ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?

us president idiotic

H-1B వీసాలపై లక్షడాలర్ల రుసుము విధించడం ఎవరికి నష్టం

వృత్తి నిపుణులను ఆహ్వానిస్తూ మూడున్నర దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన హెచ్‌-1బీ వీసా విధానం అమెరికాకు సరి కొత్త ఆవిష్కరణలకు వేదికై, ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచింది.
అదే కారణంగా ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ ఈ వీసాలపై కఠిన వైఖరి తీసుకోలేదు. కానీ, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన తొలి హయాంలోనే కఠిన నిబంధనలు అమలు చేసి, వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచేశారు. ట్రంప్ అనాలోచితంగా భారత్ పైఅక్కసుతో తీసుకున్న ఈనిర్ణయం ఆయన కూర్చున్న కొమ్మను ఆయనే నరుక్కున్నట్లు ఉందని విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.
తాజాగా ఆయన చేసిన ప్రకటన మరోసారి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారతీయులలో ఆందోళన రేపుతోంది. ఎందుకంటే, హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో దాదాపు మూడో వంతు మంది భారతీయులే.

ఇండియాపై ఎందుకీ ధ్వేషం ?
పైకి మిత్రదేశం అంటూనే, లోలోపల ఇండియాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ట్రంప్‌ చర్యలు కనిపిస్తున్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనే తొందరలో ట్రంప్‌ ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇండియా ఆచితూచి వ్యవహరించడం ఆయనను అసహనానికి గురిచేస్తోందని అంటున్నారు. ఇదే అసహనంతో, రష్యా నుంచి చమురు దిగుమతుల పేరుతో భారత ఎగుమతులపై యాభై శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు హెచ్‌-1బీ వీసాలపై కఠిన నిర్ణయం కూడా అదే వ్యూహంలో భాగమని పరిశీలకుల అభిప్రాయం.

అమెరికాకు నష్టమే!

ప్రస్తుతం కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. అయితే, అమెరికాలో తగినంత నిపుణులు లేరని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో విదేశీ ప్రతిభావంతులను ఆపడం చివరికి అమెరికాకే చేటు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్‌లు, మధ్యతరహా కంపెనీలు ఈ నిర్ణయాల వలన తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది.

వలసదారులే ఆధారం

అమెరికాలోని 44 శాతం వైద్య శాస్త్రవేత్తలు, 42 శాతం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు వలసదారులే. అలాగే, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గణిత శాస్త్రజ్ఞులు, వైద్యులు, నర్సుల్లో అధిక శాతం విదేశీయులే. హెచ్‌-1బీ వీసాతో వెళ్లినవారిలో చాలామంది తరువాత అమెరికాలోనే స్థిర నివాసం పొంది, సొంతంగా కంపెనీలు స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు.

అయితే, ఇవన్నీ పక్కన పెట్టి వలసల కట్టడికి ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లోనే 181 కార్యనిర్వాహక చర్యలు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్‌ ఈ దృక్పథం చివరికి అమెరికా ప్రగతికే అడ్డంకిగా మారవచ్చు.

అమెరికాలో H-1B వీసాలపై లక్ష డాలర్ల భారీ రుసుము విధించాలన్న ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దాని ప్రభావం కేవలం విదేశీ ఉద్యోగార్థులపైనే కాకుండా, అమెరికాలోని కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపైనా తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్న కంపెనీలకు సవాలు: ఈ విధానం వల్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు, స్టార్టప్‌లు తీవ్రంగా నష్టపోతాయి. స్థానికంగా లభ్యం కాని నైపుణ్యం కోసం ఈ కంపెనీలు H-1B వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. లక్ష డాలర్ల ఫీజు భారం కారణంగా, ఈ కంపెనీలు నిపుణులను నియమించుకోవడానికి వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఇది వారి వ్యాపార విస్తరణను, ఆవిష్కరణలను అడ్డుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రతిభావంతుల వలస (Brain Drain): ఈ అధిక ఫీజు H-1B వీసా దరఖాస్తుదారులకు పెద్ద అడ్డంకిగా మారుతుంది. ఈ రుసుమును కంపెనీలు లేదా అభ్యర్థులు భరించాల్సి వచ్చినా, అది అమెరికాకు రావాలనుకునే అత్యంత ప్రతిభావంతులను నిరుత్సాహపరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయంగా ప్రతిభ ఉన్నవారు కెనడా, యూరప్ వంటి ఇతర దేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీనిని “బ్రెయిన్ డ్రెయిన్”గా అభివర్ణిస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: H-1B వీసాదారులు అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వీరు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారు, సాంకేతిక ఆవిష్కరణలకు తోడ్పడతారు. ఈ ఫీజు వల్ల వీసాదారుల సంఖ్య తగ్గితే, అది అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి, అంతర్జాతీయంగా దాని పోటీతత్వం తగ్గడానికి కారణమవుతుంది.

అంతర్జాతీయ విద్యార్థులకు నిరాశ: అమెరికాలో చదువుకుని, అక్కడే ఉద్యోగం చేయాలని ఆశించే అంతర్జాతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం తీవ్ర నిరాశను కలిగిస్తుంది. అధిక ఫీజు భారం కారణంగా, ఈ విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలన్న ఆలోచనను విరమించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ ప్రతిపాదన వల్ల అనేక వర్గాల వారు నష్టపోతారని నిపుణుల అంచనా.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో