నిర్భయ నాస్తికవాది డాక్టర్ జయగోపాల్

   ఆంధ్ర పెరియార్ గా ప్రసిద్ధి పొందిన డాక్టర్ జయగోపాల్ ఒక ప్రసిద్ధ హేతువాది, సామాజిక ఉద్యమ కారుడు, రచయిత. భారతదేశంలో మతపరమైన అంధ విశ్వాసాలను సవాలు చేసి అంధ విశ్వాసాలు, మూడాచారాలకు  వ్యతిరేకంగా పోరాడటం, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. స్వేచ్ఛాలోచన, తార్కిక విశ్లేషణ, మానవత్వం పట్ల అతని అచంచల నిబద్ధతయే అయన్ను హేతువాద ఉద్యమంలో అత్యంత ప్రభావశాలిగా మార్చింది. నిర్లక్ష్యం మరియు సామాజిక తిరస్కారంతో కూడిన బాల్యం ఉన్నప్పటికీ, డా. జయగోపాల్ జ్ఞానాన్ని, చరిత్రను అధ్యయనంలో తన ప్రయాణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బాల్య దశలోనే స్నానపు గదిలో రహస్యంగా పుస్తకాలు చదవడం నుండి మొదలైన తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాస్తిక నాయకుడిగా మారిన తీరు వెనుక ఆయనతో పాటు ఆయన సహచరి శారదమ్మ కృషి ఎంతో ఉంది. తన స్థైర్యం, మేధో మథనం, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తీరు సమాజానికి ఆదర్శం. 

    సంపన్న కుటుంబంలో వీరరాజు మహాలక్ష్మి లకు 1945 లో జన్మించారు. తండ్రి కఠినమైన, సంప్రదాయవాద వ్యాపారవేత్త, తల సాంప్రదాయ, మత విశ్వాసాలను పాటించేవారు. జయగోపాల్ ఐదుగురు సోదర సోదరీమణుల్లో రెండవవాడు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, అతని మేధో కుతూహలం, మూడ ఆచారాలను ప్రశ్నించడం వల్ల ఇంట్లోనే తీవ్ర వివక్షతతో శిక్షలు వేసి తీరని అన్యాయం చేశారు. చిన్నతనంలో స్మాల్ పాక్స్ (మీజిల్స్) బారిన పడిన జయగోపాల్ గురుంచి వైద్య సలహా తీసుకోకుండా ఆయన చదువు అతని అనారోగ్యానికి కారణమని నమ్మి విద్యకు దూరం చేసారు. అజ్ఞానానికి లొంగిపోకుండా జయగోపాల్ స్నానపు గదిలో రహస్యంగా పుస్తకాలు, వ్యాసాలను చదివే వారు. తనకున్న  ప్రతి అవకాశాన్ని తన జ్ఞానాన్ని విస్తరించడానికి ఉపయోగించాడు. ఈ జ్ఞాన దాహం ఆయన భవిష్యత్తును హేతువాదం వైపు నడిపింది. జయాగోపాల్ జీవితంలో అత్యంత దుర్మార్గమైన సంఘటన తన ఇంట్లోనే జరిగింది. మతపరమైన ఆచారాన్ని ప్రశ్నించినందుకు తండ్రి కోపంతో తలక్రిందులుగా వేలాడదీసి క్రూరంగా కొట్టాడు. జయగోపాల్ అరుపులు విన్న పొరుగువారు జోక్యం చేసుకున్నా తండ్రి మొండిగా ప్రవర్తించాడు. పిల్లవాడి ప్రాణాలకు భయపడిన పొరుగువారు తలుపు విరగగొట్టి జయగోపాల్ ను రక్షించారు. అప్పటికే క్రూరమైన దాడి వలన ఆయన శ్రవణ సామర్థ్యానికి శాశ్వత నష్టం కలిగించింది. పూర్తిగా చెవిటి వానిగా మార్చింది. చాలా సందర్భాల్లో రెండు రోజుల పాటు ఆహారం కల్పించలేదు. ఆకలితో బలహీనపడి రోడ్డుపై కుప్పకూలిపోయిన సంఘటనలు ఉన్నాయి.

   చిన్న వయస్సు నుండే జయగోపాల్ తన వయస్సుకు మించిన బాధ్యతలను చేపట్టవలసి వచ్చింది. ఇంటి పనులు చేయడంతో పాటు తన చెల్లెల్ల బాధ్యతలను చూడటం, తన తండ్రి అద్దాల దుకాణంలో పని చేసేవారు. అయినా ఆయనపై క్రూరత్వం ఆపలేదు. ఇంత కష్టాల్లో ఆయనకి దొరికిన ఏకైక స్వావలంబన గౌరి పిన్ని. ఆమెకు పిల్లలు లేనందున తన స్వంత కుమారుడిలా చూసుకునేది. జయగోపాల్ ఆమెను ‘అమ్మ’ అని పిలవడం ప్రారంభించాడు. ఇది ఆయన తల్లికి అసూయను  కలిగించింది. జయగోపాల్ గారిని కొట్టి, ఆమెను ఇంటికి రావడం మానిపించేసింది. ఆయనను నిజంగా ప్రేమించే ఏకైక వ్యక్తి నుండి వేరుపడటం తన చిన్న మనస్సుపై గాఢ ప్రభావాన్ని చూపింది. ఏడు సంవత్సరాల వయస్సులో దుకాణంలో పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అద్దం ముక్కతో చేతిని కోసుకున్నాడు. వైద్య సంరక్షణ అందించకపోగా తిరిగి అద్దం విరగగొట్టినందుకు ఆయనను తీవ్రంగా కొట్టారు. వినికిడి లోపం కారణంగా పాఠశాలలో పాఠాలను అనుసరించడంలో జయగోపాల్ తరచుగా కష్టపడేవారు.  తరగతిలో పాఠం చెప్తున్నప్పుడు వినలేకపోవడం వల్ల ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురై శిక్షలు గురై తోటి విద్యార్థులు ఎదుట అవమానాల పాలయ్యాడు. మూడనమ్మకాలను ప్రశ్నించడం వల్ల తండ్రి సంపన్నుడైనప్పిటికి జయగోపాల్ కు సరైన బట్టలు కొనివ్వకపోవడం వల్ల ఆయన తోటి విద్యార్థుల ఎదుట తీవ్ర మనస్తాపం చెందారు.

    ఒకరోజు రోడ్డుపై నడుస్తున్నప్పుడు చెత్త కుండీ దగ్గర ఎగురుతున్న కాగితాన్ని చూసిన జయగోపాల్ తనకున్న అలవాటు ప్రకారం దాన్ని తీసుకుని చదివాడు. ఆ వ్యాసం పెరియార్ ఇ.వి. రామసామి వ్రాసింది. ఆ వ్యాసమే జయగోపాల్ లో లోతుగా ప్రతిధ్వనించింది. ఆయనా ఆలోచనా విధానాన్ని మార్చింది.  సామాజిక నియమాలను సవాలు చేయడానికి, అంధ విశ్వాసాలను రూపుమాపడానికి, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం పని చేయడానికి ప్రేరేపించింది.

 తొలి ప్రేమ-కడ దాకా నిలిచిన ప్రేమ 

   16 ఏళ్ల వయస్సు నుండి జయగోపాల్ ఒక అద్భుతమైన ప్రేమను అనుభవించారు. జయగోపాల్ జీవన సహచరి శారద కూడా జయగోపాల్‌ కుటుంబం లాగే సాంప్రదాయాలు, మతపరమైన నియమాలను తిరస్కరించిన మహిళ. ప్రగతిశీల దృష్టికోణాన్ని కలిగి ఉండేది. వారి ప్రేమ వ్యక్తిగత స్వేచ్ఛ, ఆలోచనలను గౌరవించే ఒక భాగస్వామ్య ఆలోచనపై ఆధారపడి ఉండేది. సాంప్రదాయాల కట్టడి ఉన్న సమాజంలో జయ గోపాల్ శారద లు పెళ్లి చేసుకొందామని  నిర్ణయించుకున్నారు.పూజారి, తాళి లేకుండా కేవలం దండలు మార్చుకుని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ పని జయగోపాల్ తండ్రికి దారుణమైన అవమానంగా అనిపించింది. ఈ నిరసనాత్మక చర్య జయగోపాల్ వారి కుటుంబం మధ్య అంతరాయాన్ని కలిగించింది. తన తండ్రి ఈ పెళ్లిని అవమానంగా భావించి కొడుకుతో సంబంధాన్ని తెంచేశారు. అయినప్పటికీ శారద జయగోపాల్ అచంచలంగా అండగా నిలిచింది. జయగోపాల్ తో జీవితమంటే కష్టాలు, సంఘర్షణలు, అవమానాలు తోడుగా వస్తాయనే అవగాహ్నతోనే శారద ఈ మార్గాన్న ఎంచుకుంది. వారి సంబంధం పరస్పర గౌరవం, సామాన్య ఆలోచనలతో కొనసాగింది. ఈ కష్టాల మధ్య కూడా శారద జయగోపాల్ పక్కన నిలబడి అతనికి ఎనలేని మద్దతునిచ్చింది. 2021 లో శారద కోవిడ్ తో  మరణించారు. ఆమెను  కోల్పోవడం జయగోపాల్‌ కు గాఢమైన దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఆమెతో కొనసాగించిన దృఢమైన లక్ష్యంతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. శారదతో కలిసి పంచుకున్న ఆకాంక్షలను, కృషిని గుర్తు చేస్తూ జయగోపాల్ తన లక్ష్య సాధన పట్ల నిబద్ధత చూపారు. 

     డా. జయ గోపాల్ త్యాగానికి, నిబద్ధతకు, సమాజ సేవకు మిశ్రితమైన జీవితం గడిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీలో కార్యాలయ సహాయకుడిగా పనిచేస్తూ తక్కువ జీతంతో జీవనం సాగించినప్పటికీ, ఆయన ఆర్థిక భద్రత కంటే సామాజిక, మేధో ఉద్యమాలకు ప్రాధాన్యతనిచ్చారు. జయగోపాల్ ధన సంపాదనకంటే నైతికతకు ఎక్కువ విలువ ఇచ్చిన వ్యక్తి. ఆయనకు నౌకాదళ అధికారి వంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ తిరస్కరించారు. ప్రభుత్వ విధానాలు మతపరమైన నమ్మకాలను ప్రోత్సహిస్తాయని, తాను ప్రభుత్వ వ్యవస్థలో ఉంటే సత్య నిష్ఠను పాటించలేనని అర్థం చేసుకుని ఉద్యోగ అవకాశాలే కాకుండా, భూములు, భవనాలు, ఆస్తుల రూపంలో దాతల నుంచి వచ్చిన భారీ విరాళాలను కూడా ఆయన తిరస్కరించారు. పలువురు అభిమానులు, ఆయన నాస్తికత ప్రచారాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రయత్నించినప్పటికీ, ఆయన వాటిని స్వీకరించలేదు. ఆయన దృష్టిలో ధనం స్వీకరించడమంటే స్వీయ ప్రయోజనాల కోసం జీవించడమే అవుతుంది. ఆస్తిని, డబ్బును నిరాకరించినప్పటికీ, ఆయన అంతర్జ్ఞానం, విజ్ఞానం, నైతిక విలువలతో సంపన్నుడయ్యారు. తన చివరి రోజువరకు ఒక చిన్న అద్దె ఇంట్లో జీవించారు, కొన్ని జతల బట్టలు మాత్రమే కలిగి ఉండే ఆయన వద్ద అపారమైన పుస్తక సంపద ఉండేది. భౌతిక ఆస్తిని వెనుక వేసుకోవడం కంటే, సత్యాన్ని నమ్ముకుని నిజాయితీగా బతకడం ఆయన జీవిత సిద్ధాంతంగా మార్చుకున్నారు. తన చివరి శ్వాస వరకు ఆర్థిక లాభాలకు దూరంగా, సామాజిక మార్పు కోసం పాటుపడిన సంఘ సంస్కర్తగా నిలిచారు.

     డా. జయగోపాల్  చిన్నతనంలోనే అనేక మత గ్రంథాలను విశ్లేషించారు. పెరియార్, అంబేద్కర్, రాబర్టు గ్రీన్, ఇంగర్సాల్, బెట్రాండ్ రస్సెల్ వంటి ప్రముఖులు ఆయనకు ఆదర్శం. వారి రచనలను అధ్యయనం చేయడం ద్వారా ఆయనలో తీవ్ర ఆలోచనాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగర్సాల్ రచనల ద్వారా అతనికి నాస్తిక భావనలో ఒక దృఢమైన అవగాహన, ఆలోచనా స్వాతంత్ర్యం అభివృద్ధి చెందింది. ఇదే సమయంలో, పెరియార్ రామసామి యొక్క సామాజిక పోరాటం, మరియు అతను  ప్రతిపాదించిన సామాజిక న్యాయ సిద్ధాంతాలు, సమాజంలో వున్న అన్యాయాలకు, కులం, వర్గం, మతం, అంటరానితనాలకు వ్యతిరేకంగా నిలబడే మార్గదర్శకత్వాన్ని జయగోపాల్‌కు అందించాయి. ఈ ప్రభావాల ఆధారంగా, అతను తన యువ వయసులోనే సమాజంలో ఉన్న వివిధ రుగ్మతలను, అసమానతలను సవాలు చేయాలని, నిరసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం ఆయన్ను కుటుంబం నుండి దూరం చేసింది. కుటుంబంతో గడిపే సమయాన్ని లేకుండా చేసింది. సమాజంలో కొత్త ఆలోచనలు, విప్లవాత్మక దృక్కోణాలను స్వీకరించడంలో మరింత బలాన్ని అందించింది. విప్లవ భావాలు, పోరాట ప్రేరణ కారణంగా అతని తండ్రి డా. జయగోపాల్ పై హత్యా ప్ర‌యత్నాలు చేశారు. దొంగతనం వంటి నిందలు కూడా వేశారు. అయినప్పటికీ, ఈ ప్రతికూలతలు అతని ఆలోచనా స్వేచ్ఛ, విప్లవాత్మక దృఢ సంకల్పాన్ని బంధించడంలో అసమర్థమయ్యాయి. 

     జయగోపాల్ చిన్నతనం నుండి మొదలైన ఆలోచనా మార్పులు, వివిధ స్ఫూర్తిదాయక వ్యక్తుల ప్రభావం, వ్యక్తిగత, సామాజిక పోరాటం ఒక విప్లవాత్మక దృక్కోణాన్ని, సమాజానికి ఒక కొత్త దిశను సూచించే మార్గదర్శకత్వాన్ని కలిగించాయి.

 భారత నాస్తిక సమాజం స్థాపన

    సమాజంలోని  అసమానతలు, మూఢవిశ్వాసాలు, సామాజిక అన్యాయాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో జయగోపాల్ 1972 ఫిబ్రవరి 13న విశాఖపట్నంలో ‘భారత నాస్తిక సమాజం’ (భా.నా.స.) ను స్థాపించారు. సి. పావనమూర్తి (అంబేద్కర్ మిషన్), తుమ్మల వేణుగోపాలరావు, కృష్ణాబాయి, శారద, రంగనాయకమ్మ, పొలిశెట్టి హనుమయ్య గుప్త (గాంధేయవాది), టి శ్రీరామమూర్తి, కె.యన్. చలం మున్నగు ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు ఈ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రారంభ దశలో భా.నా.స. ప్రధానంగా స్థానిక స్థాయిలోనే కార్యకలాపాలు సాగించినప్పటికీ డా. జయగోపాల్ చొరవ, అంకితభావం, పట్టుదల, దృఢ సంకల్పం, కృషితో సంస్థ అనతి కాలంలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి, జనాదరణ పొందింది. భా.నా.స కు ప్రముఖ కవి శ్రీశ్రీ శాశ్వత సభ్యతం తీసుకున్న మొదటి సభ్యుడు. సిద్ధాంతం, ఆచరణకు సమాన ప్రాధాన్యత ఇచ్చి నాస్తిక సిద్దాంతాలను బలంగా స్థాపించారు. ఇతర రాష్ట్రాల్లోని భావజాల ఉద్యమాలతో సోదర సంబంధాలు ఏర్పరచడంలో ఆయన చేసిన పని ఒక సమగ్ర, సంఘీభవించబడిన సంఘాన్ని సృష్టించడానికి దోహదపడడింది. డా. జయగోపాల్ నాస్తిక మరియు హేతువాద చర్చలకు సరైన దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు. 

 పరారైన బాలశివయోగి

1977 నుండి 1980 మధ్య కాలంలో విశాఖపట్నంలో రాష్ట్ర రాజకీయ నాయకులలో ఒక అవతారమూర్తిగా వెలసిన ‘బాలశివయోగి’ పై భా.నా.స. బహిరంగ సభలు, వివిధ చర్చా సమావేశాలు, విమర్శలు నిర్వహించింది. అందుకు విద్యార్థి సంఘాలు కూడా అండగా నిలిచాయి. ఆనాడు ఆంధ్రా యూనివర్సిటీలో యస్.ఎఫ్.ఐ. విద్యార్థి నాయకుడుగా ఉన్న నేటి సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు బి.వి రాఘవులు జయగోపాల్ కు తోడుగా నిలిచి పెద్ద ఉద్యమం చేశారు. ఈ చర్యలు బాలశివయోగి గూర్చి ఏర్పడిన ప్రాచుర్యాన్ని ఒకవైపు తగ్గించడమే కాకుండా  ప్రజల్లో ఆలోచనా శక్తిని పెంచాయి. ప్రజా ఉద్యమం వల్ల బాలశివయోగి విశాఖపట్నం వదిలి పరారయిన సంగతి అప్పట్లో పత్రికల్లో సంచలన వార్తలుగా ప్రతిధ్వనించాయి.

బయటపడిన బాబాల బండారం 

    పుట్టవర్తి సాయిబాబా మహిమలను ఎండగట్టెందుకు పూనుకున్న జయగోపాల్ ప్రేమానంద్ తో కలిసి 15 రోజుల విజ్ఞానయాత్రలో పాల్గొని 262 మంది భా.నా.స. కార్యకర్తలతో పుట్టవర్తి ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక పోలీసులు వారిని అరెస్టు చేసి బుక్కపట్నం పోలీసు స్టేషనులో నిర్బంధించారు. ఇది సమాజంలో రాజకీయ వర్గాలలో నాస్తిక సిద్ధాంతాలపై ఉన్న విరోధాన్ని మరింత గాఢం చేసిన ఘటనగా నిలిచింది. 1976 లో ఎ.టి. కోవూరు గారితో కలిసి ‘బాబాల బండారం’ అనే అంశంపై చేసిన ప్రదర్శన విశాఖపట్నంలో భారీగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రదర్శన వల్ల సంబంధిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు .

Share this post

One thought on “నిర్భయ నాస్తికవాది డాక్టర్ జయగోపాల్

  1. I loved as much as you will obtain performed right here. The comic strip is attractive, your authored subject matter stylish. nevertheless, you command get bought an nervousness over that you wish be handing over the following. ill indubitably come further earlier again as exactly the similar nearly very regularly inside case you protect this hike.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన