అలుపెరుగని నాస్తికవాది జయగోపాల్

విశాఖపట్నంలో 1947 లో జన్మించిన జయగోపాల్ చిన్నతనం నుండే కులాన్ని సూచించే ఇంటి పేరును తిరస్కరించారు. ఆయన చదువుకున్నది చాలా తక్కువైనా తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలను ధారాళంగా మాట్లాడేవారు. చిన్నతనంలోనే అనేక మత గ్రంథాలను పరిశీలనాత్మకంగా క్షుణ్ణంగా చదవడంతో అవి మేడిపండులాంటివేనని ఒక నిర్ణయానికి వచ్చారు. చిన్నతనంలోనే మహానీయులైన పెరియార్ ఇ.వి. రామసామి, అంబేద్కర్, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్, చార్లెస్ బ్రాడ్లా, బెట్రాండ్ రస్సెల్ రచనలు ఆయనపై ఎంతో ప్రభావాన్ని చూపి సమాజం పట్ల జిజ్ఞాసను పెంచాయి. సంఘంలో జరుగుతున్న అమానుషాలను, అన్యాయాలను ఇంటి నుంచే ఎదిరించడం మొదలుపెట్టారు. చిన్నతనంలోనే సమాజంలో రుగ్మతలైన కులం, మతం, అంటరానితనం, మూఢనమ్మకాలను నిరసిస్తుండడంతో కుటుంబం నుండి దూరమయ్యారు. ఆయనపై ఇంటి మనుషుల నుండే హత్యా ప్రయత్నాలు, చిత్ర హింసలు, దొంగతనం ఆరోపణలు వచ్చినా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, భావాల నుండి దూరం చేయలేకపోయాయి.

తన అనేవారు లేని, చూడని, పలకరించని, జీవనం సరిగ్గా గడవని రోజులలో తన సహచరి శారదను మంత్రాలు లేని, మత తంతులేని, దేవుడి ప్రసక్తి లేని దండల పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే కటిక దరిద్రము వెంటాడుతున్నా ఎంతో ఓపికగా శారదమ్మ ఆయనకు కడవరకు ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలిచింది. జయగోపాల్ ప్రతీ అడుగులోనూ శారద ఉండేవారు. పెరియార్ రామసామి సామాజిక పోరాటం, ఆయన రగిలించిన సామాజిక న్యాయ సిద్ధాంతం మాత్రమే బహుజనులకు, అణగారిన వర్గాలకు సామాజిక విమోచనను కలిగించగలదన్న దృఢ సంకల్పాన్ని జయగోపాల్ బావ తత్వానికి, పోరాట పటిమకు బలాన్ని ఇచ్చాయి. తమిళనాడులో పెరియార్ కొనసాగించిన నాస్తిక ఉద్యమాన్ని అధ్యయనం చేసి తెలుగునాట అటువంటి ఉద్యమం లేకపోవడం జయగోపాల్ కు ఎంతో బాధ కలిగించింది. ఆ ఆలోచనలోంచి పుట్టిందే భారత నాస్తిక సమాజం. నాస్తిక ప్రచారాన్ని భుజాల పై వేసుకొని అహర్నిశలూ పాటుపడి, నాస్తికత్వం అంటే కేవలం తత్వశాస్త్రంగానే కాక ఒక ఆచరణాత్మక జీవన విధానంగా పండితుల నుండి పామరుల వరకు చేరువు కావాలని ఆశించిన వ్యక్తి జయగోపాల్. దేవుడు లేడనే ప్రచారం ఒక్కటే చాలదని ఈ సమాజంలో ఉన్న బాణామతి, చేతబడి మంత్ర తంత్రాలు, సామాజిక అసమానతలు, కుల నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలనకై ఒక సంఘం కావాలని 1972 లో భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేశారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన సంస్థ అనితర కాలంలోనే జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఆయన ప్రధాన సంపాదకుడిగా నాస్తికయుగం మాసపత్రికను, ది ఏజ్ ఆఫ్ ఎతీజం అనే ఇంగ్లీషు పత్రికను నిర్వహించారు.

1977 – 80 మధ్యకాలంలో అవతార మూర్తిగా వెలసిన బాలశివయోగిని భారత నాస్తిక సమాజం నిర్వహించిన బహిరంగ సభలో జయగోపాల్ ఛాలెంజ్ మట్టి కరిపించాయి. ఆ ఛాలెంజ్ ని తట్టుకోలేక బాలశివయోగి విశాఖపట్నం నుండి పారిపోయాడు. అప్పట్లో పుట్టపర్తి సాయిబాబా మహిమల బండారం బయట పెట్టడం కోసం ప్రేమానంద్ తో కలిసి బయలుదేరి జయ గోపాల్ పెను సంచలనం సృష్టించారు. విశాఖపట్నంలో ఏ.టి. కోవూరుతో జరిపిన బాబాల బండారం ప్రదర్శన జన సందోహాన్ని కదిలించగా ఆ సమయంలో ఆయన అరెస్టు కాబడ్డారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుపతి పట్టణానికి వాటికన్ ప్రతిపత్తి కల్పించాలని, తిరుపతి జిల్లాను బాలాజీ జిల్లాగా మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు జయగోపాల్ బృందం మేధావులతో ఒత్తిడి తేవడంతో ఎన్టీ రామారావు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గతంలో రామ రథయాత్ర జరుగుతున్న రోజుల్లో దానికి వ్యతిరేకంగా భారత నాస్తిక సమాజం తరఫున శంబూక రథయాత్ర నిర్వహించి రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తల దాడికి జయగోపాల్ గురయ్యారు. అప్పట్లో ప్రముఖ దినపత్రికలో ఇస్లాం లో స్త్రీ బానిసత్వం అనే వ్యాసం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించడమే కాకుండా రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైలు రోకోలు, బస్సుల దహనాలు, బంద్ పాటించడం జరిగింది. ఎన్ని కష్ట, నష్టాలు ఎదురైన నిజాన్ని నిర్భయంగా, ముక్కు సూటిగా చెప్పడం జయ గోపాల్ కు అలవాటు. జీవితంలో ఎన్నో ఉన్నత అవకాశాలు, డబ్బు సంపాదించే మార్గాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం వదులుకున్నారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మరువలేనిది.
దేశంలో మొట్టమొదటిసారిగా హక్కుల ఉద్యమంలోకి అడుగుపెట్టిన వ్యక్తి జయగోపాల్. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులకు అటు ప్రభుత్వాల నుంచి గాని, మతోన్మాదుల నుంచి గాని ఎదురవుతున్న హక్కుల ఉల్లంఘనలను ఆయా ప్రభుత్వాలు, ప్రపంచ మేధావుల దృష్టికి తీసుకురావడంలో జయగోపాల్ కీలకమైన పాత్ర వహించారు. ఆ ఆలోచనలోంచి పుట్టినదే ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ తింకర్స్ అనే సంస్థ. దీన్ని జయగోపాల్ నేతృత్వంలో 2001లో స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తస్లీమా నస్రీన్, సల్మాన్ రష్దీ, యునస్ షేక్ లాంటి ఎంతోమంది రచయితలకు మతోన్మాదుల నుండి ఎదురైన బెదిరింపులకు వ్యతిరేకంగా పని చేశారు. ముఖ్యంగా ముస్లిం దేశాలలో మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు ఎదుర్కొంటున్న నిర్బంథాలకు, మరణ దండనలకు వ్యతిరేకంగా విశేష మైన కృషి చేశారు.
ఓ పక్క మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలన్న ఆలోచనతో కృషి చేస్తున్న భారత నాస్తిక సమాజం మరో ముందడుగు వేసింది. 2004 లో విద్యార్థి దశ నుండే విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనలు కల్పించాలని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థను ఆయన స్థాపించారు. ఈ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాలలో విరివిగా కార్యక్రమాలను చేపడుతోంది. జయ గోపాల్ సాంస్కృతికోద్యమ మహాకవి సి.వి, పంజాబ్ కు చెందిన నాస్తిక పండితుడు సురేంద్ర అజ్ఞాత అంటే ఎంతో అభిమానం. ప్రపంచవ్యాప్తంగా జయగోపాల్ చేస్తున్న కృషికి గుర్తింపుగా అనేక సంస్థలు ఆయనను ఎన్నో అవార్డులతో సత్కరించాయి 1995లో పంజాబ్ కు చెందిన మానవవాది రచనా మంచ్ చే డాక్టర్ అంబేద్కర్ చేతన అవార్డు, తెలంగాణకు చెందిన నవ్య సాహిత్య పరిషత్ సంస్థ చే సాహిత్య పురస్కారం, విశాఖపట్నంలోని జై భీమ్ కల్చరల్ అసోసియేషన్ చే ప్రశంసా పత్రం, విశాఖపట్నంలోని ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీల సంఘంచే తెలుగు పెరియార్ అవార్డు, కెనడాకు చెందిన డయా హ్యూమనిజం ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఫ్రీ థాట్ ఇంటర్నేషనల్ చే పెన్ ఆఫ్ బ్రేవ్ మైండ్స్ అవార్డు, తమిళనాడుకు చెందిన ద్రవిడ కళగం చే పెరియార్ అవార్డు, ఇలా మరెన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు అకాడమీ ప్రచురించిన హేతువాదుల, నాస్తికుల, మానవవాదుల చరిత్రలో జయగోపాల్ గారి కోసం ప్రస్తావించడం జరిగింది. Dr. Finngeir Hiorth డాక్టర్ ఫిన్నిగర్ హీరోర్త్ వ్రాసిన Atheism in India (భారత్ లో నాస్తికత్వం) అనే పుస్తకంలో జయగోపాల్ గురించి, భారత నాస్తిక సమాజం గురించి ప్రస్తావించారు. 2000 సంవత్సరంలో బారికేడ్ బుక్స్ ప్రచురణలో హూ ఇస్ హూ ఇన్ హెల్ లో లో వారెన్ అలెన్ స్మిత్ ప్రకారం క్రిస్టియన్, ఇస్లాం, హిందువుల నరకాల్లో జయగోపాల్ ఒక భయంకరమైన అగ్ని నరకానికి రిజర్వ్ చేయబడినట్టు పేర్కొన్నారు.
జయగోపాల్ అనేక వేల సభలలో ఉపన్యసించటమే కాకుండా మూఢనమ్మకాలతో అలమటిస్తున్న అనేక ప్రాంతాలను సభ్యులతో పర్యటించి, చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. వందలాది కులాంతర, మతాంతర వివాహాలను నిర్వహించారు. అలాగే తెలుగు, ఇంగ్లీషులలో సుమారు 30 పుస్తకాలు, వందలాది వ్యాసాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి సత్య సాయిబాబా రహస్యాలు, కుల నిర్మూలన సాంస్కృతిక విప్లవం, క్రైస్తవం బానిసత్వం, జ్యోతిష్యం సైన్సా – మూఢనమ్మకమా ? చెలరేగుతున్న హిందూ ఫాసిజం తో పాటుగా ఇంగ్లీషులో రాసిన The Misery of Islam (థి మిసరీ ఆఫ్ ఇస్లాం) పుస్తకాలు ప్రముఖమైనవి. ది మిసరీ ఆఫ్ ఇస్లాం పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసినప్పటికీ జర్మన్ భాషలోనూ, పోలిష్ భాషలోనూ అనువదించబడింది. జయగోపాల్ రచనలను గుర్తించిన అమెరికా యూనివర్సిటీ జయాగోపాల్ కు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆయన ఏనాడు తన పేరు ముందర డాక్టర్ అని వ్రాసుకొని నిజమైన నిరాడంబర ఉద్యమకారుడు. జయ గోపాల్ ఆధ్వర్యంలోనే 2012లో విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా (గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో) పెరియార్ ఈ వి రామసామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు, బెదిరింపులు ఎదురైనప్పటికీ తుది శ్వాస వరకు నాస్తికత్వానికి అంకితమై తన జీవితాన్ని ధార పోసిన మహానుభావులు అతికొద్ది మందిలో జయ గోపాల్ ఒకరు. ఆయన 2024 ఫిబ్రవరి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. దేశంలోని నాస్తిక, హేతువాద ఉద్యమాలకు జయ గోపాల్ లేని లోటు తీర్చలేనిది. అత్యంత ధనవంతుల కుటుంబంలో పుట్టి, కటిక పేదవాడిగా పెరిగి, జీవితాన్ని అలాగే కొనసాగించి, నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్నే ధార బోసిన మహోన్నత వ్యక్తి జయగోపాల్.

(డాక్టర్ జయగోపాల్ రెండవ వర్ధంతి సందర్భంగా)

Share this post

5 thoughts on “అలుపెరుగని నాస్తికవాది జయగోపాల్

  1. Simply desire to say your article is as surprising. The clearness in your post is just great and i can assume you are an expert on this subject. Fine with your permission allow me to grab your feed to keep updated with forthcoming post. Thanks a million and please keep up the gratifying work.

  2. This design is wicked! You most certainly know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Excellent job. I really loved what you had to say, and more than that, how you presented it. Too cool!

  3. Nhà Cái xn88 game sở hữu số lượng thành viên tham gia siêu khủng bởi hệ thống vận hành chuyên nghiệp, mang lại cơ hội khám phá sản phẩm đặc sắc đa dạng trên thị trường. Thương hiệu cung cấp các sảnh cược nổi tiếng như: Bắn Cá, Casino Trực Tuyến, Thể Thao, Đá Gà, Nổ Hũ TONY04-14H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం