తుది దశకు పీవీ విజ్ఞాన కేంద్రం పనులు -జూన్ 28 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం

తుది దశకు పీవీ విజ్ఞాన కేంద్రం పనులు

జూన్ 28 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరం తదితర విభాగాలను సందర్శించిన కలెక్టర్, ఇంకా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ మరియు కుడా అధికారులకు సూచించారు. తాగునీటి పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 28 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలిపారు.

అనంతరం పీవీ నరసింహారావు స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న ఫోటో మ్యూజియాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో దిగిన అరుదైన ఫోటోలను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.

వివిధ సందర్భాల్లో తీసిన ఫోటోల ప్రాముఖ్యతను పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి,జర్నలిస్ట్ పి. వి. మదన్ మోహన్ కలెక్టర్‌కు వివరించారు. అలాగే పీవీకి వివిధ దేశాల నుంచి లభించిన పురస్కారాలు, ఆయన రచించిన పుస్తకాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, తహసీల్దార్ రాజేష్, పర్యాటక శాఖ డీఈ ధనరాజ్, ఏఈ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

పీవీ విజ్ఞాన కేంద్రం ప్రత్యేకతలు

పీవీ నరసింహారావు స్మారకార్థంగా 2021లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రకటింంచారు. ప్రారంభంలో పీవీ విజ్ఞాన కేంద్రం మ్యూజియం కోసం రూ.7 కోట్లు కేటాయించగా, అనంతరం పీవీ స్మృతి వనం, విజ్ఞాన వేదిక కలిపి సుమారు రూ.11 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును విస్తరించారు.

ఈ కేంద్రంలో పీవీ జీవితం, రాజకీయ ప్రస్థానం, ఆర్థిక సంస్కరణలు, జాతీయ సేవలను ప్రతిబింబించే మ్యూజియంతో పాటు విజ్ఞాన వ్యాప్తికి సైన్స్ మ్యూజియం, థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు.

ప్రాజెక్టులో ఎంట్రీ ప్లాజా, ఫుడ్ కోర్ట్, ఫోటో గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, అంఫిథియేటర్, వాటర్ ఫౌంటైన్, సోలార్ పవర్ ప్లాంట్ వంటి విభాగాలు ఉన్నాయి.

ఇప్పటికే మెడిటేషన్ సెంటర్, సోలార్ ప్లాంట్, ఫుడ్ పార్క్ వంటి కొన్ని భాగాలు పూర్తికాగా, మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, యువతకు విజ్ఞానం, సైన్స్, చరిత్రపై అవగాహన కల్పించడం లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం