Headlines

మండల్ స్పూర్తితో బి.సి లు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలి

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

హనుమకొండలో బి.పి మండల్ 108వ జయంతి

ఇతర వెనుకబడిన వర్గాలు (ఒబిసి) ల సుదీర్ఘ పోరాటం వల్ల నియమించబడిన మండల్ కమీషన్ నివేదికను బి.సి ల అభివృద్ధికి మేలు చేసే విధంగా అందించిన బి.పి మండల్ (బ్రిందేశ్వర్ ప్రసాద్ మండల్) స్పూర్తితో బి.సి లు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో మంగళవారం జరిగిన బి.పి మండల్ 108 వ జయంతికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బి.సి నాయకుల పోరాటం వల్ల నియమించబడిన బి.పి మండల్ ఎంతో శ్రమకోర్చి నివేదికలో 40 అభివృద్ధి సూచనలు పొందుపరచి 40 ఏండ్లు కావస్తున్నా ఆ అంశాల  అమలు పట్ల ఈ దేశ పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మండల్ నివేదికలోని అంశాల అమలు కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముందని అన్నారు. 1980 లో సమర్పించిన బి.పి మండల్ కమీషన్ నివేదికను 1990 లో ఆనాటి ప్రధాని వి.పి సింగ్ అమలు చేయడానికి పార్లమెంటులో ప్రకటించగానే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకటే గగ్గోలు పెట్టాయని ఆనాటి బిజెపి పార్టీ మద్దతు ఉపసంహరించుకుని వి.పి సింగ్ ప్రభుత్వాన్ని కూలదోసిందని, ఆనాటి నుండి నేటి వరకు బిజెపి ప్రభుత్వం బి.సి లకు వ్యతిరేకంగానే పాలన చేస్తుందని అన్నారు. ఇండియా జనాభాలో 60 శాతం పైగానున్న బి.సి సమాజం ఆది మానవుడి నుండి ఆధునిక మానవ సమాజం వరకు ఎన్నో ఆవిష్కరణలు చేసి అన్ని రంగాల్లో సేవలు అందించి స్వాభిమానంతో జీవించిన బి.సి లు నేడు బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని అన్నారు. 
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి ఇంటలెక్టువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ భారతదేశంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు వంద సంవత్సరాలకు పైనే చరిత్ర ఉందని, స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ పాలనలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్వదేశీ సంస్థానాల్లో రిజర్వేషన్లు ఉండేవి. భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడం కోసమే చేయబడిందంటే వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల ప్రాముఖ్యత ఎంతో అర్ధం చేసుకోవాలి. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు (ఆర్టికల్ 15[1]) వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు మద్దతుగా పెరియార్ చేసిన ఉద్యమంతో 1951 లో పార్లమెంటు లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపట్టి ఆర్టికల్ 15 కు క్లాజు 4 ను చేర్చి ప్రభుత్వం సామాజికంగాను, విద్యా పరంగానూ వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని ఆ క్లాజులో పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ జరిగి 75 ఏండ్లు దాటినా, మండల్ కమీషన్ నివేదిక ఇచ్చి 40 ఏండ్లు దాటినా బి.సి ల బతుకులు మారలేదని దేశాన్ని పాలించే ఆధిపత్య దోపిడి కులాల పాలకులే దీనికి కారణమని అన్నారు. 
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ బి.పి మండల్ నీతి నిజాయితీకి మారు పేరుగా నిలిచారని, ఆగస్టు 25, 1918 లో బీహార్  రాష్ట్రం మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారి కుటుంబంలో జన్మించిన బి.పి మండల్ 23 ఏటనే జిల్లా కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. జీతం తీసుకోకుండా జుడిషియల్ మేజిస్టేట్ గా పనిచేశారు. 1952 మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా, ఎం.పి గా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఫిబ్రవరి 1968 లో బీహార్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే ఆ విచారణ బుట్టదాకలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్ పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా  కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది తన ప్రభుత్వం కూలిపోతుందని తెలిసిన నీతికోసం నిలబడిన నాయకుడు బి.పి. మండల్ 1974 లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977 లో జనతా పార్టీ తరుపున లోకసభకు ఎన్నికయ్యారని అన్నారు. 
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి రెండు బి.సి వ్యతిరేక పార్టీలేనని, అన్నిపార్టీల కన్నాఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, గత 12 ఏండ్లుగా పాలిస్తున్న బిజెపి బి.సి లకు వ్యతిరేక పార్టీలే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు బి.సి జనగణన చేయనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి తాము అధికారంలోకి వస్తె ఒబిసి జనగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒబిసి జనగణన సాధ్యం కాదని నిస్సిగ్గుగా చెప్పి దేశంలోని 80 కోట్ల ఒబిసి లకు మోసం చేసింది. పూర్వ కాంగ్రెస్ పాలకులు ఒబిసి ల సమస్యలను సరిగా అర్థం చేసుకోకుండా ఒబిసి లకు అన్యాయం చేసిందని, ఇకముందు ఒబిసి లకు న్యాయం చేస్తామని, కుల జనగణన సామాజికన్యాయానికి ఎక్స్ రే లాంటిదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తె కుల జనగణన జరిపి రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల ముందు పెద్ద బహిరంగ సభ పెట్టి స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి మూడు ఏండ్లు కావస్తున్నా దిక్కు లేని స్థితి అని 42 శాతం రిజర్వేషన్లకు ఉన్న రాజ్యాంగపర అడ్డంకులను తొలగించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం శూన్యమని అన్నారు. 
వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ బి.సి ల సమస్యల సాధన కోసం, బి.సి జనగణన కోసం, బి.సి లకు విద్య, ఉద్యోగ, చట్టసభల్లో బి.సి లకు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాధికారం ద్వారానే బి.సి లకు విముక్తి జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో కులాలుగా విడగొట్టబడిన బి.సి లు ఏకమై పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బి.పి మండల్ ఆదర్శంగా ముందుకు సాగాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో బి.సి.ఐ.ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు న్యాయవాది జన్ను పద్మ, 

అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నలిగింటి చంద్రమౌళి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకులు తాడిశెట్టి క్రాంతి కుమార్, జల్లెల కృష్ణమూర్తి, సద్గుణ, తాడిశెట్టి కార్తీక్, గొల్లపల్లి, వీరస్వామి, రాచకొండ ప్రవీణ్ కుమార్, మడేల్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం