Headlines

నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు.. అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ

c

  • రూ.13 వేల కోట్లతో 6,300 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
  • ఎస్‌ఎల్‌బీసీ, మూసీ ప్రక్షాళన, రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వ కార్యాచరణను వివరించిన సీఎం.

నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. రూ.13 వేల కోట్ల వ్యయంతో 6,300 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేశారని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి అమరవీరుల త్యాగాలను మరవలేమని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు త్యాగాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన సీఎం, రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చుకోవడమే త్యాగం కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే కోమటిరెడ్డి మంత్రి పదవి చేపట్టారని గుర్తు చేశారు.

గత పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపించారు. కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్నారని, ప్రజలు బీఆర్ఎస్‌ను శాశ్వతంగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై ప్రత్యేక అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ప్రతిపక్షాలు లేఖ రాస్తే ఎవరు ఏం చేశారో సభలో చర్చిద్దామని సవాల్ విసిరారు.

మహిళలకు గత ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించిన సీఎం, తమ ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. రూ.16 వేల కోట్లతో 3.28 కోట్ల మందికి ప్రతి నెల ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు.

రైతుల కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్ తదితర పథకాలపై రూ.1.56 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని, కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు “కూలేశ్వరం”గా మారిందని వ్యాఖ్యానించారు.

విద్యా రంగంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, పేద విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించడమే లక్ష్యమన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, రెండున్నరేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని గత ప్రభుత్వంపై ఆరోపించిన సీఎం, మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం