బీఆర్ఎస్‌లో నాకు సరైన న్యాయం జరగలేదు – అవమానకరంగా బయటకు పంపించారు -కల్వకుంట్ల కవిత ఆవేదన

kavitha kalvakunla


వరంగల్‌: జాగృతి జనంబాట పర్యటనలో భాగంగా వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌పై మరోసారి ఘాటుగా విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఒక ఖైదీకి ఉరి వేసే ముందు చివరి కోరిక అడుగుతారు. కానీ నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు” అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్, కేసీఆర్‌లతో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ తండ్రిగా పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తా” అని స్పష్టంచేశారు.

తనకు బీఆర్ఎస్‌లో ఎవరికీ పంచాయితీ లేదని, తనను కుటుంబం నుంచి బయటకు నెట్టేశారని వ్యాఖ్యానించారు. “నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.

కవిత తెలిపారు — “బీఆర్ఎస్‌లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే పరిమితం చేశారు. మహిళలు కూడా రాజకీయాల్లో బలంగా నిలవగలరని నేను చూపిస్తా. కానీ దానికి సమయం ఉంది. ప్రస్తుతం నా దృష్టి ప్రజల సమస్యలపైనే ఉంటుంది” అన్నారు.

హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ ఖర్చు రూ.11 వందల కోట్ల నుంచి రూ.17 వందల కోట్లకు పెంచారని, ఆ పనులు హరీశ్ రావు బినామీ కంపెనీకి ఇచ్చారని కవిత ఆరోపించారు.

“దీనిపై విజిలెన్స్ విచారణ వేసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు. “మేము కోరుకునేది కొందరి తెలంగాణ కాదు — అందరి తెలంగాణ కావాలి. విద్య, వైద్యం అందరికీ అందే సమాన అవకాశాలు ఉండాలి” అని చెప్పారు.

కవిత స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను పునరుద్ధరించాలన్నారు. “అప్పుడు మాత్రమే కొత్త నాయకత్వం వస్తుంది. లేకపోతే రాజకీయాలు పొలిటిషియన్ల పిల్లల చేతుల్లోనే ఉంటాయి” అని విమర్శించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలు – మాకు ఎటువంటి స్టాండ్ లేదు

రాష్ట్ర పాలకపక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజీగా ఉన్నా, ప్రజల తరఫున మాట్లాడేవారు ఎవరూ లేరని కవిత అన్నారు. “మేమే ఆ పని చేస్తున్నాం. జూబ్లీహిల్స్ చిన్న ఎన్నిక. మాకు ఆ ఎన్నికపై ఎటువంటి స్టాండ్ లేదు” అని తెలిపారు.

బీసీలకు తమ కమిట్‌మెంట్ కొనసాగుతుందని చెప్పారు. కేంద్రంలో మూడు సార్లు గెలిచిన బీజేపీ తెలంగాణ కోసం ఏ పనీ చేయలేదని విమర్శించారు.


“ఉద్యమం నుంచి పరిమితికి” — కవిత మనసులోని మాట

“ఉద్యమం సమయంలో తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగాను. బతుకమ్మ సంబరాలను రాష్ట్రవ్యాప్తంగా జరిపాను. కానీ ఉద్యమం తర్వాత నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేశారు,” అని కవిత చెప్పారు.

“నేను మంత్రి కాదు, సంతకంతో పనులు చేసే స్థితి లేదు. అయినా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శక్తిమేరకు ప్రయత్నించాను. సీఎం కూతురినైనా నాకు పని చేయించుకోవడానికి ఏడాది పట్టింది” అని తెలిపారు.

“తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాం కానీ ప్రజలందరికీ డబ్బు లేదు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్ర్యం రావాలి — అదే నా లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు.

రిపోర్ట్: మన తెలంగాణ న్యూస్ బ్యూరో

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు