ఆబాలగోపాలమే

ఆబాలగోపాలమే
బాలగోపాలం!

కేక వెయ్యకుండా
కాక పుట్టించిన వీరుడు..
ఉద్యమమే
బ్రతుకు మాధ్యమమై
బతికిన ధీరుడు..
ఎక్కడ కష్టముంటే అక్కడ..
ఎవరికి నష్ఠమైతే వారితో..
తోడుగా నడిచిన..నిలిచిన
మానవతావాది..
అన్యాయానికి ప్రతివాది..
బాలగోపాల్…
హక్కుల కోసం
ఉదయించిన సూర్యుడు..
పోరాటాలలోనే
అస్తమించిన భానుడు!

దుర్మార్గుల దౌర్జన్యాల కంటే
మేధావుల మౌనమే
సమాజానికి ప్రమాదమని
ఏనాడో గ్రహించి
నిశ్శబ్దాన్ని చేధించి
ఉద్యోగాన్నే విసర్జించి…
నియంతృత్వ పోకడలపై
ఆగ్రహించిన యోధుడు..
స్వతంత్ర భారతంలో
మళ్లీ పుట్టిన
సమర యోధుడు!

బాలగోపాలమంటే ఆబాలగోపాలం..
మంది కోసమే బతికిన
జనకామందు..
దీనజనబంధు..
వివక్షపై కక్ష..
పేదోడి విజయం కోసమే
జీవిత పర్యంతం ప్రతీక్ష…
ప్రతి పోరాటమూ ఓ పరీక్ష..
విజయమో..వీరమరణమో
అదే దీక్ష..ఆత్మబలమే రక్ష!

అన్యాయం..అసమానత..
అణచివేత..ఆక్రమణ..
వీటిపై పోరాటాలతోనే
నిండిన డైరీ..
తిరుగుబాటు..నిలదీత..
నినాదం..రణనాదం…
ఇవన్నీ కలబోసిన డిక్షనరీ..
గుండె నిండా అభిమానమే
పేదోడిచ్చే సుపారీ..!

లెక్కల్లో పండితుడై..
దుర్మార్గుల లెక్కలు
సరిచూసిన పధికుడై..
చరిత్ర,సాహిత్యం..
రాజనీతి న్యాయశాస్త్ర
కోవిదుడై..
ప్రశ్నించే గొంతు..
నిలదీసే గళం..
ఎదురొడ్డే ధైర్యం..
సడలని ఆత్మస్థైర్యం
ఆస్తిపాస్తులుగా..
జీవితమే పోరాటంగా
పోరాటమే జీవితంగా
మసలిన మహావీరా…
కష్టాల భారతంలో
ఉద్భవించిన మరో చేగువేరా!

భయమే ఎరుగని ఈతడు
ఎందరికో తానభయం…
ఆయుధం పట్టిన
పోలీసుతో
ధైర్యమే ఆయుధమై
ఎన్నెన్ని పోరాటాలు..
ఎన్ కౌంటర్లో పాల్గొన్న ఖాకీపై
హత్యకేసు పెట్టాలని డిమాండు
వంచితులే బాలదండు!
రాయడం..చదవడం..
చదివింది ఆచరించడం..
ఎదురెళ్ళడం..ఎదిరించడం..
అదే నైజం..
అదే బాలగోపాలిజం!

పౌరహక్కుల యోధుడు
బాలగోపాల్ పుట్టినరోజు
(10.06.1952)
సందర్భంగా నమస్సులు..

(ఆయనతో మూడుసార్లు
మాట్లాడడం జర్నలిస్టుగా
నాకు లభించిన అవకాశం)

      *ఇ సురేష్ కుమార్*
Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం