Headlines

అచ్చంపేట లో ఇందిరమ్మ చీరలు చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభించిన : సీఎం రేవంత్ రెడ్డి

అచ్చంపేట అభివృద్ధికి కృషి చేస్తా.. నా రక్తాన్ని చెమటగా మార్చుతా: సీఎం రేవంత్ రెడ్డి
అచ్చంపేట సభలో ఇందిరమ్మ చీరలు, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం
అచ్చంపేట: అచ్చంపేట ప్రాంతాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తన రక్తాన్ని చెమటగా మార్చి కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నారని, అయితే తాను ఈ గడ్డపై పుట్టిన బిడ్డనని, అచ్చంపేట తన పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అచ్చంపేట ప్రాంతానికి గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నేపథ్యం ఉందన్నారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయ స్వామి క్షేత్రం, తెలంగాణ అమర్‌నాథ్‌గా పేరొందిన సలేశ్వరం ఈ ప్రాంత ప్రత్యేకతలని పేర్కొన్నారు. శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల నాయకులు, బహమనీ పాలకులు, కుతుబ్‌షాహీ సుల్తానులు, నిజాంల పాలనతో ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. చెంచు గిరిజనుల జీవనానికి నల్లమల అడవులు ఆలవాలంగా ఉన్నాయని తెలిపారు.
14వ శతాబ్దంలో మాలిక్ కాఫర్ సేనలను ఎదురించి నిలిచిన వీరవనిత అచ్చమాంబ చరిత్రను సీఎం ప్రస్తావించారు. అచ్చమాంబ పేరుతో ఏర్పడిన ఈ ప్రాంతం ఆమె వీరత్వానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం విమర్శలు గుప్పించారు. అధికారం ఉన్నప్పుడే బీజేపీ రాజకీయంగా నిలబడగలదని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజల నుంచి జీతం తీసుకుంటున్న నాయకుడు ప్రజల్లోకి రావాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
తెలంగాణను ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే గత పాలకులు అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని విమర్శించారు. తమ ప్రభుత్వం గత మూడేళ్లలో రైతుల కోసం రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు నీరు అందేదని అన్నారు. పాలమూరు, అచ్చంపేట, డిండి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఈ ప్రాంత సాగునీటి అవసరాలు తీరేవని పేర్కొన్నారు.
కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేకపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించే ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. పాలమూరు ప్రాంత ప్రజలకు కృష్ణా జలాలను అందించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. గత ఏడాది పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేయగా, ఈ ఏడాది అచ్చంపేట సభ వేదికగా చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
త్వరలో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసురుతూ, విడివిడిగా కాకుండా కలిసి కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలని అన్నారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అచ్చంపేట బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం