సద్గురు వీడియో చూసి నమ్మిన మహిళ… రూ.3.75 కోట్లు కాజేసిన డీప్‌ఫేక్ మోసగాళ్లు
బెంగళూరు: “సోషల్ మీడియాలో సద్గురు గారి వీడియో చూసి నమ్మకంగా అనిపించింది. ఆయన చెప్పినట్లే పెట్టుబడి పెడితే మాకు కూడా లాభం వస్తుందని అనిపించింది. కానీ ఆ నమ్మకం నా జీవితంలో పొదుపు చేసుకున్న మొత్తం కోల్పోయేలా చేసింది…” అని కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించారు ఒక రిటైర్డ్ మహిళ.
బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల ఈ మహిళ తన భర్త రిటైర్ అయిన తరువాత కుటుంబ భద్రత కోసం పొదుపు చేసిన మొత్తం డబ్బును ఎందులో నైనా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. అంతలోనే ఆమె ఫేస్‌బుక్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్ కనిపించే వీడియో చూసారు. ఆ వీడియోలో పెట్టుబడులు పెడితే ఆర్థిక స్థితి మెరుగవుతుందని స్వయంగా జగ్గీ వాసుదేవ్ చెప్పినట్లు ఉండడంతో ఆమెకు నమ్మకం కలిగింది.
నమ్మకం ఎలా మోసమైంది?
అంతే ఇక ఒక్క క్షణం ఆలోచించకుండా వీడియోలో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి తన పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ వివరాలు నమోదు చేశారు. కొద్ది రోజులకే “వలీద్ బి” అనే వ్యక్తి ఆమెకు కాల్ చేశాడు. తాను మిర్రాక్స్ అనే కంపెనీకి ప్రతినిధినని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని వివరించాడు.
మొదట చిన్న మొత్తంలో పెట్టిన డబ్బుపై లాభాలు వస్తున్నట్లుగా స్క్రీన్‌షాట్లు పంపించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసారు. అందులో దాదాపు 100 మంది సభ్యులు కూడా ఉన్నట్లు అందరూ లాభాలు పంచుకుంటున్నట్లుగా చూపించారు. “ఇంతమంది పెట్టుబడి పెడుతున్నారు. అందరికీ లాభం వస్తోంది. నేనూ వెనకబడకూడదు” అని ఆమె భావించి క్రమంగా పెద్ద మొత్తాలు పంపసాగారు.
కోట్లకు అధిపతి కావాలని….
మొత్తం రూ.3.75 కోట్లు దశల వారీగా ఆన్లైన్ లో పంపించింది. వాట్సాప్ గ్రూపులో ఫేక్ అక్కౌంట్లు చూసి వారిమెసేజ్లు చదివి ఆ ఫేక్ యాప్‌లో ఆమె పెట్టుబడులు పెట్టి కోట్లు వస్తాయని ఆశపడ్డారు. తాను కూడా కోటీశ్వరాలిగా మారానని ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.
మోసం బయటపడిన తీరు
డబ్బు విత్‌డ్రా చేయాలని ప్రయత్నించగానే మోసగాళ్లు అదనపు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆమె సందేహంతో నిరాకరించగానే ఒక్కసారిగా అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఫోన్ స్విచ్ ఆఫ్, వాట్సాప్ గ్రూప్ మూసివేత, వెబ్‌సైట్లు డౌన్… క్షణాల్లో కల కూలిపోయింది.
లబోదిబో మంటూ ఫిర్యాదు
“తమ జీవితకాలపు పొదుపు అంతా పోయింది. ఎలా మోసపోయానో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా” అని బాధతో చెప్పిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించారు. కానీ ఐదు నెలల గ్యాప్‌లో ఫిర్యాదు చేసినందున డబ్బు తిరిగి రావడం కష్టమని అధికారులు చెబుతున్నారు.
ఇదంతా డీప్‌ఫేక్ మాయ…
సద్గురు, రష్మిక మందన్న, సుధా మూర్తి, రాజ్‌దీప్ సర్దేశాయి వంటి పలువురు ప్రముఖుల పేరుతో ఇప్పటికే ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సాధారణ ప్రజలకు నిజం-అబద్ధం తేడా గుర్తించడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే అస్తమానూ చేతిలో సెల్ఫోన్ పట్టుకుని చూస్తూ డిజిటల్ మాయలో పడకండి.