హైదరాబాద్, సెప్టెంబర్ 16 :
పేదరికం, తక్కువ విద్య, బలమైన కుటుంబ సహకారం లేని దిగువ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ముఠాలు మానవ అక్రమ రవాణా చేసి, వారిని వెట్టి చాకిరీకి గురి చేస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో “హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్” అంశంపై మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా భారతదేశంలో అత్యంత దుర్బల వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.
బాధితుల్లో సగానికి పైగా బలవంతపు శ్రమలో చిక్కుకుని ఇటుక బట్టీలు, గృహ నిర్మాణం, ప్రాజెక్టు పనులు, వస్త్ర కర్మాగారాలు, వ్యవసాయం, రాతి గనుల్లో రోజుకు 12 గంటలకు పైగా పని చేస్తున్నారని చెప్పారు. వారికి కూలి కల్పిస్తామనే మాయలో దళారులు ముందుగానే అప్పులు పెట్టించి, వడ్డీ భారం మోపి కుటుంబాలతో సహా శాశ్వత బంధనంలోకి నెట్టేస్తున్నారని వివరించారు. యజమానులు వారిని మనుషులుగా కాక వస్తువులుగా చూస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని కుటుంబాలు తరతరాలుగా బంధిత శ్రమలో కూరుకుపోయి ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధితుల సమస్యలను వెలుగులోకి తెచ్చి, సమాజంలో అవగాహన పెంచే బాధ్యత మీడియాపైనే ఉందన్నారు. మరణించిన కార్మికుల అప్పులను వారి వారసులపై మోపి, వారిని కూడా బంధనంలో ఉంచుతున్న అనేక ఘటనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
గృహపని, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికులు కూడా అక్రమ రవాణా ఉచ్చులో చిక్కుకుంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఐజేఎం ప్రతినిధులు మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా కేసుల్లో దర్యాప్తు ఆధారాలు సేకరించడం, బాధితులను రక్షించడం, నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులకు సహకరించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, ఐజేఎం మీడియా కమ్యూనికేషన్స్ అధిపతి ప్రియా అబ్రహాం, ఐజేఎం ప్రతినిధులు పాల్గొన్నారు.