హనుమకొండ, వరంగల్ రెండు జిల్లాలను కలిపి మహానగర అభివృద్ధి చేయాలి
ప్రజా సంఘాల పాత్రికేయ సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ
త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో అధికారం చేపట్టిన కెసిఆర్ వరంగల్ మహా నగరాన్ని డల్లాస్ చేస్తానని నమ్మబలికి ఖల్లాస్ చేసి జిల్లాను అన్ని విధాల విధ్వంసం చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం బాలసముద్రంలో ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు జిల్లాలుగా చేసి వరంగల్ జిల్లాతో పాటు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి దూరం చేసి ప్రజలను రాజకీయంగా, సామాజికంగా అనైక్యతకు గురి చేసి ధ్వంసం చేశారని తీవ్రంగా ధ్వజమెత్తారు. 1300 సంవత్సరాల చారిత్రక నేపథ్యం, 10 వేల మందికి ఉద్యోగం కల్పించిన ఆజంజాహి మిల్లు, 10 వేల మంది పేద మహిళలకు ఉపాధి కల్పించిన బీడీ పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్, తెలంగాణ ఉద్యమ సారథ్యం కలిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాను రాజకీయ, ఆర్థిక, కాంట్రాక్టు వ్యాపార మొదలగు స్వప్రయోజనాల కొరకు ముక్కలు చెక్కలు చేసి, జైలు భూములను తాకట్టు పెట్టి వందల కోట్ల రూపాయల అప్పులు వరంగల్ ప్రజల నెత్తిన మోపి అభివృద్ధిని అడ్డుకున్న గత పాలనలో దగా పడిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదిమంది శాసన సభ్యులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
దుష్ట పాలన అంతమై ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ఇప్పటికైనా ఎలాంటి తత్చారం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందే హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లా కిందకు వచ్చేట్లు ప్రకటించి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా మంత్రులను, ఇంచార్జి మంత్రిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులు ఈ విషయమై చొరవ తీసుకొని నూతన సంవత్సర కానుకగా ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి మలిదశ ప్రారంభం నుండి సారథ్యం వహించిన వరంగల్ జిల్లాకు ఇంతవరకు న్యాయం జరగలేదని బదులుగా కక్షతో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 73 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదు నగరం అభివృద్ధిగా మారిపోయిందని ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించరాదని అన్నారు.
గత పది సంవత్సరాల అభివృద్ధి గణాంకాల పరిశీలిస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు జిల్లాలు 33 చివరి వరుసలో ఉన్నాయని ప్రొఫెసర్ వెంకట్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కాలయాపన చేయకుండా ఉమ్మడి జిల్లాలో కాకతీయ టెక్స్టైల్ పార్క్ సంపూర్ణ అభివృద్ధి, త్వరిత గతిన మామునూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణం, ఉత్తర తెలంగాణకు అవసరమైన అన్ని హంగులతో జైలు పునర్నిర్మాణం, పూర్తిస్థాయిలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం చేపట్టడం పర్యాటక కేంద్రాల, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని, 2028 లో సాధారణ ఎన్నికలకు ముందే శాస్త్ర సాంకేతిక, ఉన్నత విద్య అభ్యసంచి నిరుద్యోగులైన ఉత్తర తెలంగాణ ప్రాంత వేలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలని, వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. దేశంలో ఇప్పటికే 22 రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలు ఏర్పడ్డాయనీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ సంస్థ ఏర్పాటు చేయలేదని
మంత్రులు, శాసనసభ్యులు తమ సమిష్టి కృషితో ఈ సంస్థను కాకతీయ విశ్వవిద్యాలయం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నత విద్యాసంస్థలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంఘాని మల్లేశ్వర్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు పల్లపు సమ్మయ్య, అధ్యాపకులు వీరమల్ల బాబురావు, శ్రీధర్ల ధర్మేంద్ర, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్, రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే తదితరులు పాల్గొన్నారు.

