నకిరేకల్‌లో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
నకిరేకల్: రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా, ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం పనిచేస్తోందని చెప్పారు.
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించే పథకాలను అమలు చేస్తూ, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే కొందరు ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారని సీఎం అన్నారు. అయితే సూర్యుడు ఉదయించినంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, 3.48 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్, రైతుల రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను వివక్ష లేకుండా అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
సభలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నకిరేకల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల్లో:
- రూ.9.85 కోట్లతో నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) భవన నిర్మాణం.
- రూ.200 కోట్లతో నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం.
- రూ.3.62 కోట్లతో మునిపంపుల గ్రామంలో 1×5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్, 33/11 KV సబ్‌స్టేషన్, 33 KV, 11 KV విద్యుత్ లైన్లు, కంట్రోల్ రూమ్ నిర్మాణం.
- రూ.2.74 కోట్లతో కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో 1×5 MVA PTRతో 33/11 KV సబ్‌స్టేషన్, 33 KV, 11 KV విద్యుత్ లైన్ల ఏర్పాటు.
- రూ.20 కోట్లతో నకిరేకల్ మండలంలో సమీకృత మండల స్థాయి కార్యాలయాల (MDO/MRO Complex) నిర్మాణం.
- రూ.45.60 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు. నకిరేకల్–గురజాల రోడ్డు నుంచి బైరౌనిబండ వరకు, బైరౌనిబండ నుంచి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్డు వరకు రహదారి అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నారు.
- రూ.1.10 కోట్లతో నకిరేకల్‌లో ఎక్సైజ్ శాఖ భవన నిర్మాణం.

