Headlines

నూతన సీడీపీఓలకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క

త‌ల్లిదండ్రుల సమ‌క్షంలో సీత‌క్క చేతుల మీదుగా నియామ‌క ప‌త్రాలు అందుకున్న అభ్య‌ర్ధులు

నూత‌న సీడీపీఓల్లో ఉత్సాహం… తల్లిదండ్రుల్లో ఆనందం

నియామ‌క కార్య‌క్ర‌మంలో పండుగ వాతావ‌ర‌ణం

ఇందిరా గాంధీ జ‌యంతి రోజున వేయి నూత‌న అంగ‌న్వాడీ భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తాం

అప్ప‌టి లోపు వాటి నిర్మాణాలు పూర్తి చేయాల‌ని ఆదేశాలు

స‌మీక్ష స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్, జూలై 25:
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 23 మంది సీడీపీవోలకు (Child Development Project Officers) నియామక పత్రాలను మంత్రి సీతక్క అంద‌చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఎంపికైన సీడీపీవోలు స‌చివాల‌యంలో మంత్రి చేతుల మీదుగా శుక్ర‌వారం నాడు నియామ‌క ప‌త్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. నూతన సీడీపీఓలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టినందుకు మంత్రికి, ప్రభుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖకు సీడీపీఓలు వెన్నెముకలుగా పని చేస్తారని పేర్కొన్నారు.”మీరు పొందిన ఈ ఉద్యోగం ఒక సామాజిక బాధ్యత. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మద్దతుగా నిలిచే సేవా విభాగంలోకి అడుగుపెడుతున్నారన్న విష‌యాన్ని మీరెప్పటికీ మరిచిపోవద్దు” అని మంత్రి తెలిపారు. “వేల మంది పోటీ పడిన ఈ పరీక్షలో మీరు మాత్ర‌మే ఉద్యోగాలు పొంద‌రు. ఈ విజయానికి మీరు చూపిన అంకితభావం ప్రధాన కారణం. మీరు నిర్వ‌ర్తించే విధుల్లో ఇదే అంకిత భావాన్ని కొన‌సాగించాలి” అని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు సేవలందించే అదృష్టం మీకు దక్కిందన్నారు.

అంగన్వాడీల్లో పోషకాహార లోపం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ తో పాటు పాలు, గుడ్లను నిరంతరం సరఫరా చేస్తున్న‌ట్లు తెలిపారు. అంగ‌న్వాడీ కేంద్రాల‌ను ఆహ్లాద‌, ఆనంద కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్న‌ట్లు వెల్ల‌డించారు. చిన్నారుల కోసం యూనిఫామ్స్ ను ఇవ్వ‌డంతో పాటు 57 రకాల ఆటవస్తువులను అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేశామ‌న్నారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం, లబ్ధిదారులకు అన్ని హ‌క్కులు క‌ల్పించ‌డ‌మే ప్రధాన బాధ్యతగా సీడీపీఓలు ప‌నిచేయాల‌న్నారు.
కొత్తగా నియమితులైన అధికారులందరూ ఫీల్డ్ వర్క్‌ను ప్రాధాన్యంగా తీసుకుని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజల మధ్యకు వెళ్లాలని, ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు మంత్రి సీత‌క్క‌.

సీడీపీఓల్లో ఉత్సాహం… తల్లిదండ్రుల్లో ఆనందం

మంత్రి సీత‌క్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న సీడీపీఓలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“ప్రజా ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్యోగ నియామక చర్యల వల్లే ఈ అవకాశాన్ని పొందగలిగాం” అంటూ ప్రభుత్వానికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపడుతున్న దృష్ట్యా పలువురు తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. కూతుళ్ల‌ను ప్ర‌భుత్వ ఉన్న‌తోద్యుగులుగా చూడాల‌న్న త‌మ కల నెరవేరిందని, ఇటువంటి ప్రజా ప్ర‌భుత్వం పదికాలాల పాటు కొనసాగాలి అంటు ప్ర‌భుత్వాన్ని ఆశీర్వదించారు.

అంత‌కు ముందు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై మంత్రి సీత‌క్క సమీక్ష‌ నిర్వ‌హించారు. శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, డైరెక్ట‌ర్ జీ సృజ‌న తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గోన్న ఈ స‌మావేశంలో
అంగన్వాడీ సేవల పని తీరు మెరుగుదల, పోషకాహార లోప నివారణ కోసం వంద రోజుల‌ యాక్షన్ ప్లాన్ పై చ‌ర్చించారు. శిధిలావ‌స్థ‌లో ఉన్న అంగ‌న్వాడీ భ‌వ‌నాల స్థానంలో ఈ ఏడాది వేయి నూత‌న అంగ‌న్వాడీ భ‌వ‌నాలను నిర్మిస్తున్నామ‌న్నారు. దేశంలో అంగన్వాడి సేవలను ప్రవేశపెట్టిన ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న నూత‌న అంగన్వాడి భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తామన్నారు. అప్ప‌టి లోపు ఈ ఏడాది నిర్దేశించుకున్న వేయి అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణాల‌ను పూర్తి చేయాల‌న్నారు.

సీఎం ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడి కేంద్రాలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని సూచించారు. వర్షాకాలం తో వ‌చ్చే సీజనల్ సమస్యల ప‌ట్ల అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. వర్షంలో నానడం వల్ల అంగన్వాడి భవనాలలో పెచ్చులు ఊడే ప్రమాదం ఉందని, అటువంటి భవనాలను గుర్తించి తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌న్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేట్ భవనాల్లోకి అంగ‌న్వాడీ కేంద్రాల‌ను మార్చాల‌ని సూచించారు. రాత్రి వేళల్లో తేళ్ళు, జే ర్రీలు వంటి విష పురుగులు అంగన్వాడి కేంద్రాల్లోకి వచ్చే ప్రమాదముందని, ఉద‌యం సిబ్బంది రాగానే ప‌రిస‌రాల‌ను క్షుణ్ణంగా పరిశీలించాల‌ని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది సిబ్బంది నిర్ల‌క్షం వల్ల కొన్నిచోట్ల చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని…విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అంగన్వాడి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని పెంచే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అంగ‌న్వాడీ కేంద్రాల్లో ఫీడింగ్, టీచింగ్, అటెండెన్స్ మీద యంత్రాంగమంతా సృష్టి సారించాలని కోరుకున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE