వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు బెయిల్ కండిషన్లు ఉల్లంఘించిన సైబర్ నేరస్తుడిని మళ్లీ అరెస్ట్ చేశారు.
2025 మార్చిలో, తిరుమల హ్యాచరీస్‌లో పనిచేస్తున్న మేకల శ్రీనివాస్కు నకిలీ నెంబర్ నుండి మెసేజ్ వచ్చి, తన స్నేహితుడి పేరుతో నమ్మించి, “OM SAI TRADERS” అకౌంట్‌లో రూ.1.68 కోట్లు జమ చేయించారు. అనంతరం ఇది మోసమని గుర్తించిన శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు, వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నం. 21/2025 నమోదు చేశారు.
విచారణలో సంజీత్ కుమార్ సింగ్ @ పింటూ సింగ్ (ఉ.ప్ర.) ప్రధాన నిందితుడిగా బయటపడి, అతడిని అరెస్ట్ చేసి జైలు పంపించారు. తర్వాత కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ, ప్రతి ఆదివారం వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది.
అయితే నిందితుడు ఆగస్టు 3, 2025న హాజరు కాలేదు. దీనిపై ఏసీపీ సైబర్ క్రైమ్ గిరికుమార్ కల్కోట కోర్టుకు మెమో సమర్పించగా, కోర్టు ఆగస్టు 19న నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దాంతో పోలీసులు ఆగస్టు 24న అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, పరకాల సబ్ జైలుకు తరలించారు.
బెయిల్ షరతులను పాటించకపోతే, కోర్టు ద్వారా బెయిల్ రద్దు చేసి తిరిగి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా TGCSB డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, IPS గారు, నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేయడంలో చూపిన చొరవకు ఏసీపీ గిరికుమార్ కల్కోటను అభినందించారు. ✅
బెయిల్ షరతులు ఉల్లంఘించిన సైబర్ నేరస్తున్ని అరెస్ట్ చేసిన పోలీస్ లు
