ఉప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి Revanth Reddy కేంద్ర మంత్రి G. Kishan Reddyపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని సీఎం ప్రశ్నించారు. “హైదరాబాద్ ప్రజలు కిషన్ రెడ్డికి ఓట్లు వేయలేదా..? మెట్రోకు అనుమతులు, మూసీకి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఆయనదే” అని వ్యాఖ్యానించారు.
ఉప్పల్‌లో వేలాది మంది మహిళలు సభకు రావడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. మహిళల ఆశీస్సులతోనే జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు. కొడంగల్‌లో ఓటమి ఎదురైన సమయంలో మల్కాజిగిరి ప్రజలు తనను ఆదరించి ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని “మినీ భారత్”గా అభివర్ణించారు. ఎంపీగా గెలవడం వల్లే పార్టీ అధిష్టానం తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు.
గత ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మల్కాజిగిరి ప్రాంతంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. నగరంలో వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని “తెలంగాణ రైజింగ్ 2047” పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు.
అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో కోటి ముప్పై లక్షల మంది నివసిస్తున్నారని, మౌలిక సదుపాయాలు, పరిపాలన సమన్వయం, మూసీ ప్రక్షాళన కోసం పరిపాలనా వికేంద్రీకరణ అవసరమైందని తెలిపారు. అందుకే మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్న ఆరోపణలను ఖండిస్తూ, పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పోలీస్, మున్సిపల్ శాఖల పరిధిని ఒకే విధంగా మార్చామని తెలిపారు.
ఈ సందర్భంగా రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు సీఎం వెల్లడించారు. రోడ్లు, చెరువుల సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి పనులకు అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు బండారు రాజిరెడ్డి పేరు పెట్టడం రాజకీయాలకు అతీతంగా తీసుకున్న నిర్ణయమని సీఎం తెలిపారు. ఆయన 40 ఏళ్ల పాటు ఉప్పల్ ప్రాంతానికి సేవలు చేశారని గుర్తు చేశారు.
మూసీ ప్రక్షాళనపై కూడా సీఎం విస్తృతంగా మాట్లాడారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసినట్లే హైదరాబాద్‌లో మూసీ నదిని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక కేంద్రంగా మారుతుందని అన్నారు.
మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లాలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం నల్గొండ ప్రజల పిలుపుతో పాదయాత్ర కూడా చేశానని గుర్తు చేశారు. మూసీలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు, విద్య అందిస్తామని చెబుతున్నా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం దేశంలో తొమ్మిదో స్థానానికి పడిపోయిందని సీఎం వ్యాఖ్యానించారు. మెట్రో విస్తరణకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత కూడా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం రెండున్నరేళ్లలో యాభైసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని Narendra Modiని కలిశానని తెలిపారు. అయినా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని చెప్పారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్రంపై సీఎం విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, మిగిలిన 25 లక్షల టన్నులు కేంద్రం కొనాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ విషయంలో కూడా కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.
“తెలంగాణ ప్రజలతో గోకున్నోడు బాగుపడినట్లు లేదు” అంటూ కిషన్ రెడ్డిపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి సహకరిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతామని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకుందామని, ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధిపై అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశలో మూసీ ప్రక్షాళన చేపడతామని సీఎం వెల్లడించారు. వంద రోజుల్లో కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు.

