హనుమకొండ జిల్లా కేంద్రం వడ్డేపల్లిలో ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ పటేల్ సుధాకర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పటేల్ సుధాకర్ రెడ్డి సహచరి పటేల్ వనజక్క పాల్గొని మాట్లాడారు.


పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమకారులు కోరుకున్న రాజ్యం నిర్మాణం కోసం అణగారిన వర్గాలు ఐక్యంగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారులను పాలకులు కాల్చిచంపారని, ఉన్నత విద్యావంతులు కూడా తమ జీవితాలను త్యాగం చేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని అన్నారు. అలాంటి త్యాగధనులు కలలుగన్న సమసమాజ నిర్మాణం ద్వారానే దేశంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పటేల్ సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచే తిరుగుబాటు ప్రారంభించి, రాడికల్ విద్యార్థి నాయకుడిగా, దళ కమాండర్‌గా, దండకారణ్యంలో పనిచేసి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారని తెలిపారు. 2009లో బూటకపు ఎన్కౌంటర్లో ఆయనను హత్య చేశారని ఆరోపించారు. ఆయన ఆశయాల సాధన కోసమే తాను టీఆర్పీలో చేరినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పాలనను ప్రశ్నించిన అనేక మంది పోరాట యోధులు అడవిబాట పట్టి ఉద్యమించారని అన్నారు. రెండు తరాల యువతను పాలకులు కాల్చిచంపారని ఆరోపిస్తూ, త్యాగధనుల లక్ష్యాల సాధన కోసం ఐక్య పోరాటాలు అవసరమని పేర్కొన్నారు. 80 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పార్టీలు ప్రజలను దోచుకున్నాయని విమర్శించారు. బహుజన వర్గాల రాజ్య నిర్మాణం కోసం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోని టీఆర్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ కామ్రేడ్ పటేల్ సుధాకర్ రెడ్డి జీవితాన్ని బహుజనుల విముక్తికి అంకితం చేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం పోరాడారని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రజల జీవితాల్లో అమలు చేయడం తమ బాధ్యత అని చెప్పారు.
తెలంగాణలో బహుజన సమాజానికి రాజకీయ అధికారం అందించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న నాయకత్వంలో టీఆర్పీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, ఉపాధి, గౌరవం అందే సమాజం కోసం పార్టీ పోరాడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు గిరగాని బిక్షపతి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు మల్లికార్జున శాస్త్రి, న్యాయవాదులు జన్ను పద్మ, కర్రు పావని, వివిధ సంఘాల నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి, మహిళా నాయకులు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

