పదవీ విరమణ సభలో జస్టిస్ రాధారాణి
మానవులు జన్మతః తర్క జీవులని తర్క జ్ఞానం నుండే హేతువాదం పుడుతుందని మానవులు మానవతవాదులుగా, ప్రగతిశీలవాదులుగా జీవించడం చాలా సాధారణ విషయంగా చూడాలని, ప్రగతిశీల భావాలతో మానవాతవాదులుగా జీవిస్తే ఇన్ని నేరాలు, ఘోరాలు, దోపిడీ జరగదని డాక్టర్ జస్టిస్ గురజాల రాధారాణి అన్నారు. తెలంగాణ హై కోర్టు జడ్జిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రాధారాణికి కులనిర్మూలన సంఘం, మానవ వికాస వేదిక, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, విజ్ఞాన దర్శిని, జన విజ్ఞాన వేదిక నాయకులు సంయుక్తంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో కుల నిర్మూలన సంఘం నాయకులు వహీద్ అధ్యక్షతన జరిగిన జస్టిస్ రాధారాణి పదవీ విరమణ అభినందన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. కులాంతర వివాహాలు గొప్పవని అనుకోవడం సరికాదని, జీవితంలో అది సాధారణ విషయంగా సభ్య సమాజం చూసినప్పుడే కుల రహిత సమాజం నిర్మితమై అసమానతలు లేని సమాజం నిర్మితమవుతుందని అన్నారు. మగాధిపత్య సమాజం తన భావాలు, నిర్ణయాలు చెప్పకనే మహిళల మీద రుద్ధ పడుతుంటాయని, న్యాయ వ్యవస్థ కూడా మగాధిపత్య సమాజానికి అతీతం కాదని అన్నారు. బంధువులు, స్నేహితులు లేకుండా మగాధిపత్య న్యాయ వ్యవస్థలో నిర్ణయాలలో మహిళలు రాణించడం చాలా కష్టమని అలాంటి వ్యవస్థలో కృత నిచ్చయంతో నా వంతు నిర్ణయాలను, అభిప్రాయాలను నిక్కచ్చిగా వెలుబుచ్చి న్యాయ వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకొని నిజాయితీగా పదవీ విరమణ చేశానని అన్నారు.
పెళ్ళికి అక్కరకు రాని సాంప్రదాయాలు అవసరం లేదని, ఎలాంటి ఆర్భాటాలు, అక్కరకు రాని సాంప్రదాయాలు లేకుండా నిడారంబరంగా మా పెళ్ళి చేసుకొని అంతే సామాన్యంగా జీవించామని, మా పూర్వీకుల నుండి అలవర్చుకున్న హేతుబద్ధత, ప్రగతిశీలత మేము పాటించామని, మా పిల్లలు కూడా అంతే హేతుబద్ధతతో, కులనిర్మూలన కోసం తమవంతు ఆచరణాత్మక జీవితాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. జీవితంలో దేవుడి అవసరం లేదనీ, కుటుంబంలో అన్యోన్యంగా, సమాజం పట్ల బాధ్యతగా బతకడం, ఉద్యోగ నిబద్ధత అవసరమని అన్నారు. జడ్జిలు వారిచ్చే తీర్పుల ద్వారా మాత్రమే మాట్లాడాలని, మన ఆలోచన, సామాజిక చైతన్యం, ఆచరణను బట్టే జడ్జిమెట్లు వస్తాయని అన్నారు. ఆలోచన ఆచరణ ఒకటిగా ఉండాలని, ఎన్నో అసమానతలు, వివక్ష కొనసాగుతున్న సమాజంలో సాధారణ జీవితం గొప్పదని, తనకు అభినందన సభ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ టి రజనీ మాట్లాడుతూ మహిళ గర్భానికి బానిసని, ప్రతి మనిషిలో ఒక భిన్నమైన ఆలోచన విధానం, సిద్ధాంతం నిగూఢంగా ఉంటుందని, మహిళలను భర్త కొడితే అది హింస కాదనే భావంతో 80 శాతం న్యాయమూర్తులు ఉంటారని అన్నారు. అది వారి జీవితం, అనుభవం, ఆలోచన నుండి వస్తుందని అన్నారు. తరాలు మారిన మహిళల పట్ల హింస తగ్గడం లేదని, సమసమాజ స్థాపనకు మహిళా అభివృధి, మహిళా సాధికారిత, మహిళను గౌరవంగా చూసే సమాజం అవసరమని అన్నారు. హేతువాదం, ప్రగతిశీల భావాలు సమాజంలో పెరిగినప్పుడే కులనిర్మూలన సాధ్యమవుతుందని అలాంటి సమసమాజం కోసం, మహిళా సమానత్వం కోసం కృషి చేస్తున్న సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ అభినందన సభ నిర్వహణ నాయకులు వహీద్, తుమ్మ భాస్కర్, మాధవ కృష్ణారెడ్డి, ఆదాం రాజు, గుత్తా జ్యోత్స్న, భరత్ భూషణ్, రమేష్, బైరి నరేష్ లు మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి ఇదు అంచెలుగా తన జీవితంలో రాణించారని గృహిణిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, సెషన్స్ జడ్జిగా, హై కోర్టు జడ్జిగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారని రానున్న రోజుల్లో సామాజిక చైతన్యం కోసం తన వంతు కృషికి సిద్దంగా ఉండడం గొప్ప విషయమని అన్నారు. భారత రాజ్యాంగం దేశంలో ఉనికిలోకి వచ్చినా నాటి నుండి నేటి వరకు అది ఇంటలెక్చువల్ సమాజంలోకి మాత్రమే వెళ్ళిందని, రాజ్యాంగం జన బాహుళ్యం లోకి వెళ్ళనంత కాలం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమసమాజం ఏర్పడదని అన్నారు. మెజార్టీ న్యాయవాదులకు కూడా రాజ్యాంగం గురించిన ప్రాధాన్యత, అవగాహన లేదని, భారత రాజ్యాంగ పీఠికను ప్రతి గ్రామానికి, భారత రాజ్యాంగ విశిష్టతను ప్రతి ఇంటికి తీసుకెళ్ళే బాధ్యతను ఐ ఎల్ పి ఎ తీసుకుందని అన్నారు. నల్ల కోటు ద్వారా నీలి విప్లవం కోసం న్యాయవాదులతో ఐ ఎల్ పి ఎ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుందని అన్నారు.
ఏ సమాజ ప్రగతినైన ఆ సమాజములో మహిళల ప్రగతిని బట్టి కొలవాలని అంబేద్కర్ ఆనాడే అన్నారని, ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో అడ్డంకులను, ఎన్నో అవరోధాలలను ఎదురించి అభివృద్ధి కావడం గొప్ప విషయమని, మగాధిపత్య మనువాద రాజ్యంలో ఎన్నో సవాళ్లను ఎదురించి జస్టిస్ ధారాణి నిలబడడం చాలా గొప్ప విషయమని అన్నారు. జీవితం మొత్తంలో వెంట్రుక వాసి మందం కూడా తొనకకుండ సమయం దొరికినప్పుడల్లా సమాజ చైతన్యం కోసం తన వంతు కృషి చేసిన జస్టిస్ రాధారాణి భవిషత్ తరాలకు స్పూర్తిగా నిలవాలని అన్నారు. జస్టిస్ రాధారాణి, గాంధీల జీవితం జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే జీవితానికి అద్దం పడుతుందని, సావిత్రిబాయి పూలే కు పూలే విద్య నేర్పించినట్లు గాంధీ రాధారాణిని జడ్జిని చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్న గాంధీ – రాధారాణి లకు అభినందనలు తెలిపారు. వీరి జంట సమాజానికి మరింత సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు.
జస్టిస్ రాధారాణి ఎదిగిన తీరు సమాజానికి స్పూర్తిగా నిలవాలనీ, భవిషత్ సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని, మరో మార్గ నిర్దేశనంగా నిలవాలని అన్నారు. కత్తితో సాధ్యం కానీ దాన్ని కలంతో సాధ్యం అవుతుందని నిరూపించిన జస్టిస్ రాధారాణి జీవితం ప్రత్యేక కొవ్వొత్తులు, కాగడాలు గుర్తు చేస్తుందని అన్నారు. ఎన్నో గుణ పాఠాలుగా నడిచిన తన జీవితం భవిషత్ సమాజాన్నీ తీర్చి తిద్దుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శాంత స్వభావి, నిగర్వి, హేతువాది, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రాధారాణి కుటుంబం, వృతి, ప్రవృత్తి లను సమతూకంగా చేసుకొని ఎదిగినారని అన్నారు. పెళ్ళి అయిన తర్వాత విద్యాభ్యాసాన్ని కొనసాగించి హై కోర్టు జడ్జి వరకు వెళ్లడం గొప్ప విషయమని, తండ్రి ఆశయాలను కొనసాగించడంలో బాగంగా కులనిర్మూలన కోసం, సామాజిక రుగ్మతలను రూపుమాపే ప్రయాణంలో నిక్కర్షగా ముందుకు సాగారని అన్నారు. తన వృత్తిలో ఎన్నో కుటుంబాలను, బార్య భర్తలను కలిపిన చరిత్ర ఉందని, భర్తకు కాన్సర్ ను కూడా ధైర్యంతో ఎదుర్కొని నయం చేసుకున్న ధీశాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శాంసన్, సాయిని నరేందర్, లక్ష్మీదేవి, పూస మల్లేష్, వెన్నపూజ పరుషరాజు, సురేష్, పొడిచేటి శ్రీనివాస్, హస్న ఖాన్, బి బి షా, కేరీత్, ప్రవళిక, ఎస్తేర్, గంగాధర్, చంద్ర శేఖర్, గాంగేయుడు, గణేష్, జూకూరి మహేష్, వెంకటేష్ ప్రసాద్, వెంకటస్వామి, సైఫ్ఉల్లా, నవ్య, వివిధ సంఘాల నమ్మి స్వరాజ్య లక్ష్మీ, నాయకులు డాక్టర్ బాబు, నాస్తిక్ రాకేష్, అచ్యుత్, స్నేహ, ఏటిగడ్డ అరుణ, హనుమంతరావు, జ్యోతి, పద్మ, మహ్మద్అలీ తదితరులు పాల్గొనగా కృష్ణ చంద్ వందన సమర్పణ చేసారు.