Headlines

కిట్స్ వరంగల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం- సిల్వర్ జూబ్లీ బ్యాచ్ రీయూనియన్ వేడుకలు

capt lakshmi kantharao

వరంగల్, జూలై 26: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్), వరంగల్‌లో శనివారం “అలమ్నై మీట్ అండ్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ – క్లాస్ ఆఫ్ 2000” వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడి పనిచేస్తున్న 320 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిట్స్‌వా-నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. శ్రీధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి రీయూనియన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా కిట్స్‌కు 27,000 పైగా పూర్వ విద్యార్థుల మద్దతు ఉంది. మెంటర్‌షిప్, ఇంటర్న్‌షిప్, ఉపాధి అవకాశాల కల్పనకు వారు తోడ్పడుతున్నారు,” అన్నారు.

కిట్స్ ఛైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ, “Y2K బ్యాచ్‌ను ప్రత్యేకంగా గుర్తించి, వారి విజ్ఞానం, నైతిక విలువలు, పరిశ్రమ అనుభవంతో యువ ఇంజినీర్లకు మార్గదర్శకులవ్వాలని కోరుతున్నాం. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న 1996–2000 బ్యాచ్‌కు శుభాకాంక్షలు,” అన్నారు.

కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, “పూర్వ విద్యార్థులు ఇప్పటివరకు 2.7 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.వై. జగన్ రెడ్డి రూ.2 కోట్ల విలువైన సాంకేతిక ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. వీరి సహకారంతో సాంకేతిక సెమినార్లు, వర్క్‌షాప్‌లు, స్టార్టప్‌లకు మద్దతు లభిస్తోంది,” అని అన్నారు.

ఈ వేడుకకు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా దేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 200 మంది విదేశీ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 131 మంది రిజిస్ట్రేషన్లు చేసు కోవడం విశేషం.

పూర్వ విద్యార్థుల ‘Y2K స్టార్ బ్యాచ్’ తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, పలు విభాగాల అధ్యాపకులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. ఎం. కోమల్ రెడ్డి, అకడమిక్ డీన్ ప్రొ. కె. వేణుమాధవ్, సివిల్ విభాగం హెడ్ డా. ఎం. శ్రీకాంత్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఓ. ఆంజనేయులు, పిఆర్‌ఓ డాక్టర్ డి. ప్రభాకరాచారి, ఇతర అధ్యాపకులు, స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE