ఖిలా వరంగల్ తహసీల్దార్‌పై అక్రమాస్తుల కేసు – ఏకకాలంలో అనిశా సోదాలు
కోట్లల్లో అక్రమాస్తులు
వరంగల్ జిల్లా వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. కోట్ల విలువ చేసే అక్రమాస్తులు వెలుగు చూడడంతో కేసు నమోదు చేశారు.

నాగేశ్వర్ రావు, అతని బంధువులకు చెందిన 7 ప్రదేశాలలో అనిశా అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో హన్మకొండ లో విలువైన భవనం (రూ.1.15 కోట్లు), 17.10 ఎకరాల వ్యవసాయ భూమి (రూ.1.43 కోట్లు), బంగారం (70 తులాలు), వెండి (1.791 కిలోలు), 23 ఖరీదైన చేతి గడియారాలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం, అలాగే గృహోపకరణాలు బయటపడ్డాయి.
పట్టుబడిన స్థిరాస్తులు, చరాస్తుల విలువ డాకుమెంట్స్ ప్రకారం దాదాపు రూ.5.02 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఓపెన్ మార్కెట్ లో అక్రమాస్తుల విలువ ఇంకా ఎక్కువే అని అంచనా వేస్తున్నారు. తహసీల్దార్ ను అరెస్ట్ చేసారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
నాగేశ్వర్ రావు హసన్ పర్తి, హన్మకొండ మండలాల తహసీల్దార్ గా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాలలలో జోక్యం చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
“ఎవ్వరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన పక్షంలో వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయ వచ్చని “ప్రజలకు అనిశా అధికారులు విజ్ఞప్తి చేశారు:
అధికారులు ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.