు కనిపించాయి.మొత్తానికి
ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం..
అక్కడ కూడా ఆయన గ్రాండ్ సక్సెస్ కావడం..మధ్యలో కొన్ని సినిమాలు చేయడం
అదంతా కూడా ఓ చరిత్రే.
‘చిరు’నామా మారిందే..!
చిరంజీవి కథ రామారావులా సాగలేదు.చిరు రాజకీయంగా చేదు అనుభవం చవి చూసి మళ్లీ తల్లి వంటి సినిమా పరిశ్రమ ఒడిలోకే చేరారు.
ఖైదీ నంబర్ 150 తో తిరిగి మేకప్ వేసుకుని వరస సినిమాలు చేస్తూ వస్తున్నారు.కానీ ఆ సినిమాలేవీ ఆయన ఇమేజికి సరితూగేలా..మెగాస్టార్ గా ఆయన హోదాని పెంచేవి..ఆయన క్యాలిబర్ని ప్రదర్శించేవిగా లేవన్నది చెప్పకతప్పని నిజం..
చిరంజీవి ఆలోచన చేయాల్సిన సమయం ఇదే.
ఏం మీరు ఇంకా అవే మూస సినిమాలు చెయ్యాలా..
అలాంటి పాత్రలే వేసి ఇంకా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా..
లేదు కదా..డాన్సులు చేశారు..ఫైట్లు చేశారు..
పంచ్ డైలాగులు చెప్పారు..హీరోయిన్లతో గంతులు వేశారు..ఫ్యాక్షనిజం వైపూ ఒక చూపు చూసారు..
కామెడీని టచ్ చేశారు..
ప్రయోగాలు చేశారు..
సోషియో ఫాంటసీ సినిమాల్లో నటించారు.
శివుడిగా..శివుడు..శివుడు.. శివుడు గానూ కనిపించారు.
ఇంకేమి కావాలి..ఇప్పుడు మీరింక కొత్తగా చూపించాల్సింది ఏమిటి..!?
అసలు ఉందా..అంటే ఉందండోయ్..!
వెరైటీ…కొత్తదనం..
మీ వయసుకి..
మీ క్యాలిబరుకి
తగిన పాత్రలు ఎన్నుకుని
మీలోని ఇంకో నటుణ్ణి..అసలైన చిరంజీవిని చూపించాలి..ఎన్టీఆర్ చేసినట్టు
సర్దార్ పాపారాయుడు.. బొబ్బిలిపులి..జస్టిస్ చౌదరి
వంటి పాత్రలు..ఏం హీరో అంటే కుర్రాడేనా..తన వయసుకి మించి ఎన్టీఆర్
ఆ రోజుల్లోనే భీష్మ..
బడిపంతులు వంటి సినిమాలు చేసి మెప్పించలేదా..అక్కినేని నవరాత్రి సినిమాలో ఎన్ని పాత్రలను పండించారో మనం చూడలేదా..
ధర్మాదాత కూడా ఆయన కీర్తిని పెంచలేదా..!?
పింక్ లో అమితాబ్ చేసిన పాత్ర లో హీరోయిజం లేదా.. షోలేలో అమితాబ్ జై..ధర్మేంద్ర వీరూ ఉన్నా ఠాకూర్ సంజీవ్ కుమారేగా అసలైన హీరో…ఆయనకే కదా ఆ సినిమాలో మంచి పేరు వచ్చింది.!
మీ వయసు వాడే అయిన
కమల్ హాసన్ ఎన్నెన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ కాలేదు. పొట్టివాడు..
కురూపి..ఎత్తు పళ్ళ రామన్..
అంధుడు..ముసలి భారతీయుడు..ఇక దశావతారం సంగతి చెప్పనే అక్కర్లేదు..అన్నట్టు భారతీయుడు..ఇలా చెప్పుకుంటూ పోతే హీరోలు రకరకాల పాత్రలు వేసి మెప్పించిన సినిమాలు ఎన్నో..ఎన్నెన్నో..!
ఇక మోహన్ లాల్..
మమ్ముట్టి వంటి హీరోలు
ఈ స్టంట్లు..డ్యాన్సులు..
పంచ్ డైలాగులు..కార్లు ఎగరేయడాలు..కొడితే పది మంది తుళ్ళిపోయే సీన్లు లేని సినిమాలు చేసి మెప్పిస్తున్నారు కదా..
ఇదంతా చెప్పుకుంటూ పోతే చాంతాడు..కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు..!
ఇప్పటికే మిగిలిన రంగాలతో పోలిస్తే మన తెలుగు సినిమాల్లో క్వాలిటీ అంతంత మాత్రం.మూస..మాసు..
మధ్యలో ఊరమాసొకటి..
ఆపై ఎక్కడా లేని ఫ్యాక్షనిజం..ఎలివేషన్ ఆఫ్ హీరోయిజం..మీకు ఈ వయసులో అవసరమా ఇవన్నీ చిరంజీవీ…!
ఇప్పుడిక ఆరాధన..రుద్రవీణ
వంటి ప్రయోగాలకు
సమయం ఆసన్నమైంది..
మీరు మాస్ హీరోగా మంచి
ఫాంలో ఉన్నప్పుడు ప్రయత్నించారు..ఫ్యాన్స్ మిమ్మల్ని అప్పుడు అలా నచ్చలేదు.ఇప్పుడు అభిమానుల ఆలోచన కూడా మారింది.వాళ్ళు సైతం మీ నుంచి గొప్ప సినిమాలు కోరుకుంటున్నారు..!
టాలీవుడ్లో మీరో ట్రెండ్ సెట్టర్..ఫైట్లు..డాన్సుల్లో మీరు ఎన్నో మార్పులు తెచ్చి
ఇది చిరు స్టైల్ అన్న స్థాయి తెచ్చుకున్నారు.ఇప్పుడు మరో మార్పుకి మీరే ఎందుకు శ్రీకారం చుట్టకూడదు..ఇది మీకు ఇండస్ట్రీకి కూడా మంచే చేస్తుంది.ఇప్పుడు డైరెక్టర్లకు కూడా మీతో సమస్య ఏంటంటే మీ ఇమేజ్ చట్రంలో వాళ్ళు ఇరుక్కుపోతున్నారు.
కొరటాల శివ..
మెహర్ రమేష్ అలా
మీ ఇమేజికి బలై పోయారు..
మంచి దర్శకుల్ని ఎన్నుకుని వారి చేత కొత్త కథలు రాయించుకుని మీరు నటిస్తే అది తెలుగు సినిమాకి మంచి మలుపు అవుతుంది..
మీ ఫేస్ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోండి..మెగాస్టార్ నవయుగాస్టార్ గా మారాలి.
మరో కొత్త చరిత్రకి
చిరు చిరునామాగా అవతరించాలి.
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మీరే హోప్ అండ్ హ్యాపీ ఆఫ్ ది ఇండస్ట్రీ..!
మళ్లీ మీరు విజేత కావాలి..
నిర్మాతల పాలిట ఆపద్భాంధవుడు గా ఉండాలి..
మీ గెలుపు పరిశ్రమ గెలుపు..
టాలీవుడ్ కి మలుపు..
అభిమానులకు మైమరపు..
రాబోయే తరాలకు
ఓ పిలుపు..!
జన్మదిన శుభాకాంక్షలతో..
సురేష్ కుమార్ ఎలిశెట్టి
జర్నలిస్ట్
9948546286
7995666286