బ్లాక్ కోట్స్ ఫర్ బ్లూ రివల్యూషన్

 స్వాతంత్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్నప్పటికీ బహుజన ప్రజల బతుకులు బాగుపడలేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆధిపత్య రాజకీయాల వల్ల గత 30 ఏండ్ల క్రింద స్వాభిమానంతో బ్రతికిన బహుజనులు  నేడు బతకలేక బలిదానాలు చేసుకుంటున్న దుస్థితిలో ఉన్నారు. రాజ్యాంగ హక్కులు అమలు కాక, స్వాతంత్ర రాజకీయ అధికారం లేక ఎందుకు గొరగాని బతుకులు బతుకుతున్నారు. గత 25 ఏండ్లలో వచ్చిన మార్పుల వల్ల మెజార్టీ బహుజన ప్రజలు గ్రామాలు విడిచి నగరాలకు, విదేశాలకు వలసలు వెళుతున్నారు. ఉద్యోగాల రీత్యా కొందరు, బ్రతుకుదెరువు కోసం వలసలు పోయిన వారు కొందరు అయితే చాలీ చాలని వేతనాలతో కొనసాగుతున్న బహుజన ప్రయివేట్ ఉద్యోగుల స్థితి చాలా దయనీయంగా ఉంది. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు విలసిల్లిన కాలంలో కార్మిక హక్కులు, భారత రాజ్యాంగం ఓ మేరకు అమలై ప్రజలు హక్కులతో, జీవన భద్రతతో ఎదో ఓమేరకు జీవించారు. బహుజనుల జీవితాల్లో ఆ కాస్త మార్పును కూడా ఓర్చుకోలేని మనువాద పాలకులు స్వార్థ రాజకీయాలతో భారత రాజ్యాంగాన్నే దొడ్డిదారిన ఎత్తివేయడానికి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటూ మనువాద అనుకూల, బహుజన వ్యతిరేక సంస్థాగత మార్పులకు 1990 నుండి పూనుకున్నారు. అందువల్ల నేటి బహుజనుల ఆర్ధిక మూలాలు విధ్వంసం మవుతున్నాయి. రాజ్యాంగ హక్కులు, భద్రతలు బహుజన సమాజం తనకు తెలియకుండానే రోజురోజుకు కోల్పోతుంది. అందులో భాగంగానే బహుజన యువత, కార్మిక లోకం ఎలాంటి హక్కులు, భద్రత లేని స్విగ్గి, జోమాటో, రాపిడో, ఊబర్, రిలయన్స్ లాంటి బహుళ జాతీయ సంస్థల్లో రేపటికి గ్యారంటీ లేని జీవితాల్లో కొనసాగుతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న అభివృద్ధి వల్ల బహుజనుల ప్రధాన వృత్తులు ధ్వంసమై గత జీవితంతో సంబంధం లేని ఎన్నో వృత్తుల్లోకి మారిన ప్రజలు ఆయా వృత్తుల్లో రాణించలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. 

ఆ క్రమంలో న్యాయవాద వృత్తిపై మక్కువతో కొందరు, జీవనాధారం కోసం కొందరు న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. బహుజన పూర్వీకులకు అసలే విద్య లేని స్థితి నుండి అరకొర వసతులతో విద్య నేర్చుకున్న చాలా మంది బహుజనులు ఎంతో కష్టపడి న్యాయవాద వృత్తిలోకి వచ్చారు.

తరతరాలుగా ఆధిపత్యంలో ఉన్న ఆధిపత్య వర్గాల వారు న్యాయ వ్యవస్థలో కూడా నేటికీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. బహుజన వర్గాల వారిని న్యాయవాద వృత్తిలోకి రాకుండా చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో లేని ఎన్నో నిబంధనలను తీసుకొచ్చి బహుజన న్యాయవాదులను, పేద న్యాయవాదులను వృత్తికి దూరం చేస్తుంది.   న్యాయ వ్యస్థలో ఆధిపత్య వర్గాల వారికి అనుకూలమైన విధానాన్ని ఏర్పరచుకొని న్యాయమూర్తులుగా వారే నియమితులవుతున్నారు. వారి ఆర్థిక స్థోమత, వారి పూర్వీకుల సహకారంతో వారు ఒక ప్రణాళిక బద్ధంగా జాతీయ న్యాయ కళాశాలలో విద్యను అభ్యసించడమే కాకుండా రాజ్యమేలుతున్న ఆధిపత్య పాలకుల సహకారంతో మునిసిఫ్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు న్యాయమూర్తులుగా వారే నియమించబడుతున్నారు. పలితంగా చాలా సందర్భాల్లో బహుజన వర్గాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఇస్తూ అనచివేస్తున్నారు. ఆధిపత్య వర్గాల వారు లెక్కకు మించి న్యాయమూర్తులుగా నియామకం జరగడం వల్ల దేశ మూలవాసి ప్రజలకు వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నారు. 1990 లో మండల్ కమీషన్ నివేదిక అమలు నుండి నేటి కామారెడ్డి (బి.సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు) వరకు OBC రిజర్వేషన్లను న్యాయస్థానాలు అడ్డుకున్న తీరు ఇందుకు పెద్ద సాక్ష్యం.
 భారతదేశంలో సమన్యాయం కోసం, సామాన్యుల హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల అమలు కోసం నిరంతరం న్యాయస్థానాల్లో వాదించే న్యాయవాదులకు న్యాయ వ్యవస్థలో అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు భారతదేశంలో అన్ని రంగాల్లో అమలవుతున్నప్పటికీ న్యాయ వ్యవస్థలో అమలు కావడం లేదు. న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో వేల సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసి ప్రజలను అణచివేసిన ఆధిపత్య వర్గాల వారే నేడు న్యాయ వ్యవస్థలో రాజ్యమేలుతున్నారు. ఎన్నో కష్టాలు పడి న్యాయవాద వృత్తిలోకి వచ్చిన మెజార్టీ న్యాయవాదుల వృత్తి మెళుకువలను, నైపుణ్యాన్ని పెంచడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆయా శాఖల్లో వారు ఉద్యోగాల్లో నియామకం కాగానే వారికి శిక్షణ ఇచ్చే సంస్థలు/అకాడమీలు ఉన్నాయి. న్యాయమూర్తులకు కూడా శిక్షణ కోసం జ్యుడిసరీ అకాడమీ వుంది. కొత్తగా వృత్తిలోకి వచ్చిన న్యాయవాదుల శిక్షణ కోసం న్యాయవాద అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ILPA డిమాండ్ చేస్తుంది. న్యాయవాద  వృత్తిలోకి వచ్చిన వెంటనే కనీస ఆదాయం లేకపోవడంతో చాలా మంది న్యాయవాదులు వృత్తికి దూరమవుతున్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని కూడా ILPA డిమాండ్ చేస్తుంది. 

ఇలాంటి ఎన్నో విషయాలను అధిగమించడం కోసం BAMCEF (Bacward And Minority Community Employees Federation) అనుబంధ విభాగంగా ఏర్పడిన ILPA (Indian Legal Professionals Association) మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తుంది. వేల సంవత్చరాలుగా విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరం చేయబడిన భారతదేశ మూలవాసి (SC, ST, OBC, Minority) ప్రజల విముక్తి జరగాలంటే విద్య అవసరమని మహాత్మా జ్యోతిరావు పూలే బహుజన/మూలవాసి ప్రజలకు విద్య నేర్పించి విముక్తి బాటలో నడిపించారు. పూలే, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్, సంత్ గాడ్గే బాబా, పండిత అయోతిదాస్, అయ్యంకాళి లాంటి మహనీయుల స్పూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎన్నో హక్కులను పొందుపరచారు. ఆ రాజ్యాంగ హక్కులను అమలుపరచాల్సిన పాలకులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసి దేశ మూలవాసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో ILPA తన కార్యక్రమాలను కొనసాగిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న బహుజన న్యాయవాదులను చైతన్యం చేయడం ద్వారా సంఘటితం చేసి బహుజన పరివర్తన ఉద్యమంలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ILPA పనిచేస్తుంది. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం ప్రాతిపదికన వివక్షత లేని వర్ణ కులాలు లేని మానవీయ విలువల బంధు సమాజంగా ‘భారత్’ ను మలచడం కోసం ILPA తన విలక్షణమైన కార్యక్రమాలతో నిరంతరం శ్రమిస్తూ ముందుకు కొనసాగుతుంది. ప్రతి గ్రామానికి రాజ్యాంగం, ప్రతి ఇంటికి రాజ్యాంగం చేర్చి బహుజన సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ILPA ప్రతిజ్ఞ చేసి తన కార్యక్రమాలను కొనసాగిస్తుంది.
కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారు వృత్తిలో రాణించడం కోసం కృషి చేస్తుంది. బహుజన వర్గాలకు చెందిన వారు న్యాయవాద వృత్తితో పాటు జ్యుడీషియల్ ఆఫీసర్లుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియామకం అవడం కోసం ILPA నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. వృత్తిలో రాణించడమే కాకుండా సమాజంతో విస్తృత సంబంధాలు కలిగిన న్యాయవాదులుగా మనకున్న మిగులు సమయాన్ని బహుజన సమాజ పరివర్తన కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్న ILPA గత 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. 160 ఏండ్ల క్రితం విద్యా అవసరాన్ని గుర్తించిన పూలే స్పూర్తితో నేటి బహుజన న్యాయవాదులకు న్యాయవాద వృత్తిలో నైపుణ్యాన్ని పెంచి వారు వృత్తిలో నిలదొక్కుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలయ్యేటట్లు చేసి బహుజన ప్రజలను విముక్తి చేసే మార్గంలో ILPA తన కార్యక్రమాలను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే గత 2024 ఆగస్టు 25 న తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సు నిర్వహించి బి.సి సమాజానికున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీలుకెళ్ళడం జరిగింది. డిసెంబర్ 20, 2025 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ILPA 5వ తెలంగాణ రాష్ట్ర మహాసభలో పూలే, అంబేద్కర్ సిద్ధాంతతో ఐ ఎల్ పి ఎ మెజార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషిని వివరించడం జరిగింది. సామాజిక న్యాయం కోసం కోర్టుల్లో వాదించే న్యాయ శాఖలో హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకంలో కుట్రపూరితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించక పోవడం వల్ల ఉన్నత న్యాయస్థానాల్లోకి అత్యున్నత స్థాయికి ఎదగడానికి అణగారిన వర్గాలకు అవకాశం లేకుండా చేయడం, తద్వారా బహుజనుల రాజ్యాంగ పరమైన, చట్టపరమైన హక్కులు, రక్షణల అమలుకు ఉన్నత న్యాయస్థానాల్లో మద్దతు దొరక్కపోవడం లాంటి ముఖ్యమైన విషయాల్ని చర్చించారు. న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం కల్పించడం ద్వారనే బహుజన సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చనే లక్ష్యంతో పనిచేస్తున్న ILPA కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర సదస్సులో రాజ్యాంగ విలువలు – ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్ట్ ప్రజల హక్కులు, ఇ డబ్ల్యు ఎస్ కు లేని నిబంధన ఒబిసి లకు ఎందుకు? మహిళా కోటాలో – బహుజన కోటా, న్యాయవాద రక్షణ చట్టం అనే నాలుగు అంశాలపై ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షులు సుజాత కె చౌదంటే, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కర్ణాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, సుభాస్ చంద్ర బోస్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు లు హాజరై వారి సందేశాన్నిచ్చారు.
రానున్న కాలంలో రాష్ట్ర స్థాయి మహిళా న్యాయవాదుల సదస్సు, ఎస్సి న్యాయవాదుల సదస్సు, ఎస్టి న్యాయవాదుల సదస్సు, మత మైనార్టీ న్యాయవాదుల సదస్సు నిర్వహించడం కోసం ILPA నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల వారీగా కూడా వర్గాల వారిగా న్యాయవాద సదస్సులు నిర్వహించి న్యాయవాదులను బహుజన సమాజానికి చేరువ చేయడంతో పాటు బహుజన సమాజ సమస్యలు, వాటి పరిష్కారం కోసం న్యాయవాదులను కనెక్ట్ చేయడం కోసం ILPA చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఆయా సమాజాల్లో, సమూహాల్లో ఎదిగిన వారు ఎదిగినట్లు ఏరు పడుతుంటే ఎదగని సమాజం అభివృద్ధి ప్రశ్నార్థకవుతుంది. అంబేద్కర్ బోధించి ఆచరించిన PAY BACK TO SOCIETY సిద్ధాంత అవగాహనతో ఎదిగిన సమాజాన్ని ఎదగని సమాజం అభివృద్ధికి కృషి చేసే విధంగా ILPA కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ILPA Eight (8) ప్రధాన విభాగులుగా పని విభజన చేసుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతుంది.

  1. Acadamic wing
  2. Agitation wing
  3. Ideological wing
  4. Legal awareness and legal aid wing
  5. Family coordination wing
  6. Legal research and analysis wing
  7. AID wing (Administration, Information, Documentation)
  8. Cultural wing ఏ ఆర్గనైజేషన్ అయినా తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మూడు ప్రధాన అంశాలు ఉండాలి
  9. ఐడియోలజీ
  10. ఆర్గనైజేషన్
  11. ఆర్థికం
    పై మూడు అంశాల్లో ILPA కు ఐడియాలజీ తో పాటు పటిష్ఠమైన అంకితభావంతో కూడిన నిర్మాణం కలదు. ఆర్గనైజేషన్ పని తీరుతో ఆర్థిక సమీకరణ చాలా సులువుగా నడుస్తుంది. ILPA తల్లి లాగ, తండ్రి లాగ, గురువు లాగ బహుజన, అణగారిన సమాజానికి అండగా ఉంటుంది. ILPA విస్తరణలో భాగంగా ప్రతి బార్ లో ILPA కమిటీలు వేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ కమిటీలో బహుజన భావజాలం కలిగిన ఎస్సి, ఎస్టి, బి.సి, మైనార్టీలు ఉంటారు.

ILPA బార్ కమిటీ, జిల్లా కమిటీ వేయడం కోసం మీతో పాటు మీకు తెలిసిన మిగతా బహుజన న్యాయవాదులను సిద్ధం చేయగలరు.
ILPA చేస్తున్న ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బహుజన న్యాయవాదులు ILPA నిర్మాణంలో చేరి బహుజన మహనీయుల ఆశయాల సాధనకు, సంఘటిత కార్యాచరణకు తోడ్పాటు అందించాలని ILPA పిలుపునిస్తుంది. ILPA సామాజిక, సమ న్యాయ ఉద్యమాన్ని మనందరం చేయి చేయి కలిపి చేతనైన సాయం చేస్తూ కాపాడుకుందాం, మున్ముందుకు తీసుకెళ్దాం.

చైతన్యం – ఐక్యత – అవకాశాలు – అధికారం కోసం జరిగే పోరులో ఐ ఎల్ పి ఎ తో న్యాయవాదులు కలిసి నడవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

Mere Education without cultural revolution is not a true liberation… Mahathma Jyothirao Pule

“The Constitution is not a mere lawyer’s document. It is vechicle of life and it’s spirit always the spirit of Age” …. Dr B.R Ambedkar.

ILPA TG STATE COMMITTEE
9866007657
9849106654

Share this post

One thought on “బ్లాక్ కోట్స్ ఫర్ బ్లూ రివల్యూషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన