మెగాస్టార్ చిరంజీవికి GHMC షాక్: అనుమతుల కోసం హైకోర్టును ఆశ్రయించిన చిరు!
హైదరాబాద్, జులై 15, 2025: మెగాస్టార్ చిరంజీవికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల తీరు తీవ్ర అసహనాన్ని కలిగించింది. తన నివాసం పునర్నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా, దాదాపు నెల రోజులుగా ఎటువంటి స్పందన లేకపోవడంతో చిరంజీవి ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరంజీవి సొంత నివాసం 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని అనుమతులు పొంది నిర్మించుకున్నది. దాదాపు 15 సంవత్సరాలు కావడంతో, ఇటీవల తన ఇంటిని పునర్నిర్మించుకోవాలని, మరికొన్ని నిర్మాణాలు చేపట్టాలని మెగాస్టార్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే, సవరణలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ అనుమతుల కోసం ఇటీవల GHMCకి దరఖాస్తు చేసుకున్నారు.
కానీ, చిరంజీవి దరఖాస్తు చేసుకుని దాదాపు నెల రోజులు గడిచినా GHMC నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. ఈ విషయంపై అధికారులకు ఫోన్లు చేసినా వారు స్పందించకపోవడంతో చిరుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు, తన న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించక తప్పలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. చట్ట ప్రకారం అనుమతులు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.
మంగళవారం చిరంజీవి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, GHMC అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని వారిని నిలదీసింది. “అక్రమ నిర్మాణాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా?” అని ఘాటుగా ప్రశ్నించింది. సాధ్యమైనంత త్వరగా చిరంజీవి ఇంటి పునర్నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని GHMCని ఆదేశించింది.
న్యాయస్థానం జోక్యంతోనైనా మెగాస్టార్‌కు సకాలంలో అనుమతులు లభిస్తాయో లేదో వేచి చూడాలి. అయితే సర్కార్ పనితీరుపైనా ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణ పౌరులైనా లేదా విఐపీలు,వివిఐపీలు అయినా సర్కార్ విధానాలు ఉండాలి. పరిమితుల మేరకు పనులు జరిగిపోవాలి. కాని అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.