నిషేధిత సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మంద రూబెన్ @ కన్నన్న @ మంగన్న @ సురేష్ (67) మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోయారు.
వరంగల్ సీపీ వివరాల ప్రకారం, హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన రూబెన్, 1979లో కాజీపేట ఆర్.ఈ.సీలో హాస్టల్ మెస్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో రాడికల్ యూనియన్‌లు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రభావంతో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పిలుపుతో రూబెన్ ఉద్యమంలో చేరాడు.
1981 నుంచి 1986 వరకు లంక పాపిరెడ్డి నాయకత్వంలోని నేషనల్ పార్క్ దళంలో సభ్యుడిగా కుంట, బస్తర్ ప్రాంతాల్లో పనిచేశాడు. అనంతరం 1987లో పార్టీ నాయకత్వం రూబెన్‌ను ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించింది. 1991లో అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసి జగదల్పూర్ జైలుకు తరలించారు. ఏడాది తరువాత ముగ్గురు ఖైదీలతో కలిసి జైలు నుండి పారిపోయి తిరిగి మావోయిస్టు కార్యకలాపాల్లో చేరాడు.
1992 నుంచి 1999 వరకు కుంట, అబుజ్‌మడ్ ప్రాంతాల్లో చురుకుగా పనిచేసిన రూబెన్, 1999లో సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ @ రామన్న గోపన్న నేతృత్వంలో బీజాపూర్ జిల్లా గుండ్రాయి గ్రామానికి చెందిన పొడియం భీమేను వివాహం చేసుకున్నాడు.
2005లో డివిజన్ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో అనారోగ్యం కారణంగా పార్టీ ఆదేశాలతో గుండ్రాయిలోనే స్థిరపడ్డాడు. అక్కడ కోళ్లు, గొర్రెలు పెంచుతూ స్థానిక గ్రామ కమిటీలతో కలిసి పనిచేస్తూనే మావోయిస్టులకు సహకారం అందించాడు. మావోయిస్టు దళాలకు ఆశ్రయం, భోజన సౌకర్యం కల్పిస్తూ పోలీసుల కదలికలపై సమాచారం అందించేవాడు.
తాజాగా శారీరక అస్వస్థతతో పాటు మావోయిస్టు సిద్ధాంతాలపై విసుగొచ్చి, ప్రజల్లో మావోయిస్టులపై వ్యతిరేకత పెరుగుతుండటంతో, ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల సహాయంతో కుటుంబంతో ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించి రూబెన్ లొంగిపోయినట్లు సీపీ తెలిపారు.
రూబెన్ పాల్పడిన ప్రధాన నేరాలు:
- కుంట దళ సభ్యుడిగా ఉన్న సమయంలో పెద్దకెడు వాల్, పండోడు, పిడిమాల్, బండారిపాడు గ్రామాల ప్రజలపై దాడులు చేసి హత్యలకు పాల్పడ్డాడు.
- ఎలమకొందా గ్రామ సర్పంచ్ హత్యలో కూడా పాత్ర ఉంది.
- 1988లో గొల్లపల్లి–మారాయిగూడ మార్గంలో జరిగిన ఘటనలో 20 మంది సి.ఆర్.పీ.ఎఫ్. సిబ్బందిని మావోయిస్టులతో కలిసి హత్య చేసి వారి ఆయుధాలను దోచుకున్నాడు.
- 1990లో తుర్లపాడు పోలీస్ స్టేషన్‌పై దాడిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు గోపన్నతో కలిసి పాల్గొన్నాడు.
రూబెన్‌పై ₹8 లక్షల రివార్డు ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
చివరగా, సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ — “ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల ద్వారా ప్రధాన స్రవంతిలోకి చేరినవారికి భద్రతతో కూడిన జీవితం లభిస్తుంది. రూబెన్ లొంగిపోవడం ఇతర మావోయిస్టులకు కూడా స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.
tpefrx