చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అరెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 22: లంచం డిమాండ్ చేసి స్వీకరించారనే ఆరోపణలపై చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ బండేలా బాల్‌రాజ్, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర (PC-7491) రూ.75,000 లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
చందానగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 696/2026 కేసు దర్యాప్తు చేయడంతో పాటు చార్జిషీట్ దాఖలు చేసేందుకు అధికారిక చర్యలు తీసుకోవడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
బాల్‌రాజ్ కార్యాలయంలోని టేబుల్ డ్రాయర్ నుంచి రూ.75,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. అంతకుముందే బాల్‌రాజ్ రూ.20,000 నగదు, రాఘవేంద్ర రూ.10,000 యూపీఐ ద్వారా తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది.
అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపింది.
ఈ కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదని ఏసీబీ తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.

